Loading...
Mumbai Local Train Harassment : ముంబై లోకల్ రైల్లో మహిళపై దాడి.. చేయి కోల్పోయిన బాధితురాలు
ముంబై లోకల్ రైల్లో మహిళపై దాడి.. చేయి కోల్పోయిన బాధితురాలు

Mumbai Local Train Harassment : ముంబై లోకల్ రైల్లో మహిళపై దాడి.. చేయి కోల్పోయిన బాధితురాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 12, 2026
02:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముంబై లోకల్ రైల్లో ప్రయాణిస్తున్న ఓ మహిళపై యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా.. ఆమెను రైల్లోంచి కిందకు తోసేశాడు. ఈ ఘటనలో బాధితురాలు తన ఎడమ చేతిని పూర్తిగా కోల్పోయింది. తలకు తీవ్ర గాయాలై 16 కుట్లు కూడా పడ్డాయి. మహారాష్ట్ర రాజధాని ముంబయిలో జరిగిన ఈ ఘటన ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది.

వివరాలు 

వేధింపులను ఎదిరించడంతో దాడి..

బోరివలి స్టేషన్‌లో విరార్ వెళ్లే లోకల్ రైలు ఎక్కిన ఓ యువతిని ప్రయాణ సమయంలో ఓ యువకుడు లైంగికంగా వేధించాడు.

ఆమె శరీరంపై అసభ్యంగా తాకడంతో బాధితురాలు అతడిని నిలదీసింది.

అయినప్పటికీ నిందితుడు తన ప్రవర్తన మార్చుకోలేదు. దీంతో ఆగ్రహానికి గురైన యువతి తన చెప్పుతో అతడిని కొట్టింది.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

తోటి ప్రయాణికులు జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించినా నిందితుడు వెనక్కి తగ్గలేదు. పైగా మహిళను దూషిస్తూ ఆమెపై దాడికి దిగాడు.

వివరాలు 

రైల్లోంచి తోసేయడంతో చేయి నుజ్జునుజ్జు..

రైలు నైగావ్ స్టేషన్‌కు చేరుకున్న తర్వాత కూడా గొడవ కొనసాగింది.

రైలు ఆగిన సమయంలో నిందితుడు ఆ యువతిని బలవంతంగా కిందకు తోసేశాడు.

దీంతో ఆమె రైలు కోచ్‌ల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో పడిపోయింది.

తిరిగి ప్లాట్‌ఫారమ్‌పైకి చేరుకునేందుకు ప్రయత్నిస్తుండగా రైలు ఒక్కసారిగా కదిలింది.దీంతో ఆమె ఎడమ చేయి రైలు చక్రాల కింద చిక్కుకుంది.

ఈ ప్రమాదంలో మోచేతి వరకు ఎడమ చేతిని కోల్పోయింది. తలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.

వైద్యులు ఆమె తలకు 16 కుట్లు వేశారు. ఘటన జరిగిన వెంటనే అక్కడున్న ప్రయాణికులు, పోలీసు సిబ్బంది స్పందించారు.

బాధితురాలిని ప్లాట్‌ఫారమ్‌పైకి తీసుకొచ్చి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

ఈ గందరగోళాన్ని ఆసరాగా చేసుకున్న నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.

ADVERTISEMENT

వివరాలు 

కుటుంబ బాధ్యతలన్నీ నాపైనే.. న్యాయం చేయండి..

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు మీడియాతో తన ఆవేదనను పంచుకుంది.

"నేను నైగావ్‌కు వెళ్తుండగా ఆ వ్యక్తి నన్ను అసభ్యంగా తాకడం ప్రారంభించాడు. నేను అభ్యంతరం చెప్పినా అతడు తన ప్రవర్తన మార్చుకోలేదు. చివరకు నన్ను రైల్లోంచి కిందకు తోసేశాడు. నా కుటుంబ బాధ్యతలన్నీ నాపైనే ఉన్నాయి. ఇప్పుడు చేయి కోల్పోవడంతో నా జీవితం పూర్తిగా మారిపోయింది. నాకు న్యాయం చేయాలి" అంటూ కన్నీటిపర్యంతమైంది.

బాధితురాలి ఫిర్యాదు, ఘటన తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు కొన్ని గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేశారు.

ADVERTISEMENT

వివరాలు 

హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్..

అయితే ఈ కేసులో పోలీసులు నమోదు చేసిన సెక్షన్లపై బాధితురాలి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

నిందితుడిపై హత్యాయత్నం కింద భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 109 నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

బాధితురాలి కుటుంబానికి మద్దతుగా మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) కూడా రంగంలోకి దిగింది.

జీఆర్పీ (ప్రభుత్వ రైల్వే పోలీసులు) ఉన్నతాధికారులను కలిసి ఈ ఘటనపై చర్చించింది.

ఎఫ్ఐఆర్‌లో త్వరలోనే తగిన కఠినమైన సెక్షన్లను చేరుస్తామని పోలీసులు హామీ ఇచ్చినట్లు సమాచారం.

ADVERTISEMENT