సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్.. డబ్బులు, మద్యం పంచుకుండా గెలిపించాలని సూచన
తెలంగాణ పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ప్రభుత్వం విద్యా దినోత్సవాన్ని నిర్వహించింది. ఈ నేపథ్యంలో మంత్రి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తొలుత నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేటలో పాఠశాల సముదాయ భవనాలను ప్రారంభించారు. దీని నిర్మాణానికి ప్రభుత్వం రూ. 8 కోట్ల నిధులను వెచ్చించింది. అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన మంత్రి, కరీంనగర్ ఎంపీతో ప్రజలకు అరపైసా న్యాయం జరగలేదన్నారు. ప్రజల దయ ఉంటే మళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తానని, ఆ మేరకు పనిచేస్తానని చెప్పుకొచ్చారు. అయితే ఎన్నికల్లో తాను మద్యం పంపిణీ చేయనని, పైసలు కూడా ఇవ్వననే విషయం సిరిసిల్ల ప్రజలకు, తనకు తెలుసన్నారు.
అప్పట్లో స్కూళ్లు ఎలా ఉండేవో, ఇప్పుడెలా ఉన్నాయో పోల్చి చూడాలి : మంత్రి కేటీఆర్
50 సంవత్సరాల్లో పనులేవీ చేయని నేతలు ఇప్పుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూడకుండా, కేవలం చిన్న చిన్న పొరపాట్లను పట్టుకుంటున్నారన్నారు. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా తెలంగాణ ప్రజలు కలుస్తుంటారని, గ్రామీణ ప్రాంతాల్లో చదివిన వారు అగ్రరాజ్యంలో ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. అయితే వీరు ఉన్నత స్థానం చేరేందుకు ఉపాధ్యాయులే కారణమన్నారు. 9 ఏళ్ల క్రితం బడులు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో చూడాలన్నారు. భూముల ధరలను సైతం ఒకప్పుడు ఎలా ఉండేవో, ఇప్పుడెలా మారాయో ఆలోచించాలని కోరారు. త్వరలోనే ఎల్లారెడ్డిపేటకు డిగ్రీ కాలేజీ వస్తుందని, ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉంటే అన్ని అవే వస్తాయన్నారు.