Passport Fees: పాస్‌పోర్ట్ ఫీజులు భారీగా పెంపు.. జులై 1 నుంచి కొత్త ఛార్జీలు అమలు
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం పాస్ పోర్ట్ సేవల ఫీజులను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సవరించిన ఈ కొత్త రుసుములు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. 36 పేజీలు, 60 పేజీల పాస్‌పోర్ట్‌లు, తత్కాల్ సేవలు, మైనర్ల దరఖాస్తులు, పాస్‌పోర్ట్ పునరుద్ధరణతో పాటు ఇతర అనుబంధ సేవలకు కూడా కొత్త ఫీజులు వర్తించనున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్‌కు రూ.1,500 వసూలు చేస్తుండగా, జులై 1 నుంచి అది రూ.2,500కు పెరగనుంది. ఇదే తత్కాల్ పాస్‌పోర్ట్‌కు ప్రస్తుతం ఉన్న రూ.3,500 ఫీజును రూ.5,000గా నిర్ణయించారు. 60 పేజీల పాస్‌పోర్ట్‌కు ప్రస్తుతం రూ.2,000 చెల్లిస్తుండగా,కొత్తగా రూ.3,500 వసూలు చేయనున్నారు. తత్కాల్ సేవను ఎంచుకునే వారు రూ.6,000 చెల్లించాల్సి ఉంటుంది.
వివరాలు
పాస్‌పోర్ట్ ఫీజు రూ.1750కి పెంపు
18 ఏళ్లలోపు దరఖాస్తుదారులకు ప్రస్తుతం ఉన్న రూ.1,000 పాస్‌పోర్ట్ ఫీజును రూ.1,750కు పెంచారు. తత్కాల్ సేవకు కొత్తగా రూ.4,250 రుసుము నిర్ణయించారు. మైనర్ల పాస్‌పోర్ట్ పోయినా లేదా దెబ్బతిన్నా,కొత్త పాస్‌పోర్ట్ జారీకి సాధారణ కేటగిరీలో రూ.4,250, తత్కాల్ కింద రూ.6,750 చెల్లించాల్సి ఉంటుంది. జులై 1 లేదా ఆ తర్వాత సమర్పించే అన్ని పాస్‌పోర్ట్ దరఖాస్తులకు ఈ కొత్త ఫీజులే వర్తిస్తాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) స్పష్టం చేసింది. పాస్‌పోర్ట్స్ చట్టం-1967లోని సెక్షన్-24 కింద జూన్ 20న జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు ప్రయాణ పత్రాలు, పాస్‌పోర్ట్‌కు సంబంధించిన ఇతర సేవల రుసుముల్లో కూడా మార్పులు చేశారు. భారత్‌లో జారీ చేసే అత్యవసర ధ్రువపత్రాలు (ఎమర్జెన్సీ సర్టిఫికెట్లు) ఇప్పటిలాగే ఉచితంగానే అందిస్తారు.
వివరాలు
2012లో పాస్‌పోర్ట్ ఫీజుల్లో సవరణలు
అయితే విదేశాల్లో వాటికి దరఖాస్తు చేస్తే 15 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ ఆఫ్ ఐడెంటిటీకి భారత్‌లో రూ.1,000, విదేశాల్లో 50 డాలర్ల ఫీజు నిర్ణయించారు. పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (PCC), సరెండర్ సర్టిఫికెట్, గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్ వెరిఫికేషన్‌తో పాటు ఇతర పాస్‌పోర్ట్ సంబంధిత ధ్రువపత్రాలకు భారత్‌లో రూ.750, విదేశాల్లో 40 డాలర్ల రుసుము వసూలు చేయనున్నారు. పాస్‌పోర్ట్ ఫీజుల్లో చివరిసారిగా 2012లో సవరణలు జరిగాయి. అప్పట్లో 36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్ ఫీజును రూ.1,000 నుంచి రూ.1,500కు, తత్కాల్ పాస్‌పోర్ట్ ఫీజును రూ.2,500 నుంచి రూ.3,500కు ప్రభుత్వం పెంచింది.
వివరాలు
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో చెల్లుబాటయ్యే 12 పత్రాల్లో పాస్‌పోర్ట్ కూడా ఒకటి
మరోవైపు, పాస్‌పోర్ట్ పౌరసత్వాన్ని రుజువు చేసే పత్రం కాదని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవల స్పష్టం చేయడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందిస్తూ, దేశంలోని పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో చెల్లుబాటయ్యే 12 పత్రాల్లో పాస్‌పోర్ట్ కూడా ఒకటేనని స్పష్టం చేసింది. ఇటీవల బిహార్, అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడులో నిర్వహించిన ఎస్‌ఐఆర్ ప్రక్రియలో కూడా పాస్‌పోర్ట్‌ను చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రంగా స్వీకరించామని, ఆ నిబంధనల్లో ఎలాంటి మార్పు చేయలేదని ఎన్నికల కమిషన్ వెల్లడించింది.