Page Loader
Canara Bank: కర్ణాటకలో కెనరా బ్యాంకులో భారీ దోపిడీ.. 59 కిలోల బంగారం గల్లంతు!
కర్ణాటకలో కెనరా బ్యాంకులో భారీ దోపిడీ.. 59 కిలోల బంగారం గల్లంతు!

Canara Bank: కర్ణాటకలో కెనరా బ్యాంకులో భారీ దోపిడీ.. 59 కిలోల బంగారం గల్లంతు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 03, 2025
10:25 am

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేసిన భారీ బ్యాంకు దోపిడీ వెలుగులోకి వచ్చింది. విజయపుర జిల్లాలోని మంగోలి గ్రామంలో ఉన్న కెనరా బ్యాంకు శాఖ నుంచి దొంగలు ఏకంగా 59 కిలోల బంగారాన్ని అపహరించడం తీవ్ర కలకలానికి దారితీసింది. మే 24, 25 తేదీలను బ్యాంకు సెలవుల నేపథ్యంలో మూసివేయగా, మే 26న ప్యూన్ వచ్చి షట్టర్ తాళాలు పగలగొట్టబడినట్లు గమనించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలన చేపట్టారు. విజయపుర జిల్లా ఎస్పీ లక్ష్మణ్ బీ. నింబర్గి ఈ దోపిడీని ధృవీకరిస్తూ, దొంగలు బ్యాంకులోకి ప్రవేశించి బంగారం అపహరించారని స్పష్టం చేశారు.

Details

దర్యాప్తు కోసం ఎనిమిది ప్రత్యేక బృందాలు

దొంగిలించిన బంగారం మొత్తం 59 కిలోలు కాగా, ఇవి బ్యాంకు సొంతంగా కాకుండా గ్రాహకులు తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలే అని తెలిపారు. ఈ ఘటనతో తాకట్టు పెట్టిన ఖాతాదారులలో తీవ్ర ఆందోళన నెలకొంది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఈ దోపిడీ మే 24 అర్ధరాత్రి నుంచి మే 25 రాత్రి మధ్యలో జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఘటన తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఎనిమిది ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. వీటిలోని బృందాలు సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తూ, చోరీ జరిగిన సమయంలో అనుమానాస్పద కదలికలపై దృష్టి సారించాయి. దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

Details

రికవరీ కోసం ప్రయత్నిస్తున్న అధికారులు

ఈ ఘటన రాష్ట్రంలో ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న అత్యంత భారీ బ్యాంకు దోపిడీల్లో ఒకటిగా నమోదు కాగా, దోషులను త్వరగా పట్టుకుని బంగారం రికవరీ చేయాలని పోలీసు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు, ఈ ఘటనతో బ్యాంకుల భద్రతపై పెద్ద ప్రశ్నార్థకం నెలకొనగా, భద్రతా చర్యలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.