ఒకే దేశంలో రెండు చట్టాలా? ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ ఫైర్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం మధ్యప్రదేశ్‌లో పర్యటించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ చేపట్టిన 'మేరా బూత్ సబ్సే మజ్‌బూత్' ప్రచారంలో కార్యకర్తలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా 'ట్రిపుల్ తలాక్', యూనిఫాం సివిల్ కోడ్ విషయంలో ప్రతిపక్షాలపై మోదీ విరుచుకుపడ్డారు. 'ట్రిపుల్ తలాక్' ఇస్లాం నుంచి విడదీయరానిది అయితే, ముస్లిం మెజారిటీ దేశాలైన ఈజిప్ట్, ఇండోనేషియా, జోర్డాన్, సిరియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ దేశాల్లో దీనిని ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగమైన యూనిఫాం సివిల్ కోడ్ గురించి మాట్లాడుతూ, ఒక కుటుంబంలోని వేర్వేరు సభ్యులకు వేర్వేరు నిబంధనలను కలిగి ఉండటం మంచిది కాదన్నారు. ఒకే దేశంలో రెండు చట్టాలు అమలు అసాధ్యం అన్నారు.
ఓట్ల కోసం ముస్లిం ఆడబిడ్డలకు అన్యాయం చేస్తున్నారు: మోదీ
90శాతం సున్నీ ముస్లింలు ఉన్న ఈజిప్టు 80 నుంచి 90 ఏళ్ల క్రితమే ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేసిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ట్రిపుల్ తలాక్ కోసం వాదించే వారు ఓట్ల కోసం ముస్లిం ఆడబిడ్డలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. ట్రిపుల్ తలాక్ కేవలం మహిళలకు సంబంధించినది కాదని, మొత్తం కుటుంబాలను నాశనం చేస్తుందన్నారు. కొందరు ముస్లిం కుమార్తెలను అణచివేయడానికి వారిపై ట్రిపుల్ తలాక్ ఉచ్చును బిగించాలనుకుంటున్నట్లు ధ్వజమెత్తారు. అందుకే ముస్లిం సోదరీమణులు, కూతుళ్లు నేను ఎక్కడికి వెళ్లినా బీజేపీకి, మోదీకి అండగా నిలుస్తున్నారన్నారు. యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)ని వ్యతిరేకించే వారిపై ప్రధాని విరుచుకుపడ్డారు, వారు తమ ప్రయోజనాల కోసం కొంతమందిని రెచ్చగొడుతున్నారని అన్నారు.