Mann Ki Baat: 'ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో క్లాత్ సంచులు వాడాలి'; దేశ ప్రజలకు మోదీ పిలుపు
స్వచ్ఛ భారత్ అభియాన్‌లో దేశ ప్రజలందరూ భాగస్వాములు కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 98వ 'మన్ కీ బాత్' ప్రసంగంలో ప్రధాని మోదీ కీలక అంశాలపై మాట్లాడారు. 'మన్ కీ బాత్'లో హర్యానా యువత చేస్తున్న స్వచ్ఛతా ప్రచారాన్ని ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రస్తావించారు. హర్యానాలో దుల్హేడి గ్రామ యువకులు భివానీ నగరాన్ని శుభ్రం చేసేందుకు చేస్తున్న కృషిని మోదీ అభినందించారు. ఒడిశాలోని కేంద్రపాడ జిల్లా నివాసి కమలా ఆధ్వర్యంలోని స్వయం సహాయక బృందం గురించి మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు. ప్లాస్టిక్ వస్తువులు, సంచులతో ఈ బృందం బుట్టలు, మొబైల్ స్టాండ్‌లు తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో దేశ ప్రజలు క్లాత్ బ్యాగ్‌లను వినియోగించాలని ప్రధాని మోదీ కోరారు.
'త్రిబేణి కుంభో మోహోత్సవ్' పునరుద్ధరణపై మోదీ హర్షం
భారతీయ బొమ్మల గురించి కూడా ప్రధాని మోదీ మన్ కీ బాత్‌లో చెప్పారు. భారతీయ బొమ్మలతో పాటు అవి చెప్పే కథ రూపాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారతీయ బొమ్మలకు విదేశాల్లో కూడా డిమాండ్ పెరిగిపోయిందని ప్రధాని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లోని బాన్స్‌బేరియాలో 'త్రిబేణి కుంభో మోహోత్సవ్' పునరుద్ధరణపై ప్రధాని నరేంద్ర మోదీ ఆనందం వ్యక్తం చేశారు. 700 సంవత్సరాల క్రితం ఆపేసిన ఈ ఉత్సవాన్ని తిరిగి ప్రారంభించడంపై అభినందనలు తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దీన్ని ప్రారంభించాల్సి ఉందని, కానీ కుదరలేదని చెప్పారు. రెండేళ్ల క్రితం స్థానికులు 'త్రిబేని కుంభో పొరిచలోన శోమితి' ద్వారా పండగను మళ్లీ ప్రారంభించారని పేర్కొన్నారు. ఈ ఏడాది ఈ వేడుక ఊపందుకున్నట్లు మోదీ వివరించారు.