LOADING...
Southwest Monsoon: జూన్ 4-5 మధ్య కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు.. వాతావరణ శాఖ అంచనా
జూన్ 4-5 మధ్య కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు.. వాతావరణ శాఖ అంచనా

Southwest Monsoon: జూన్ 4-5 మధ్య కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు.. వాతావరణ శాఖ అంచనా

వ్రాసిన వారు Sirish Praharaju
May 29, 2026
04:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న మండుటెండల నుంచి తక్షణ ఉపశమనం లభించే పరిస్థితులు కనిపించడం లేదు. నైరుతి రుతుపవనాల రాక అంచనాల కంటే ఆలస్యమవుతుండటంతో వేడి ప్రభావం మరికొన్ని రోజులు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. భారత వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం నైరుతి రుతుపవనాలు జూన్ 4 లేదా 5 తేదీల్లో కేరళ తీరాన్ని చేరే అవకాశముంది. మొదటగా మే 26న రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

వివరాలు 

కేరళకు చేరిక ఆలస్యం 

అయితే ఈసారి ఎల్‌నినో ప్రభావం కారణంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకోవడంతో రుతుపవనాల పురోగతి మందగించింది. దీంతో అవి అనుకున్న సమయానికి ముందుకు సాగకపోవడంతో కేరళకు చేరిక ఆలస్యమవుతోంది. కేరళ తీరాన్ని తాకిన అనంతరం రెండు నుంచి మూడు రోజుల వ్యవధిలో తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. గత సంవత్సరం నైరుతి రుతుపవనాలు అంచనా తేదీ కంటే ఎనిమిది రోజుల ముందుగానే మే 24న కేరళను చేరుకున్నాయి. అనంతరం మే 26కే తెలంగాణలోకి ప్రవేశించాయి.

వివరాలు 

ఈ ఏడాది వర్షపాతం తగ్గే అవకాశాలు

మరోవైపు, ఈ ఏడాది సాధారణ స్థాయితో పోలిస్తే దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షపాతం తగ్గే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. ఎల్‌నినో ప్రభావం కారణంగా అనేక రాష్ట్రాల్లో వర్షాల పరిమాణం తగ్గవచ్చని పేర్కొంది. అలాగే జూన్ నెలలో ఉత్తరప్రదేశ్, హరియాణా, పంజాబ్, బిహార్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల పలు ప్రాంతాల్లో వడగాలుల ప్రభావం కొనసాగే అవకాశముందని హెచ్చరించింది.

Advertisement