Loading...
POK: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ఎన్నికలు.. మానవ హక్కుల ఉల్లంఘనలను దాచిపెట్టే యత్నమే: భారత్
పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ఎన్నికలు.. మానవ హక్కుల ఉల్లంఘనలను దాచిపెట్టే యత్నమే: భారత్

POK: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ఎన్నికలు.. మానవ హక్కుల ఉల్లంఘనలను దాచిపెట్టే యత్నమే: భారత్

వ్రాసిన వారు Moogati Shabari
Jul 28, 2026
06:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (PoK)లో నిర్వహిస్తున్న శాసనసభ ఎన్నికలపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ ప్రాంతంలో కొనసాగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు, ప్రజలపై జరుగుతున్న అణచివేతను ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టేందుకు పాకిస్థాన్‌ చేపడుతున్న కపట చర్యల్లో ఈ ఎన్నికలు కూడా భాగమేనని భారత ప్రభుత్వం విమర్శించింది. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జయస్‌వాల్‌ స్పష్టం చేశారు. రణ్‌ధీర్‌ జయస్‌వాల్‌ మాట్లాడుతూ.. పాక్‌ ఆక్రమణలో ఉన్న కశ్మీర్‌ ప్రాంతం ఎప్పటికీ భారతదేశానికి అంతర్భాగమేనని మరోసారి పునరుద్ఘాటించారు. ఆ ప్రాంతంలో నిర్వహిస్తున్న ఎన్నికలు ప్రజాస్వామ్య ప్రక్రియ కాదని, అక్రమ ఆక్రమణను సమర్థించుకునే ప్రయత్నమేనని పేర్కొన్నారు.

వివరాలు

ప్రజల్లో పెరిగిన అసంతృప్తి..

అక్కడ జరుగుతున్న తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనలు, ప్రజలపై కొనసాగుతున్న అణచివేత, ఆర్థిక దోపిడీ, ప్రాథమిక హక్కుల హరణ వంటి అంశాలను ప్రపంచం దృష్టికి రాకుండా మళ్లించే ఉద్దేశంతోనే ఈ ఎన్నికల తతంగాన్ని నిర్వహిస్తున్నారని ఆరోపించారు.

ఇటీవల పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో చోటుచేసుకున్న ప్రజా ఆందోళనలు కూడా ఈ అన్యాయ పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో పెరిగిన అసంతృప్తికి నిదర్శనమని ఆయన అన్నారు.

వివరాలు

తొలి దశ పోలింగ్‌పై రిగ్గింగ్‌ ఆరోపణలు..

ఇదిలా ఉండగా, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని 45 అసెంబ్లీ స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

జులై 27న జరిగిన తొలి విడతలో 13 స్థానాలకు పోలింగ్‌ నిర్వహించారు.

ఈ దశలో పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ (PML-N) తొమ్మిది స్థానాల్లో విజయం సాధించగా, మిగిలిన నాలుగు స్థానాలను పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (PPP) గెలుచుకున్నట్లు అక్కడి ఎన్నికల సంఘం ప్రకటించింది.

మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు చెందిన పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్‌సాఫ్‌ (PTI) ఈ ఎన్నికల్లో పాల్గొనలేదు.

అయితే తొలి దశ పోలింగ్‌లో పెద్ద ఎత్తున రిగ్గింగ్‌ జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తడం గమనార్హం.

ADVERTISEMENT