Nandi Theatre Awards: నంది నాటక బహుమతులు-2025, కందుకూరి పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో నాటకరంగానికి సంబంధించిన ప్రతిష్ఠాత్మక పురస్కారాల కోసం దరఖాస్తులను ఆహ్వానించారు. నంది నాటక బహుమతులు-2025, కందుకూరి పురస్కారాలు-2026కు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఎండీ కె.ఎస్. విశ్వనాథన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నంది నాటక అవార్డుల కోసం తెలుగులో రచించిన పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు, నాటికలు, బాలల నాటికలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల నాటికలు, నాటకరంగంపై రచించిన పుస్తకాల విభాగాల్లో దరఖాస్తులు చేసుకోవచ్చని వెల్లడించారు. నాటక సమాజాలు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, వ్యక్తులు ఈ దరఖాస్తులను సమర్పించవచ్చని తెలిపారు.
వివరాలు
రాష్ట్ర స్థాయిలో..
కందుకూరి పురస్కారాలు-2026 కోసం నాటకరంగంలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న పౌరాణిక, సాంఘిక నాటక కళాకారులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, రచయితలు, నాటక సమాజాల వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
రాష్ట్ర స్థాయిలో కందుకూరి రంగస్థల ప్రతిష్ఠాత్మక పురస్కారం, జిల్లా స్థాయిలో కందుకూరి విశిష్ట పురస్కారాలను అందించనున్నట్లు తెలిపారు.
వివరాలు
దరఖాస్తులకు గడువు..
ఆన్‌లైన్‌లో దరఖాస్తులను అక్టోబర్ 20లోగా సమర్పించాలి. పూర్తి వివరాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్థ వెబ్‌సైట్ https://www.apsftvtdc.in ను పరిశీలించాలని అధికారులు సూచించారు.
ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తును ప్రింట్ తీసుకుని, సంబంధిత పత్రాలు, స్క్రిప్టులతో కలిసి ఎండీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్థ, 4వ అంతస్తు, ఎన్‌టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, పండిట్ నెహ్రూ బస్ కాంప్లెక్స్, విజయవాడ-520013 చిరునామాకు అక్టోబర్ 26లోగా పంపించాలి.
వివరాలు
సెప్టెంబర్‌లో నోటిఫికేషన్.. జనవరిలో తుది పోటీలు
ఈ పురస్కారాలకు సంబంధించి సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
అక్టోబర్‌లో ఎంపిక కమిటీలను ఏర్పాటు చేస్తారు. డిసెంబరులో ప్రాథమిక పరిశీలన ఫలితాలు, పురస్కారాల వివరాలను ప్రకటిస్తారు.
2027 జనవరిలో తుది పోటీలు నిర్వహిస్తారు. అదే నెలలో తెనాలిలో పురస్కారాల ప్రదానోత్సవం జరగనుంది.
ఈ మేరకు ప్రభుత్వం ఆదివారం మూడు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది.
84 మందికి కందుకూరి విశిష్ట పురస్కారాలు
కందుకూరి విశిష్ట పురస్కారాలను జిల్లాకు మూడు చొప్పున మొత్తం 84 మందికి అందించనున్నారు.
ఒక్కో పురస్కార గ్రహీతకు రూ.10 వేల నగదు బహుమతి ఇవ్వనున్నారు. గరిష్ఠంగా 100 అవార్డులు అందించేలా నిర్ణయించారు.
పద్యనాటకం, సాంఘిక నాటకం, నాటక రచయితలు, నాటక సమాజాలకు ఈ పురస్కారాలు ఇవ్వనున్నారు.
వివరాలు
16 పురస్కారాలు రిజర్వు
మిగిలిన 16 పురస్కారాలను పద్యనాటకం, సాంఘిక నాటకం, నాటక రచయితలు, సాంకేతిక నిపుణులు, నాటక సమాజాల విభాగాల్లో రిజర్వ్ చేస్తారు.
ఏదైనా జిల్లాలో మరింత అర్హత, ప్రతిభ ఉన్న కళాకారులు ఉన్నట్లు గుర్తిస్తే వారికి ఈ పురస్కారాలను అందించేలా వాటిని కేటాయిస్తారు.
వివరాలు
ఐదుగురి పేర్లతో రంగస్థల పురస్కారాలు
డా.వైఎస్‌ఆర్ రంగస్థల పురస్కారం పేరును ప్రభుత్వం ఇకపై రంగస్థల పురస్కారాలుగా మార్చింది.
ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో నాటకరంగ అభివృద్ధికి అత్యుత్తమ సేవలు అందించిన నాటక సమాజం లేదా పరిషత్తుకు ప్రభుత్వం తన విచక్షణ మేరకు డాక్టర్ వైఎస్‌ఆర్ రంగస్థల పురస్కారాన్ని అందించేది.
ఈ పురస్కారం కింద రూ.5 లక్షల నగదు బహుమతి, ప్రత్యేక మెమెంటో,శాలువా, ప్రశంసా పత్రాన్ని ఏటా నంది నాటకోత్సవ పురస్కారాలతో కలిసి అందించేవారు.
ఇకపై ఈ రంగస్థల పురస్కారాలను ఐదు నాటక పరిషత్తులకు అందించనున్నారు.
స్థానం నరసింహరావు, ఆచార్య ఆత్రేయ, డాక్టర్ గరికపాటి రాజారావు, బండారు రామారావు, డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేర్లతో ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.
వివరాలు
ఎంపిక ప్యానల్‌లో నాటకరంగ ప్రతినిధులు
ఒక్కో పురస్కారానికి రూ.1 లక్ష నగదు, ప్రత్యేక మెమెంటో, శాలువా, ప్రశంసా పత్రాన్ని ప్రతి ఏడాది నంది నాటకోత్సవ పురస్కారాలతో పాటు అందిస్తారు.
రంగస్థల పురస్కారాల పరిశీలన, సిఫార్సుల కోసం ఏర్పాటు చేసే ఎంపిక ప్యానల్‌లో నాటకరంగానికి చెందిన నాటక పరిషత్తులు, నాటక సమాజాల ప్రతినిధులు ఉంటారు.
ఎంట్రీల నిబంధనలో మార్పు
ఇప్పటివరకు నాటకాన్ని కనీసం ఒక్కసారైనా ప్రదర్శించినట్లు నిరూపించుకోవాల్సిన బాధ్యత పూర్తిగా నాటక సమాజంపైనే ఉండేది.
సమర్పించిన సమాచారం తప్పని తేలితే ముందస్తు నోటీసు లేకుండానే ఆ ఎంట్రీని రద్దు చేసేవారు.
అలాగే సంబంధిత నాటక సమాజాన్ని రెండేళ్లపాటు పోటీల నుంచి నిషేధించేవారు. తాజాగా ఈ నిబంధనను ప్రభుత్వం తొలగించింది.