Loading...
Mumbai: ముంబైలో రాకెట్లు,ఆకాశ బాణసంచాపై నవంబర్ 25 వరకు నిషేధం
ముంబైలో రాకెట్లు,ఆకాశ బాణసంచాపై నవంబర్ 25 వరకు నిషేధం

Mumbai: ముంబైలో రాకెట్లు,ఆకాశ బాణసంచాపై నవంబర్ 25 వరకు నిషేధం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 09, 2026
05:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

దీపావళి సందర్భంగా నగరంలో వరుసగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడంతో బ్రిహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో రాకెట్లు, ఆకాశంలో పేలే బాణసంచా కాల్చడంపై నిషేధం విధించింది. నవంబర్ 9 నుంచి నవంబర్ 25వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని ప్రకటించింది. బీఎంసీ పరిధిలోని అన్ని నివాస భవనాలు, భవనాల పైకప్పులు (రూఫ్‌టాప్‌లు), బాల్కనీలు, మురికివాడల ప్రాంతాల్లో ఈ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. అయితే రాకెట్లు, ఆకాశంలో పేలే టపాసులు మినహా ఇతర సాధారణ బాణసంచా కాల్చుకోవచ్చు. ఇందుకు గతంలో అమల్లో ఉన్న చట్టాలు, కోర్టు ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది.

వివరాలు 

ఉత్తర్వులు జారీ చేసిన అదనపు మున్సిపల్ కమిషనర్ ప్రాజక్తా వర్మ-లవాంగరే

అదనపు మున్సిపల్ కమిషనర్ ప్రాజక్తా వర్మ-లవాంగరే ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

రాకెట్లు ఆకాశంలోకి ఎగిరిన తర్వాత ఇళ్ల బాల్కనీలు, కిటికీలు, సులభంగా మంటలు అంటుకునే వస్తువులపై పడే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొన్నారు.

దీనివల్ల అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని వివరించారు.

ఇప్పటికే అధిక జనాభా, ఎత్తైన భవనాలు, ఇరుకైన రహదారులతో ఉన్న ముంబైలో ఇలాంటి ఘటనలు జరిగితే ప్రాణ, ఆస్తి నష్టం ఎక్కువగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

మరోవైపు ప్రజలు బాధ్యతాయుతంగా పండుగ జరుపుకోవాలని ముంబై మేయర్ రీతు తవ్డే విజ్ఞప్తి చేశారు. నివాస ప్రాంతాల్లో బాణసంచా కాల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

వివరాలు 

దీపావళి రాత్రి ముంబైలో మూడు భారీ అగ్నిప్రమాదాలు

రాకెట్ల కారణంగా ఇళ్లలో అగ్నిప్రమాదాలు సృష్టించిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని శివసేన (యూబీటీ) నాయకుడు ఆదిత్య ఠాక్రే డిమాండ్ చేశారు.

కాగా, దీపావళి రాత్రి ముంబైలో మూడు భారీ అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి.

ఈ ఘటనల్లో పలు గుడిసెలు, దుకాణాలు, ఓ గ్యారేజీతో పాటు ఒక వాణిజ్య భవనంలోని కొన్ని భాగాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ వరుస ఘటనల నేపథ్యంలోనే అధికారులు రాకెట్లు, ఆకాశంలో పేలే బాణసంచాపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ADVERTISEMENT