
Miss World Pageant: మిస్ వరల్డ్ పోటీలకు ముస్తాబవుతున్న హైదరాబాద్
ఈ వార్తాకథనం ఏంటి
మే 7 నుంచి 31 వరకు హైటెక్స్ వేదికగా జరగబోయే "మిస్ వరల్డ్ 2025" పోటీలను పురస్కరించుకొని, నగరాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) భారీ సన్నాహాలు చేపట్టింది.
ఈ క్రమంలో GHMC సుమారు రూ.1.79 కోట్ల బడ్జెట్‌తో అభివృద్ధి పనులకు నాంది పలికింది.
హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలతో పాటు చార్మినార్, ట్యాంక్‌బండ్, రాష్ట్ర సచివాలయం, దుర్గం చెరువు వంటి ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రత్యేకంగా LED విద్యుత్ దీపాలు, థీమ్ లైటింగ్, సెల్ఫీ పాయింట్లు, అలాగే ప్రపంచ సుందరి కిరీటం ఆకారంలో నమూనాలు ఏర్పాటు చేయనున్నట్లు GHMC వెల్లడించింది. ఈ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.
వివరాలు
తెలంగాణ సచివాలయం వద్ద 20 దేశాల జెండాలు
విమానాశ్రయం ప్రధాన రహదారి పక్కన 130 దేశాలకు చెందిన జాతీయ పతాకాలను ఏర్పాటు చేయనున్నారు.
అంతేకాక, "Miss World 2025" అనే బోల్డ్ అక్షరాలతో ఉన్న స్వాగత బోర్డులు ఏర్పాటు చేయడానికి అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణ సచివాలయం వద్ద ప్రత్యేకంగా 20 దేశాల జెండాలు ప్రదర్శించనున్నారు.
దీని కోసం సుమారుగా రూ.28.96లక్షలు ఖర్చవుతుందని అంచనా వేసారు.శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని దుర్గం చెరువు,ఏఎంబీ మాల్,గచ్చిబౌలి,రాయదుర్గం మెట్రో స్టేషన్లు వంటి ప్రదేశాల్లో సెల్ఫీ పాయింట్లు, స్వాగత ఆర్చులు, డాంగ్లర్స్, బంటింగ్స్, LED కిరీటం, ఫెయిరీ క్వీన్ వంటి అలంకరణలు ఏర్పాటు చేయడానికి రూ.34.10 లక్షలతో టెండర్లు పిలవబడ్డాయి.
అదనంగా శిల్పారామం, బయోడైవర్సిటీ పార్కుల్లో విద్యుదీపాల అలంకరణ కోసం మరో రూ.28.32 లక్షలు వెచ్చించనున్నారు.
వివరాలు
చార్మినార్ పరిసరాల కమాన్‌లు, రహదారులపై విద్యుద్దీపాలు
చార్మినార్ సమీపంలోని లాడ్‌బజార్ రహదారికి ప్రత్యేక డెకరేటివ్ లాంతర్ల లైటింగ్‌తో రూపురేఖలు మార్చనున్నారు.
ఇందుకోసం రూ.11.60 లక్షలు ఖర్చు చేయనున్నారు. అలాగే చార్మినార్ పరిసరాల కమాన్‌లు, రహదారులపై విద్యుద్దీపాలను అమర్చనున్నారు.
ఒక ప్రత్యేక సెల్ఫీ పాయింట్‌ను కూడా అక్కడ ఏర్పాటు చేయనున్నారు.
ట్యాంక్‌బండ్ ప్రాంతాన్ని అత్యంత వైభవంగా తీర్చిదిద్దేందుకు రూ.42.48 లక్షలతో రంగురంగుల లైటింగ్ తోరణాలు ఏర్పాటు చేయనున్నారు.
అదనంగా ట్యాంక్‌బండ్, కేబీఆర్ పార్క్, అమీర్‌పేట్, జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్, ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా ప్రాంతాల్లో మరో రూ.33.86 లక్షల వ్యయంతో LED విద్యుత్ దీపాల ప్రకాశంతో ప్రత్యేక శోభ కలిగించనున్నారు.