Operation Sindoor: 'సిందూర్'లో అమరులైంది వీరే.. అధికారికంగా ప్రకటించిన కేంద్రం
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా గతేడాది పాకిస్థాన్‌పై భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'లో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరజవాన్ల పేర్లను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల వివరాలను నేషనల్ వార్ మెమోరియల్ అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసింది. ఈ ఆపరేషన్‌లో ఐదుగురు ఆర్మీ సిబ్బందితో పాటు ఒక అగ్నివీర్ వీరమరణం పొందారు. వారి పేర్లను దేశ రాజధాని దిల్లీలోని ఇండియా గేట్ సమీపంలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నంలో ప్రత్యేక శిలాఫలకంపై శాశ్వతంగా చెక్కనున్నారు.
వివరాలు
అమరవీరుల వివరాలు ఇవి..
సుబేదార్ మేజర్ పవన్ కుమార్ - 10 ఇన్‌ఫాంట్రీ బ్రిగేడ్ హెడ్‌క్వార్టర్స్ రైఫిల్‌మ్యాన్ సునీల్ కుమార్ - జమ్మూకశ్మీర్ లైట్ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్ 4వ బెటాలియన్ లాన్స్ నాయక్ దినేశ్ కుమార్ - 5 ఫీల్డ్ రెజిమెంట్ హవల్దార్ సునీల్ కుమార్ సింగ్ - 237 ఫీల్డ్ వర్క్‌షాప్ సార్జెంట్ సురేంద్ర కుమార్ - ఎయిర్‌ఫోర్స్ 39వ వింగ్ అగ్నివీర్ మురళీ నాయక్ - 851 లైట్ రెజిమెంట్ వీరిలో రైఫిల్‌మ్యాన్ సునీల్ కుమార్‌కు మరణానంతరం దేశంలో మూడో అత్యున్నత యుద్ధ పురస్కారమైన 'వీర చక్ర'ను కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసింది.
వివరాలు
సార్జెంట్ సురేంద్ర కుమార్‌కు 'వాయు మెడల్'
అలాగే సార్జెంట్ సురేంద్ర కుమార్‌కు 'వాయు మెడల్'ను ప్రకటించింది. అమరవీరుల్లో అగ్నివీర్ మురళీ నాయక్ తెలుగు రాష్ట్రానికి చెందినవారు కావడం విశేషం. శ్రీసత్యసాయి జిల్లా కళ్లితండాకు చెందిన ఆయన 2022లో అగ్నివీర్‌గా ఎంపికయ్యారు. తొలి దశలో పంజాబ్, అస్సాంలో విధులు నిర్వహించిన మురళీ నాయక్, 'ఆపరేషన్ సిందూర్' సందర్భంగా జమ్మూకశ్మీర్ సరిహద్దులో విధుల్లో ఉండగా పాకిస్థాన్‌తో జరిగిన ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందారు. కాగా, 2025 ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఆ దాడికి ప్రతీకారంగా మే 7న పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ 'ఆపరేషన్ సిందూర్'ను చేపట్టి లక్ష్యాలను ధ్వంసం చేసింది.