LOADING...
NCERT: తొమ్మిదో తరగతి పుస్తకంలో తొలిసారి 'ఎమర్జెన్సీ' అధ్యాయం.. ఎన్‌సీఈఆర్‌టీ కీలక నిర్ణయం
ఎన్‌సీఈఆర్‌టీ కీలక నిర్ణయం

NCERT: తొమ్మిదో తరగతి పుస్తకంలో తొలిసారి 'ఎమర్జెన్సీ' అధ్యాయం.. ఎన్‌సీఈఆర్‌టీ కీలక నిర్ణయం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 25, 2026
12:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో 1975లో విధించిన ఎమర్జెన్సీపై తొలిసారిగా తొమ్మిదో తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ఎన్‌సీఈఆర్‌టీ (NCERT) నిర్ణయించింది. స్వాతంత్ర్యానంతర భారత రాజకీయ చరిత్రలో అత్యంత కీలకమైన, వివాదాస్పద ఘట్టాల్లో ఒకటిగా భావించే ఎమర్జెన్సీని కొత్తగా రూపొందించిన సోషల్‌ సైన్స్‌ పాఠ్యపుస్తకం 'అండర్‌స్టాండింగ్‌ సొసైటీ: ఇండియా అండ్‌ బియాండ్‌'లో ప్రత్యేక అధ్యాయంగా చేర్చింది. భారత ప్రజాస్వామ్య బలాలు, అభివృద్ధి, ఎదురైన సవాళ్లను ఈ అధ్యాయంలో వివరించారు. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత తొలిసారిగా ఎమర్జెన్సీపై ప్రత్యేక పాఠాన్ని తొమ్మిదో తరగతి పుస్తకంలో చేర్చినట్లు ఎన్‌సీఈఆర్‌టీ అధికారులు వెల్లడించినట్లు సమాచారం. జూన్‌ 25,1975న దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించి 50ఏళ్లు పూర్తైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

వివరాలు 

స్వాతంత్ర్యం తర్వాత భారత రాజకీయ చరిత్రలో.. అత్యంత వివాదాస్పద కాలం

స్వాతంత్ర్యం తర్వాత భారత రాజకీయ చరిత్రలో ఇది అత్యంత వివాదాస్పద కాలంగా గుర్తింపు పొందింది. పాఠ్యపుస్తకం ప్రకారం.. 1970ల ప్రారంభంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ నేతృత్వంలోని ప్రభుత్వంపై నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పాలనపై వచ్చిన విమర్శల కారణంగా ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. ఈ నేపథ్యంలో 1975 నుంచి 1977 వరకు అమలైన ఎమర్జెన్సీని భారత ప్రజాస్వామ్యానికి ఎదురైన ప్రధాన సవాళ్లలో ఒకటిగా పేర్కొంది. 1975 జూన్‌లో "అంతర్గత అశాంతి" కారణంగా జాతీయ ఎమర్జెన్సీ ప్రకటించారని పుస్తకంలో పేర్కొన్నారు. ఆ కాలంలో చాలా ప్రాథమిక హక్కులను నిలిపివేయడం,మీడియాపై సెన్సార్‌ విధించడం,అనేక మంది రాజకీయ నాయకులు,ఉద్యమకారులను అరెస్టు చేయడం జరిగిందని వివరించింది.

వివరాలు 

జయప్రకాశ్‌ నారాయణ్‌ నాయకత్వంలో ఉద్యమం 

ప్రజాస్వామ్య సంస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయని, పౌరుల స్వేచ్ఛలపై ఆంక్షలు అమలయ్యాయని పాఠంలో పేర్కొన్నారు. లోక్‌నాయక్‌గా పేరొందిన జయప్రకాశ్‌ నారాయణ్‌ నాయకత్వంలో జరిగిన ఉద్యమాన్ని కూడా ఈ అధ్యాయంలో వివరించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా విద్యార్థులు, ప్రజలను ఆయన ఏకతాటిపైకి తీసుకువచ్చిన తీరును ప్రస్తావించింది. బిహార్‌, గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో జరిగిన ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాన్ని సవాలు చేయడంలో కీలక పాత్ర పోషించాయని తెలిపింది. 1977లో ఎమర్జెన్సీ ఎత్తివేయడం, అనంతరం జరిగిన సాధారణ ఎన్నికల్లో అధికార పార్టీ ఓటమి చెందడం భారత ప్రజాస్వామ్య వ్యవస్థ బలాన్ని చాటిచెప్పిందని పాఠ్యపుస్తకం పేర్కొంది. అధికారంలో ఉన్న ప్రభుత్వం ఓడిపోవడం భారత ప్రజాస్వామ్యం ఎంత బలంగా ఉందో నిరూపించిందని అందులో వివరించింది.

Advertisement

వివరాలు 

'డెమోక్రసీ అండ్‌ యూ' పేరుతో కొత్త విభాగం 

ఎమర్జెన్సీ అంశంతో పాటు ప్రజాస్వామ్య దేశాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇతర సవాళ్లను కూడా ఈ అధ్యాయంలో ప్రస్తావించారు. ఫేక్‌ న్యూస్‌, తప్పుడు సమాచారం, పేదరికం, సామాజిక వివక్ష, ప్రాంతీయత, లింగ అసమానత, ప్రజా నిబంధనల ఉల్లంఘనలు వంటి అంశాలు ప్రజాస్వామ్యానికి సవాళ్లుగా పేర్కొన్నారు. అలాగే 'డెమోక్రసీ అండ్‌ యూ' పేరుతో కొత్త విభాగాన్ని కూడా ఎన్‌సీఈఆర్‌టీ ప్రవేశపెట్టింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో బాధ్యతాయుతమైన పౌరులుగా విద్యార్థులు తమ పాత్రను అర్థం చేసుకునేలా ఈ విభాగాన్ని రూపొందించినట్లు తెలిపింది.

Advertisement