దేశంలోనే పొడవైన స్కైవాక్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. ట్రాఫిక్ కష్టాలకు చెక్
దేశంలోనే అత్యంత పొడవైన ఉప్పల్ స్కైవాక్ ను తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ట్రాఫిక్ సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు నాలుగేళ్ల క్రితం దీని నిర్మాణం మొదలుపెట్టారు. హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్ జంక్షన్ లో 4 ప్రధానమైన రోడ్లను పాదాచారులు సులభంగా దాటేందుకు హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో దీని నిర్మాణం రూపుదిద్దుకుంది. సుమారు 660 మీటర్ల మేర సిద్ధమైన ఈ స్కైవాక్ నిర్మాణానికి రూ.25 కోట్లు ఖర్చయ్యాయి. ఉప్పల్ రింగ్ రోడ్డు పరిధిలోని ఉప్పల్, ఎల్బీనగర్, సికింద్రాబాద్ సహా రామంతాపూర్ కు వెళ్లే నాలుగు మార్గాల్లోనూ ఈ ఆకాశవంతెనను నిర్మించారు. అనంతరం ఉప్పల్ మెట్రో స్టేషన్ లోకి నేరుగా అనుసంధానం చేశారు. స్కై వాక్ ఎక్కేందుకు ఎస్కలేటర్లు, లిఫ్టులను సైతం పొందుపరిచారు.
ఉప్పల్ స్కైవాక్ నిర్మాణ ప్రత్యేకతలివే..
నిర్మాణ వ్యయం : రూ.25 కోట్లు నిధులు : రాష్ట్ర ప్రభుత్వం పొడవు : 660 మీటర్లు వెడల్పు : 3, 4, 6 మీటర్ల చొప్పున మెట్రో స్టేషన్ : ఉప్పల్ మెట్రో ప్రయాణికులు : 25-30 వేల మంది రింగురోడ్డులో పాదచారుల సంఖ్య : సుమారు 20 వేలు పాదచారుల కోసం టాయిలెట్లనూ అందుబాటులోకి తెచ్చారు. ఎండ, వర్షం నేరుగా పాదాచారులపై పడకుండా విదేశాల నుంచి తెప్పించిన ప్రత్యేక రూఫ్‌లతో స్కైవాక్ టాప్ ను తీర్చిదిద్దారు. భద్రతా చర్యల్లో భాగంగా స్కైవాక్ పరిసర ప్రాంతాల్లో సీసీటీవీలను సైతం సిద్ధం చేశారు. నిరంతరం రోడ్లు, జనాలను పర్యవేక్షించేందుకు ఓ ప్రత్యేక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడం విశేషం.