Medigadda tour: మేడిగడ్డకు సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీని సందర్శించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్, సీపీఐ, ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బయలుదేరారు. మొత్తం నాలుగు బస్సుల్లో అసెంబ్లీ నుంచి మేడిగడ్డకు పయనమయ్యారు. అయితే ఈ సందర్శనకు బీజేపీ, బీఆర్ఎస్ దూరంగా ఉన్నాయి. మంగళవారం జరగాల్సిన శాసనసభను వాయిదా వేసి.. కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభ్యలను మేడిగడ్డకు సందర్శనకు రావాలని ఆహ్వానించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. మేడిగడ్డ పర్యటనలో భాగంగా బ్రిడ్జి, కుంగిన పిల్లర్లను ఎమ్మెల్యేలు పరిశీలించనున్నారు. అలాగే సాయంత్రం 5 గంటలకు ప్రాజెక్టుపైనే పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.
మిగతా బ్యారేజీలు కూడా చూడాలి: హరీష్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు ఎమ్మెల్యేలను ఆహ్వానించడంపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. అసెంబ్లీలో అధికార పక్షం మాట్లాడిన తర్వాత.. ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకపోవడం సభా సంప్రదాయాలకు విరుద్ధమన్నారు. కాళేశ్వరం సమగ్ర స్వరూపం ఎంటి అనేది చాలా మందికి తెలియదని హరీష్ రావు అన్నారు. బ్యారేజీలో ఒకటి రెండు పిల్లర్లు కుంగిపోతే కాంగ్రెస్ నాయకులు కోడి గుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మిగతా బ్యారేజీలను కూడా ఎమ్మెల్యేలకు చూపించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.