
Miss World 2025: చార్మినార్.. లాడ్‌బజార్‌లో సుందరీమణుల షాపింగ్.. చౌమొహల్లా ప్యాలెస్ వరకు హెరిటేజ్ వాక్
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ లోని చారిత్రాత్మక చార్మినార్ పరిసరాలు మంగళవారం సాయంత్రం సుందరంగా మారిపోయాయి.
నాలుగు శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ అద్భుత కట్టడం వద్ద 109 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ 2025 పోటీదారులు సందడి చేశారు.
హైదరాబాద్ సందర్శనలో భాగంగా వారు చార్మినార్‌కు వచ్చి అక్కడి వైభవాన్ని ఆస్వాదించారు.
అనంతరం వారు లాడ్‌బజార్ మార్గంగా చౌమొహల్లా ప్యాలెస్ దాకా నిర్వహించిన హెరిటేజ్ వాక్‌లో పాల్గొన్నారు.
సాయంత్రం 5 గంటల సమయంలో పోటీదారులు చార్మినార్‌కు చేరుకున్నారు. అక్కడ వారిని అరబ్బీ మార్ఫా వాయిద్యాల నినాదాల నడుమ రెడ్‌కార్పెట్ పరచి స్వాగతించారు.
అక్కడే ప్రత్యేక ఫొటోషూట్ నిర్వహించారు. తరువాత వారు చార్మినార్‌లోకి వెళ్లి సుమారు అరగంట పాటు అక్కడ గడిపారు.
వివరాలు
గాజుల మోజులో ముద్దుగుమ్మలు
నిర్మాణ శైలి, చారిత్రక నేపథ్యం వంటి అంశాలను తిలకించి, వివరాలను తెలుసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఈ సందర్శనలో 'ఇన్‌టాక్' సంస్థ నిర్వాహకులు, పర్యాటక శాఖ గైడ్‌లు చార్మినార్ ప్రత్యేకతలను వివరించారు.
చార్మినార్ నుండి చుడీబజార్,అక్కడి నుంచి చౌమొహల్లా ప్యాలెస్ వరకు సుమారు 40 నిమిషాల పాటు వీరు హెరిటేజ్ వాక్ చేశారు.
ఈ వాక్‌లో భాగంగా వారు చుడీబజార్‌లోని ప్రసిద్ధ గాజులు,ముత్యాలహారాలు,ఇతర అలంకార వస్తువులను ఆసక్తిగా గమనించారు.
గాజుల తయారీని కొందరు స్వయంగా వీక్షిస్తూ స్థానిక కళాకారుల నైపుణ్యాన్ని చూసి ముగ్ధులయ్యారు.
వ్యాపారులు వారికి గులాబీ పూలతో స్వాగతం పలికారు. పోటీదారులు ఎంచుకున్న గాజులు, అలంకార వస్తువులకు వారు డబ్బు తీసుకోవడాన్ని వ్యాపారులు తిరస్కరించారు.
వివరాలు
ప్రత్యేక దుస్తులతో ఫొటోషూట్
చార్మినార్ ప్రత్యేకతను తమ దేశాల్లో ప్రచారం చేయాలని వ్యాపారులు వారిని కోరారు.
ఇదంతా జరుగుతున్న సమయంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి సాధారణ ప్రజల రాకను నియంత్రించారు.
ఈ కార్యక్రమం కోసం మిస్ వరల్డ్ పోటీదారులను అమెరికా-కరేబియన్, ఆఫ్రికా, ఐరోపా, ఆసియా-ఓషియానా ప్రాంతాలుగా విభజించి ఫొటోషూట్ నిర్వహించారు.
ఈ సందర్శన కోసం ప్రత్యేక డ్రెస్‌కోడ్‌ను పాటించారు. భుజాలు, మోచేతుల వరకు కవర్ అయ్యే విధంగా డిజైన్ చేసిన లాంగ్ ఈవెనింగ్ ఫ్రాక్‌లు, అలాగే ఫ్లాట్ షూలు ధరించి అందగత్తెలు పాల్గొన్నారు.
ఇలా చారిత్రక స్థలంలో విశిష్టంగా తీర్చిదిద్దిన ఫొటోషూట్ చార్మినార్‌కు కొత్త వెలుగు నిచ్చింది.