
Duvvada Srinivas: సస్పెన్షన్ పై స్పందించిన ఎమ్మెల్సీ దువ్వాడ.. అకారణంగా వ్యక్తిగత కారణాలతో సస్పెండ్ చేశారని ఆవేదన..
ఈ వార్తాకథనం ఏంటి
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను పార్టీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుండి అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యాయి.
పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం.
ఈ పరిణామాలపై తొలిసారిగా స్పందించిన దువ్వాడ శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డివల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానని చెబుతూ ఒక వీడియో ద్వారా స్పందించిన దువ్వాడ శ్రీనివాస్, తనకు హోదా, గౌరవం ఇచ్చినందుకు జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
పార్టీకోసం నిబద్ధతతో పనిచేశానని, పార్టీ గళంగా మారిన తనను ప్రత్యర్థులపై ఆగ్రహంగా స్పందించిన అనుభవాలున్నాయని గుర్తు చేశారు.
వివరాలు
సస్పెన్షన్ అనేది తాత్కాలిక విరామం మాత్రమే
ఇంత కష్టపడి పనిచేసిన తనను,ఎటువంటి కారణం లేకుండా,వ్యక్తిగతంగా ఎవరో తీసుకున్న నిర్ణయాలతో సస్పెండ్ చేయడం బాధ కలిగిస్తోందని తెలిపారు.
తాను రాజకీయ బలిగా మారినట్టుగా అనిపిస్తోందని అన్నారు. పార్టీకి ద్రోహం చేయలేదు, అవినీతిలో పాలుపంచుకోలేదు, అధికారాన్ని దుర్వినియోగం చేయలేదని స్పష్టంగా చెప్పారు.
సస్పెన్షన్ అనేది తాత్కాలిక విరామం మాత్రమేనని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇకపై స్వతంత్రంగా తన ప్రజల కోసం పనిచేస్తానని తెలిపారు.రెట్టింపు ఉత్సాహంతో అభిమానుల కోసం కృషి చేస్తానని చెప్పారు.
ప్రతిగ్రామం,ప్రతిఇంటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటానని హామీ ఇచ్చారు.చివరకు అన్నింటికీ కాలమే తీర్పు ఇస్తుందని అన్నారు.
టెక్కలి నియోజకవర్గ ప్రజలను తాను ఎప్పటికీ మరవనని స్పష్టం చేశారు.తాను బతికున్నంతవరకు ఎక్కడ తన అవసరం ఉంటే అక్కడ ప్రత్యక్షంగా ఉండి సేవ చేస్తానని ప్రకటించారు.