Telangana: హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు హైస్పీడ్ కారిడార్లలో క్షేత్రస్థాయి పనులు
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు ప్రతిపాదిత హైస్పీడ్ (బుల్లెట్) రైలు కారిడార్‌ల నిర్మాణ ప్రక్రియలో కీలక ముందడుగు పడుతోంది. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన ఎలైన్‌మెంట్‌ను ఖరారు చేసే దిశగా క్షేత్రస్థాయిలో అధికారులు సర్వే పనులను ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా నుంచి నల్గొండ, వికారాబాద్ జిల్లాల వైపు ప్రత్యేక సర్వే బృందాలు పలు ప్రాంతాల్లో గుర్తులు వేస్తూ పరిశీలనలు కొనసాగిస్తున్నాయి. హైదరాబాద్-చెన్నై బుల్లెట్ రైలు కారిడార్ కోసం శంషాబాద్, మహేశ్వరం, కందుకూరు, యాచారం మండలాల మీదుగా నల్గొండ జిల్లా నాంపల్లి మండలం వరకు సర్వే చేపట్టారు. అలాగే హైదరాబాద్-బెంగళూరు కారిడార్ కోసం శంషాబాద్, షాబాద్ మండలాల పరిధిలో గత పది రోజులుగా క్షేత్రస్థాయి పరిశీలనలు కొనసాగుతున్నాయి.
వివరాలు
హైస్పీడ్ రైలు కారిడార్‌లకు సంబంధించి తొలి దశలో ఏరియల్ సర్వే
సర్వేలో భాగంగా పొలాలు,ఇతర భూభాగాల్లో ఎరుపు,తెలుపు రంగులతో ప్రత్యేక గుర్తులు వేస్తున్నారు. యాచారం మండలంలోని కురుమిద్ద, మేడిపల్లి, మంకీస్‌గూడెం, తక్కళ్లపల్లి, చింతపట్ల, నల్లవెల్లి, మందన, గౌరెల్లి గ్రామాల పరిధిలో ఇప్పటికే మార్కింగ్ పనులు పూర్తయ్యాయి. ఈ గుర్తులను కారిడార్ ఎలైన్‌మెంట్‌ను నిర్ధారించడం, సర్వే పాయింట్లను గుర్తించడం, భూసేకరణ అవసరాలను అంచనా వేయడం కోసం ఉపయోగిస్తున్నట్లు సమాచారం. హైస్పీడ్ రైలు కారిడార్‌లకు సంబంధించి తొలి దశలో ఏరియల్ సర్వే నిర్వహించిన అధికారులు ప్రస్తుతం సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని కొనసాగిస్తున్నారు. ఆ అధ్యయనంలో భాగంగానే ఇప్పుడు క్షేత్రస్థాయిలో రూట్‌ను ఖరారు చేసే ప్రక్రియను వేగవంతం చేశారు. సర్వే పూర్తయిన అనంతరం తుది ఎలైన్‌మెంట్, స్టేషన్ల స్థానాలు, అవసరమైన భూసేకరణ వివరాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.