Loading...
Nadendla Manohar: సార్వత్రిక ఎన్నికల ఫార్ములా స్థానిక ఎన్నికలకు వర్తించదు: మనోహర్
సార్వత్రిక ఎన్నికల ఫార్ములా స్థానిక ఎన్నికలకు వర్తించదు: మనోహర్

Nadendla Manohar: సార్వత్రిక ఎన్నికల ఫార్ములా స్థానిక ఎన్నికలకు వర్తించదు: మనోహర్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 17, 2026
01:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ప్రభావం పూర్తిగా తగ్గకముందే స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి. సెప్టెంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశాలపై ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో తమ వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. అధికార కూటమిలోని టీడీపీ,జనసేన,బీజేపీ మధ్య స్థానిక ఎన్నికల్లో పొత్తులు,సీట్ల పంపకాల అంశం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్థానిక ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అమలు చేసిన సీట్ల పంపకాల ఫార్ములాను స్థానిక సంస్థల ఎన్నికలకు యథాతథంగా వర్తింపజేయడం సరైన విధానం కాదని ఆయన స్పష్టం చేశారు.

వివరాలు 

అదే త్యాగాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆశించడం సరికాదు 

స్థానిక పరిస్థితులు, పార్టీ బలాబలాలు, ప్రజాభిప్రాయం ఆధారంగానే జనసేన పోటీ చేసే విధానాన్ని నిర్ణయిస్తుందని తెలిపారు.

2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమి నిర్ణయం తీసుకున్నారని మనోహర్ గుర్తుచేశారు.

అప్పటి రాజకీయ పరిస్థితులను పరిశీలించి, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలనే లక్ష్యంతో జనసేన కొన్ని స్థానాల్లో రాజీ పడిందని, అవసరమైన చోట వెనక్కి తగ్గిందని చెప్పారు.

అయితే అదే త్యాగాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆశించడం సరికాదని ఆయన స్పష్టం చేశారు.

వివరాలు 

ఎన్డీయే కూటమి సమావేశంలో తుది నిర్ణయం

"సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించిన ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ అమలు అవుతుందని భావించకూడదు. పొత్తు ధర్మాన్ని గౌరవిస్తూనే, జనసేనకు బలమైన ప్రాంతాల్లో తప్పకుండా పోటీ చేస్తాం. స్థానిక పరిస్థితులు, పార్టీ బలం ఆధారంగానే మా నిర్ణయాలు ఉంటాయి" అని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

ఈ అంశంపై త్వరలో జరగనున్న ఎన్డీయే కూటమి సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు.

పార్టీ బలోపేతంతో పాటు కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకు రాజకీయ అవకాశాలు కల్పించడంపై కూడా జనసేన ప్రత్యేక దృష్టి పెట్టిందని ఆయన చెప్పారు.

పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న వారికి స్థానిక ఎన్నికల్లో తగిన ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు.

ADVERTISEMENT

వివరాలు 

జనసేన పార్టీ చర్చావేదిక

ఈ లక్ష్యంతోనే'జనసేన పార్టీ చర్చావేదిక'పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని తొలిసారిగా కైకలూరు నుంచి ప్రారంభించామని తెలిపారు.

ఈ వేదిక ద్వారా గ్రామస్థాయిలో జనసైనికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అలాగే వైసీపీ సోషల్ మీడియా వేదికల ద్వారా జరుగుతున్నట్లు ఆరోపిస్తున్న దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని వివరించారు.

కూటమిలో కలిసి పనిచేసే సమయంలో చిన్నచిన్న అభిప్రాయ భేదాలు,సమస్యలు రావడం సహజమేనని నాదెండ్ల మనోహర్ అన్నారు.

అలాంటి అంశాలను పరస్పర అవగాహనతో పరిష్కరించుకుని ముందుకు సాగాలని జనసైనికులకు సూచించారు.

రాష్ట్రంలో రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ విధ్వంసకర రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ADVERTISEMENT

వివరాలు 

నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలి

అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా కూటమిలోని అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆయన కోరారు.

మొత్తంగా చూస్తే, స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన తన రాజకీయ బలాన్ని ప్రతిబింబించేలా పోటీకి సిద్ధమవుతోందనే సంకేతాలను నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు ఇస్తున్నాయి.

అలాగే సీట్ల పంపకాల విషయంలో పార్టీ తన బలాన్ని ఆధారంగా చేసుకుని చర్చలకు వెళ్లనున్నట్లు ఆయన వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది.

ADVERTISEMENT