Loading...
AP Mandal Parishad Elections: ఏపీ మండల పరిషత్‌ ఎన్నికల్లో కూటమి విజయఢంకా.. 93 శాతం స్థానాలు కైవసం
ఏపీ మండల పరిషత్‌ ఎన్నికల్లో కూటమి విజయఢంకా.. 93 శాతం స్థానాలు కైవసం

AP Mandal Parishad Elections: ఏపీ మండల పరిషత్‌ ఎన్నికల్లో కూటమి విజయఢంకా.. 93 శాతం స్థానాలు కైవసం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2026
08:41 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో కూటమి పార్టీలు సత్తా చాటాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్నాయి. గురువారం జరిగిన ఎన్నికల్లో మొత్తం ఎంపీపీ పదవుల్లో 93.13 శాతం, వైస్‌ ఎంపీపీ పదవుల్లో 91.33 శాతం కూటమి పార్టీల ఖాతాలో చేరాయి. మరోవైపు వైకాపా మాత్రం పరిమిత స్థానాలకే పరిమితమైంది. ఎంపీపీ పదవుల్లో ఆ పార్టీకి కేవలం 6.24 శాతం మాత్రమే దక్కాయి. ఏకంగా 13 జిల్లాల్లో ఆ పార్టీ ఖాతా తెరవలేకపోయింది. వైకాపా అధినేత జగన్‌ సొంత జిల్లా వైఎస్సార్‌ కడపతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్క ఎంపీపీ స్థానాన్ని కూడా ఆ పార్టీ గెలుచుకోలేకపోయింది.

వివరాలు 

26 మండలాల్లో అధ్యక్ష పదవులకు ఎన్నికలు

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 659 మండల పరిషత్‌లు ఉండగా.. గురువారం 626 మండలాల్లో అధ్యక్ష పదవులకు ఎన్నికలు నిర్వహించారు.

వీటిలో తెలుగుదేశం పార్టీ 534 స్థానాలను కైవసం చేసుకుంది. జనసేన 42, బీజేపీ ఏడు మండల పరిషత్‌ అధ్యక్ష స్థానాల్లో విజయం సాధించాయి.

వైకాపా అభ్యర్థులు కేవలం 39 మండలాల్లోనే ఎంపీపీలుగా ఎన్నికయ్యారు. ఇక మండల పరిషత్‌ ఉపాధ్యక్ష పదవులకు సంబంధించి 600 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి.

వీటిలో తెలుగుదేశం పార్టీ 445 స్థానాలను దక్కించుకోగా.. జనసేన 83, బీజేపీ 20 స్థానాల్లో విజయం సాధించాయి.

వైకాపా 40 మండలాల్లో మాత్రమే వైస్‌ ఎంపీపీ పదవులను గెలుచుకుంది. సీపీఎంకు ఒక ఎంపీపీ, మూడు వైస్‌ ఎంపీపీ స్థానాలు దక్కాయి.

వివరాలు 

మూడు మండలాల్లో ఎంపీపీలుగా ఎన్నికైన స్వతంత్ర అభ్యర్థులు

మరోవైపు మూడు మండలాల్లో స్వతంత్ర అభ్యర్థులు ఎంపీపీలుగా ఎన్నికయ్యారు.

వీరిలో ఇద్దరు తెలుగుదేశం పార్టీ రెబల్‌ అభ్యర్థులు కాగా.. మరో స్వతంత్ర అభ్యర్థి బీజేపీలో చేరి ఎంపీపీ పదవిని చేపట్టారు.

మొత్తంగా మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో కూటమి పార్టీలు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి.

ADVERTISEMENT