ప్రధాని మోదీతో జర్మన్ ఛాన్సలర్ భేటీ; రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ద్వైపాక్షిక అంశాలపై చర్చ
ఈ వార్తాకథనం ఏంటి
రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం భారత్‌కు వచ్చిన జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు కీలక అంశాలపై చర్చలు జరిపారు.
కోవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్-రష్యా యుద్ధం వంటి సంక్షోభాలు ప్రపంచాన్ని, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలను ఎలా ప్రభావితం చేశాయనే దాని గురించి మాట్లాడుకున్నారు.
అలాగే క్లీన్ ఎనర్జీ, ట్రేడ్, కొత్త టెక్నాలజీల రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంపై చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపారు.
ఇరువురు నేతల చర్చల అనంతరం ప్రధాని మోదీ విలేకరులతో మాట్లాడారు. ఉక్రెయిన్ వివాదాన్ని దౌత్యం, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భారత్ మొదటి నుంచి చెబుతోందని స్పష్టం చేశారు.
ప్రధాని మోదీ
రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా మెరుగుపడ్డాయ్: ప్రధాని
ప్రధాని మోదీ-ఓలాఫ్ స్కోల్జ్ మధ్య జరిగిన చర్చల్లో ద్వైపాక్షిక సంబంధాలపైనే ప్రత్యేక దృష్టి సారించినట్లు ప్రధాని మాటల ద్వారా స్పష్టమవుతోంది.
గత కొన్ని సంవత్సరాలుగా రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలు బాగా మెరుగుపడ్డాయని ప్రధాని మోదీ చెప్పారు. 'మేక్ ఇన్ ఇండియా', ఆత్మనిర్భర్ భారత్ కారణంగా నేడు అన్ని రంగాలలో కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. ఈ అవకాశాలపై జర్మనీకి ఉన్న ఆసక్తి భారత్‌ను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు.
సీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు గట్టి చర్య అవసరమని ఇరు దేశాలు అంగీకరిస్తున్నాయని మోదీ అన్నారు.
ఇరు దేశాల మధ్య సంబంధాలపై ముందు రోజు స్కోల్జ్ స్పందించారు. జర్మనీ, భారతదేశం మధ్య సంబంధాలను తాము మరింత బలోపేతం చేస్తామని స్కోల్జ్ చెప్పారు.