Mumbai: ముంబైని ముంచెత్తనున్న సముద్రం.. మరోసారి ముప్పుపై బీఎంసీ అధ్యయనం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత కలిగిన నగరాల్లో ఒకటైన ముంబైకి సముద్ర మట్టం పెరుగుదలతో ముప్పు పొంచి ఉంది. ఈ శతాబ్దం చివరి నాటికి నగరంలోని కొన్ని ప్రాంతాలు శాశ్వతంగా నీట మునిగే పరిస్థితి రావచ్చన్న అంచనాల నేపథ్యంలో బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మరోసారి సముద్ర ముప్పును అంచనా వేస్తోంది. ఐదేళ్లలో ఇది రెండోసారి చేపడుతున్న అధ్యయనం కావడం గమనార్హం. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ కొత్త వాతావరణ ముప్పు అంచనా ద్వారా ముంబయిలోని 149కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని పరిశీలించనున్నారు.
వివరాలు
సముద్ర మట్టం పెరుగుదలపై ఐరాస హెచ్చరిక
సముద్ర మట్టం పెరిగితే ఏ ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి? అక్కడ ఎంతమంది నివసిస్తున్నారు? గత ఐదేళ్లలో తీర ప్రాంత అభివృద్ధి,భూవినియోగంలో వచ్చిన మార్పులతో ముప్పు ఎంత పెరిగింది? వంటి అంశాలను అధ్యయనం చేయనున్నారు.
ఈ నివేదికను వచ్చే ఏడాది విడుదల చేసే అవకాశం ఉంది.
ఇటీవల ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన నివేదికలోనూ సముద్ర మట్టాల పెరుగుదలపై ఆందోళన వ్యక్తమైంది.
2024లో ప్రపంచ సముద్ర మట్టాలు రికార్డు స్థాయిలో 5.9మిల్లీమీటర్లు పెరిగినట్లు పేర్కొంది.
కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించినా 2100నాటికి కనీసం అర మీటరు మేర సముద్ర మట్టం పెరగవచ్చని అంచనా వేసింది.
పశ్చిమ అంటార్కిటికా మంచు పలకల్లో అస్థిరత ఏర్పడితే ఈ పెరుగుదల రెండు మీటర్ల వరకు ఉండే అవకాశముందని హెచ్చరించింది.
వివరాలు
తీర ప్రాంత మార్పులపై బీఎంసీ దృష్టి
ముంబయి తీర ప్రాంతంలో గత ఐదేళ్లలో భారీ మార్పులు చోటుచేసుకున్నందున కొత్తగా ముప్పు అంచనా వేయాల్సిన అవసరం ఏర్పడిందని ఓ సీనియర్ బీఎంసీ అధికారి తెలిపారు.
పశ్చిమ తీరంలో కోస్టల్ రోడ్డు నిర్మాణం పూర్తవడంతో అరేబియా సముద్రంలో 100 హెక్టార్లకు పైగా భూమిని పూడ్చి వినియోగంలోకి తీసుకొచ్చారు.
ముంబయి తూర్పు ప్రాంతంలో ఉన్న ఉప్పు మైదానాల భూములను అభివృద్ధి చేసేందుకు గుర్తించారు.
నగరంలోని భూవినియోగ విధానంలోనూ మార్పులు వచ్చాయని అధికారి వివరించారు.
ఐక్యరాజ్యసమితి అధ్యయనం ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాల పెరుగుదలను పరిశీలిస్తే.. బీఎంసీ చేపడుతున్న అధ్యయనం మాత్రం ముంబయికే పరిమితం కానుంది.
నగర తీర ప్రాంతాలకు ముప్పు పెరగడానికి కారణమవుతున్న స్థానిక పరిస్థితులను ఇందులో పరిశీలిస్తారు.
వివరాలు
2050 నాటికి ముంబయిలో 80 శాతం ప్రాంతం నీట మునిగే ముప్పు
భవిష్యత్తులో సముద్ర మట్టాలు ఎంత మేర పెరగవచ్చన్నదీ అంచనా వేస్తారు. తీరానికి ఆనుకుని నివసిస్తున్న ప్రజల్లో ఎంతమందికి ప్రమాదం ఉందో గుర్తించనున్నారు.
బీఎంసీ 2022లో విడుదల చేసిన తొలి ముంబయి క్లైమేట్ యాక్షన్ ప్లాన్‌లోనూ నగరానికి ఎదురవుతున్న ప్రధాన వాతావరణ ముప్పులను గుర్తించింది.
తీర ప్రాంతాల్లో వరదలు, పెరుగుతున్న కాలుష్యం, పచ్చదనం తగ్గడం, నగరంలో ఉష్ణోగ్రతలు పెరగడం వంటి వాటిని కీలక సమస్యలుగా పేర్కొంది.
2050 నాటికి ముంబయి ద్వీప నగరంలో దాదాపు 80 శాతం ప్రాంతం నీట మునిగే అవకాశం ఉందని కూడా అప్పట్లో అంచనా వేసింది.
వివరాలు
వేడెక్కుతున్న అరేబియా సముద్రం.. కారణాలివే
ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడం,సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల సముద్ర మట్టాలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
2003 నుంచి 2020 మధ్య అరేబియా సముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగినట్లు 2022 క్లైమేట్ యాక్షన్ ప్లాన్ పేర్కొంది.
పగటి సమయ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత ఏడాదికి సగటున 0.025 డిగ్రీల సెల్సియస్, రాత్రి సమయంలో 0.019 డిగ్రీల సెల్సియస్ చొప్పున పెరిగినట్లు నివేదికలో వివరించింది.
యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్‌కు చెందిన ప్రొఫెసర్, ఐఐటీ బాంబే విజిటింగ్ ప్రొఫెసర్ రఘు ముర్తుగుడ్డే మాట్లాడుతూ.. యూరప్, పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కూడా అరేబియా సముద్రం వేడెక్కడానికి కారణమవుతున్నాయని తెలిపారు.
వివరాలు
కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న ముంబయి.. పెరుగుతున్న ముంపు
గత కొన్నేళ్లుగా వర్షపాతం తీరులో మార్పులు కనిపిస్తున్నాయని, ముంబయిలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు నమోదవుతున్నాయని చెప్పారు.
భారీ వర్షాలకు తోడు ఎగువకు వచ్చే అలలు కలిసినప్పుడు నగరంలో నీటిముంపు తీవ్రత పెరుగుతోందని, ముఖ్యంగా ద్వీప నగరంలో నివసించే ప్రజలకు ఇది పెద్ద ముప్పుగా మారుతోందని వివరించారు.
భారత ఉష్ణమండల వాతావరణ శాస్త్ర సంస్థ (ఐఐటీఎం) సముద్ర శాస్త్రవేత్త, వాతావరణ నిపుణుడు రాక్సీ మాథ్యూ కోల్ మాత్రం ముంబయి భౌగోళిక పరిస్థితులే నగరాన్ని మరింత ప్రమాదంలోకి నెడుతున్నాయని అన్నారు.
వేగంగా జరుగుతున్న నిర్మాణాలు, పెరుగుతున్న కాంక్రీట్ ప్రాంతాలు, భూవినియోగంలో మార్పుల వల్ల వరద నీరు నిలిచే సహజ ప్రాంతాలు తగ్గిపోతున్నాయని చెప్పారు.
నదుల్లో నీటి ప్రవాహానికి కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయని వివరించారు.
వివరాలు
మడ అడవులే ముంబయికి సహజ రక్షణ
బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌ను ఒకప్పుడు మడ అడవులు ఉన్న ప్రాంతంలో నిర్మించారని,రోడ్ల నిర్మాణం, ఆక్రమణల కారణంగా మిథి నది సహజ ప్రవాహం దెబ్బతిని చిన్న కాలువలా మారిందని కోల్ పేర్కొన్నారు.
ముంబయిలో వరదల సమస్య కేవలం వాతావరణ మార్పుల వల్లే కాదని, ప్రణాళిక లేని అభివృద్ధి, సరైన నిర్వహణ లేకపోవడం కూడా ప్రధాన కారణాలని తెలిపారు.
ముంబయి తీర ప్రాంతాల్లోని మడ అడవులు, చిత్తడి నేలలను కాపాడటం నగరాన్ని భవిష్యత్తులో వచ్చే వరదల నుంచి రక్షించేందుకు కీలకమని కోల్ చెప్పారు.
మడ అడవులు, వరద మైదానాలు చాలాకాలంగా నగరానికి సహజ రక్షణగా పనిచేస్తున్నాయని తెలిపారు.
వరద నీరు, బలమైన గాలుల ప్రభావాన్ని తగ్గించడంలో ఇవి ముఖ్యపాత్ర పోషిస్తున్నాయని వివరించారు.
వివరాలు
325 హెక్టార్లలో తగ్గిన మడ అడవులు
ఈ తీర ప్రాంతాలను కాపాడటంతో పాటు విస్తరించడం ద్వారా సముద్ర మట్టం పెరుగుదలను ఎదుర్కొనే ముంబయి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచవచ్చని చెప్పారు.
2022లో విడుదలైన క్లైమేట్ యాక్షన్ ప్లాన్‌లోనూ ముంబయి మడ అడవుల విస్తీర్ణంలో గణనీయమైన మార్పులు నమోదైనట్లు పేర్కొన్నారు.
2008 నుంచి 2021 మధ్య దాదాపు 325 హెక్టార్లలో దట్టంగా ఉన్న మడ అడవులు పలుచబడటం లేదా కోత, మట్టి పేరుకుపోవడం వంటి కారణాలతో సముద్రం ఆటుపోట్ల మధ్య ఉండే బురద మైదానాలుగా మారినట్లు నివేదిక తెలిపింది.
అదే సమయంలో మరో 305 హెక్టార్లలో మడ అడవుల సాంద్రత పెరిగినట్లు వెల్లడించింది.