NCERT: ఇక నుంచి పాఠ్యపుస్తకాల్లో 'ఇండియా' స్థానంలో 'భారత్'.. ఎన్‌సీఈఆర్‌టీ సిఫార్సు
అన్ని పాఠశాల పాఠ్యపుస్తకాల్లో 'ఇండియా' స్థానాన్ని 'భారత్' పేరుతో భర్తీ చేయాలనే ప్రతిపాదనను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో కొత్త అకడమిక్ సెషన్ నుంచి 'ఇండియా' అనే పదం ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలలో కనిపించదు. వాస్తవానికి ఈ ప్రతిపాదన చాలా నెలల క్రితం ఎన్‌సీఈఆర్‌టీ కమిటీ ముందుకు తీసుకొచ్చారు. అయితే ఆ ప్రతిపాదనను అధికారికంగా ఆమోదించలేదు. తాజాగా కమిటీ ఆమోదించింది. మరికొన్ని సిఫార్సులను కమిటీ చేసింది. ముఖ్యంగా పాఠ్యపుస్తకాల్లో 'ప్రాచీన చరిత్ర'కి బదులుగా 'క్లాసికల్ హిస్టరీ' అని రాయాలని ఎన్‌సీఈఆర్‌టీ కమిటీ సిఫార్సు చేసింది. దీంతో ఇకపై చరిత్రను పురాతన, మధ్యయుగ, ఆధునికంగా విడివిడిగా చదవలేరు.
హిందూ రాజుల విజయాలపై పాఠ్యపుస్తకాల్లో అధ్యాయాలు
బ్రిటిష్ పాలకులు భారతీయ చరిత్రను ప్రాచీన, మధ్యయుగ, ఆధునికంగా విభజించారని కమిటీ వాదించింది. పాఠ్యపుస్తకాలలో 'హిందూ రాజుల విజయాలు' అనే అధ్యాయాలను చేర్చాలని, అన్ని సబ్జెక్టుల సిలబస్‌లో ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ (ఐకేఎస్)ని చేర్చాలని కూడా కమిటీ పేర్కొంది. కమిటీ ముందు ఉంచిన ఈ సిఫార్సులను సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. కమిటీ చేసిన ఈ మార్పులు త్వరలో అన్ని NCERT పుస్తకాలలో కనిపిస్తాయి. ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌లో మార్పులపై కాంగ్రెస్ నాయకుడు, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందించారు. ఈ చర్యను ముందే ఊహించినట్లు చెప్పారు. దేశం పేరును మార్చడానికి ప్రభుత్వం ఉవ్విళ్ళూరుతోందన్నారు.