LOADING...
Vijay: కరూర్‌ ఘటన రాజకీయ కుట్రే.. పోలీసులను నమ్మితే.. నాపైనే నిందలేశారు: సీఎం విజయ్
కరూర్‌ ఘటన రాజకీయ కుట్రే.. పోలీసులను నమ్మితే.. నాపైనే నిందలేశారు: సీఎం విజయ్

Vijay: కరూర్‌ ఘటన రాజకీయ కుట్రే.. పోలీసులను నమ్మితే.. నాపైనే నిందలేశారు: సీఎం విజయ్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 10, 2026
02:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన వెనుక రాజకీయ కుట్ర ఉందని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ ఆరోపించారు. భారీగా ప్రజలు ర్యాలీకి తరలివచ్చారని తెలిసినా,పోలీసులు ముందుగానే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. తాను పోలీసులపై నమ్మకం ఉంచినా, చివరికి జరిగిన మరణాలకు తననే బాధ్యుడిగా నిలబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా కరూర్‌లో పర్యటించిన విజయ్‌,ఆ విషాద ఘటనను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. విజయ్‌ మాట్లాడుతూ.. ఒక వ్యక్తి జీవితంలో ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా, మరచిపోలేని బాధాకరమైన సంఘటనలు తప్పవని అన్నారు. తన రాజకీయ జీవితంలో కరూర్‌ తొక్కిసలాట అలాంటి విషాద ఘట్టమని పేర్కొన్నారు.

వివరాలు 

సమావేశాన్ని రద్దు చేసే పూర్తి అధికారాలు పోలీసులకే ఉన్నాయి: విజయ్ 

ఆ ప్రమాదంలో అనేక కుటుంబాలు తమ ఆప్తులను కోల్పోయాయని, ముఖ్యంగా పలువురు తల్లులు తమ పిల్లలను కోల్పోయిన దృశ్యాలు ఇప్పటికీ తనను కలచివేస్తాయని చెప్పారు. ఆ రోజు ర్యాలీకి భారీగా ప్రజలు తరలివచ్చారని పోలీసులు గుర్తించిన వెంటనే నిర్వాహకులను అప్రమత్తం చేయాల్సిందని, పరిస్థితి అదుపులో లేదని భావిస్తే సమావేశాన్ని రద్దు చేసే పూర్తి అధికారాలు కూడా పోలీసులకే ఉన్నాయని విజయ్‌ అన్నారు. అయితే అలాంటి చర్యలు ఏవీ తీసుకోకుండా పరిస్థితిని చూస్తూ ఉండిపోయారని విమర్శించారు. ఇందుకు అప్పటి డీఎంకే ప్రభుత్వ ఒత్తిడి కారణమై ఉండొచ్చని ఆయన పరోక్షంగా ఆరోపించారు.

వివరాలు 

ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చాను: విజయ్ 

ర్యాలీలో ఏర్పడిన రద్దీని పోలీసులు సమర్థంగా నియంత్రిస్తారనే నమ్మకంతోనే తాను ముందుకు వెళ్లానని విజయ్‌ తెలిపారు. కానీ ఘటన అనంతరం మరణాలకు తననే కారణమంటూ ఆరోపణలు చేశారని అన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత తాను అక్కడి నుంచి పారిపోయానంటూ ప్రత్యర్థులు తప్పుడు ప్రచారం చేశారని, కానీ తాను ఎక్కడికీ వెళ్లలేదని స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చినట్లు మరోసారి వెల్లడించారు. కరూర్‌ విషాదాన్ని జీవితాంతం మరచిపోలేనని విజయ్‌ పేర్కొన్నారు. ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థం తమ పార్టీ తరఫున ప్రత్యేక స్మారక చిహ్నాన్ని నిర్మిస్తామని ప్రకటించారు.

Advertisement

వివరాలు 

డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలపై పరోక్ష విమర్శలు

ఇటీవల తన ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు జరిగిన ప్రయత్నాలపై కూడా విజయ్‌ స్పందించారు. ప్రజల మద్దతు తమ ప్రభుత్వానికి పూర్తిగా ఉందని చెప్పారు. ఎవరెన్ని రాజకీయ ప్రయత్నాలు చేసినా తమ ప్రభుత్వాన్ని అధికారంలో నుంచి దించలేరని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలపై పరోక్ష విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వాల హయాంలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని విజయ్‌ ఆరోపించారు. అయితే తమ పాలనలో ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి తావు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా ప్రజలకు పారదర్శకంగా సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు.

Advertisement

వివరాలు 

బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని విజయ్‌ హామీ

గత ఏడాది సెప్టెంబరులో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కరూర్‌లో టీవీకే పార్టీ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట చోటుచేసుకుని 41 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటన తర్వాత బాధిత కుటుంబాలకు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని విజయ్‌ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు అర్హులైన బాధిత కుటుంబ సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు.

Advertisement