Ponnala : పొన్నాలకు తెరుచుకున్న బీఆర్ఎస్ తలుపులు.. పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి కేటీఆర్
మాజీ మంత్రి, తెలంగాణ తొలి పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యను బీఆర్ఎస్ పార్టీలోకి మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. ఈ మేరకు హైదరాబాద్ లోని ఆయన ఇంటికి ఎమ్మెల్యే దానం నాగేందర్, దాసోజు శ్రవణ్‌తో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వెళ్లారు. పొన్నాలకు పార్టీలో మంచి స్థానం కల్పిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి పీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్య పనిచేశారు. సీఎం కేసీఆర్ సూచన మేరకే బీఆర్ఎస్ లోకి ఆహ్వానించామని మంత్రి కేటీఆర్ అన్నారు. మరోవైపు ఆదివారం పొన్నాల సీఎం కేసీఆర్‌ను కలవనున్నారు. జనగామలో జరగనున్న భారీ బహిరంగ సభలో అధికార పార్టీలో చేరాలని కోరగా, ఇందుకు పొన్నాల గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
ఆదివారం తుది నిర్ణయం ప్రకటిస్తానన్న పొన్నాల
ఇదే సమయంలో ఆదివారం సీఎం కేసీఆర్ తో భేటీ తర్వాత తన తుది నిర్ణయం ప్రకటిస్తానని పొన్నాల పేర్కొన్నారు. బలహీనవర్గాల నేతలకు సీఎం కేసీఆర్ ఇప్పటికే ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని మంత్రి కేటీఆర్ అన్నారు. 1960లోనే అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసంతో ప్రతిష్టాత్మకమైన నాసాలో పొన్నాల ఇంజినీర్‌గా పనిచేశారని ఆయన గుర్తు చేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఆహ్వానంతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారని నెమరు వేసుకున్నారు. రేవంత్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. వయసులో, అనుభవంలో పెద్ద, బలహీన వర్గాల నేతపై పరుష పదజాలం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. రేవంత్ తొలుత బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్, తర్వాత టీఆర్‌ఎస్, టీడీపీ, ఇప్పుడు కాంగ్రెస్, భవిష్యత్ లో ఎక్కడి వెళ్తారో ఎవరికీ తెలియదని చురకలు అంటించారు.