
PM Modi: సైప్రస్ పర్యటనలో నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం తన మూడు దేశాల పర్యటనలో భాగంగా ద్వీపదేశమైన సైప్రస్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా మోదీకి సైప్రస్ ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన 'గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మకరియోస్ III'ను ప్రదానం చేసింది. ఈ గౌరవాన్ని అందుకున్న సందర్భంగా మోదీ స్పందిస్తూ..ఇది 140 కోట్ల భారతీయులకు దక్కిన గౌరవంగా అభివర్ణించారు. సైప్రస్ ప్రభుత్వం, ప్రజలకి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ పురస్కారం రెండు దేశాల సంస్కృతి, సోదరభావం, వసుధైవ కుటుంబకం భావనకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. అలాగే, ఈ అవార్డును భారత్-సైప్రస్ మధ్య ఉన్న స్నేహానికి అంకితం చేస్తున్నట్టు తెలిపారు. ఇరుదేశాల పరస్పర నిబద్ధత శాంతి, భద్రత, సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రత, శ్రేయస్సుపై మరింత బలపడుతుందని మోదీ పేర్కొన్నారు.
Details
ప్రధానికి ఘన స్వాగతం
భవిష్యత్తులో రెండు దేశాల క్రియాశీల భాగస్వామ్యం కొత్త శిఖరాలను అధిరోహించేందుకు దోహదపడుతుందన్న విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేశారు. భారత్-సైప్రస్ కలిసి శాంతియుత, సురక్షిత ప్రపంచ నిర్మాణానికి తోడ్పడతాయని చెప్పారు. ఇక ప్రధాని మోదీ ఆదివారం సాయంత్రం సైప్రస్ చేరుకున్న వేళ.. లార్నాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ స్వయంగా స్వాగతం పలికారు. రెండు దశాబ్దాల విరామానంతరం భారత ప్రధానమంత్రి సైప్రస్‌ను సందర్శించడం ఇదే తొలిసారి. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలకు గణనీయంగా తోడ్పడుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు.ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడుల రంగాల్లో సైప్రస్‌తో కలిసి పనిచేసేందుకు విస్తృత అవకాశాలున్నాయన్నారు. సైప్రస్ పర్యటన అనంతరం మోదీ కెనడా వెళ్లి జీ7 సదస్సులో పాల్గొననున్నారు. అనంతరం ఆయన క్రొయేషియా పర్యటనకు బయలుదేరనున్నారు.