
Hyderabad Metro: ఆ రూట్లలో షార్ట్ లూప్ ట్రిప్పులను నడుపుతున్న హైదరాబాద్ మెట్రో
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌లో ప్రయాణాల కోసం మెట్రోను ఆశ్రయించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పుడు వేసవి కావడంతో మెట్రో ప్రయాణాలు మరింత పెరిగాయి.
దీంతో కొన్ని రూట్లలోని మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రద్దీగా ఉండే మెట్రో స్టేషన్లలో ప్రయాణికులను నియంత్రించేందుకు హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయ తీసుకుంది.
ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉండే అమీర్ పేట్, మెట్టుగూడ, సికింద్రబాద్ మెట్రో స్టేషన్ల నుంచి రాయదుర్గం వెళ్లే రూట్‌లో షార్ట్ లూప్ ట్రిప్పులను నడుపుతున్నట్లు హైదరాబాద్ మెట్రో ప్రకటించింది.
హైదరాబాద్
రాయదుర్గం రూట్‌లో నడిచే మెట్రో రైళ్లలో ఇసుకేస్తే రాలనంత జనం
హైదరాబాద్ మెట్రోకు ప్రయాణికుల తాకిడి పని దినాల్లో ఉదయం, సాయంత్రం వేళ్లలో విపరీతంగా ఉంటుంది. ముఖ్యంగా నాగోల్ నుంచి రాయదుర్గం రూట్‌లో నడిచే మెట్రో రైళ్లలో ఉదయం, సాయంత్రం వేళల్లో ఇసుకేస్తే రాలనంత జనం ఉంటారు.
ఈ క్రమంలో అమీర్ పేట్‌లో ఇంటర్ ఛేంజ్ కావాల్సిన ప్రయాణికులకు నాగోల్ నుంచి వచ్చే రైలు ఎక్కే అవకాశం లేకుండా పోతుంది. దీంతో అమీర్ పేట్ స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది.
మెట్టుగూడ, సికింద్రబాద్‌లోని స్టేషన్ల ప్రయాణికుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈ నేపథ్యంలో దీన్ని గుర్తించిన హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల సౌకర్యార్థం షార్ట్ లూప్ ట్రిప్పులను నడుపుతున్నట్లు ప్రకటించింది.