Andhra Pradesh: 'సర్' ప్రక్రియలో 43.71 లక్షల మందికి నోటీసులు.. 16.23 లక్షల మందిపై విచారణ పూర్తి
ఈ వార్తాకథనం ఏంటి
'సర్' ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ పత్రాల్లో పేర్కొన్న వివరాల్లో తప్పులు, లోపాలు ఉన్నట్లు గుర్తించిన రాష్ట్రవ్యాప్తంగా(ఆంధ్రప్రదేశ్) 43.71 లక్షల మంది ఓటర్లకు ఎన్నికల సంఘం అధికారులు నోటీసులు జారీ చేశారు. వీరిలో 16.23 లక్షల మందికి సంబంధించిన విచారణ గురువారం సాయంత్రం నాటికి పూర్తయింది. విచారణ సందర్భంగా సరైన పత్రాలు సమర్పించని 8,764 మందిని అనర్హులుగా అధికారులు నిర్ధారించారు. మరోవైపు 13,63,250 మంది ఓటర్లను తుది ఓటర్ల జాబితాలో కొనసాగించాలని నిర్ణయించారు. ఇంకా 2,51,760 మంది సమర్పించిన ఆధారాలు, పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. నోటీసులు అందుకున్న మరో 27.47 లక్షల మంది ఓటర్ల విచారణ ఇంకా జరగాల్సి ఉంది. ఈ మొత్తం ప్రక్రియను సెప్టెంబరు 28లోగా పూర్తి చేయాల్సి ఉంది.
వివరాలు
కార్యాలయాల వద్ద ఓటర్లకు ఇబ్బందులు
విచారణ పూర్తయిన తర్వాత నోటీసులు అందుకున్న ఓటర్లలో ఎంతమంది తుది జాబితాలో కొనసాగుతారన్న దానిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణకు తహసీల్దార్ కార్యాలయాలకు రావాలని బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు) సూచిస్తున్నారు.
దీంతో పలువురు ఓటర్లు తమ పనులను పక్కనపెట్టి తహసీల్దార్ కార్యాలయాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.
నోటీసులకు సమాధానంగా ఎలాంటి పత్రాలు, ఆధారాలు సమర్పించాలో చాలామంది ఓటర్లకు స్పష్టమైన అవగాహన లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
దీనికి తోడు బీఎల్‌వోలు కూడా తగిన స్థాయిలో సహకరించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వివరాలు
తప్పులు, లోపాలతో మ్యాచింగ్
'సర్' నిబంధనల ప్రకారం ప్రస్తుత ఓటర్ల జాబితాలో ఉన్నవారు 2002 నాటి జాబితాతో తమ వివరాలను సరిపోల్చుకోవాల్సి ఉంటుంది.
ఇందుకోసం పాత జాబితాలో తమ పేరు, తల్లిదండ్రుల పేర్లు లేదా తాత, నానమ్మల పేర్లు, ఇతర వివరాలతో మ్యాచింగ్ చేసుకోవాలి.
అయితే బీఎల్‌వోలకు సమర్పించిన ఎన్యూమరేషన్ పత్రాల్లో చాలామంది ఓటర్లు తమ వివరాలను 2002 జాబితాతో సరిపోల్చకుండా వదిలేశారు.
మరికొందరు తప్పులు, లోపాలు ఉన్న వివరాలతోనే మ్యాచింగ్ చేశారు.
ఇలాంటి లోపాలతో ఉన్న ఓటర్లు మొత్తం 44.23 లక్షల మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం అధికారులు గుర్తించారు.
వీరందరికీ నోటీసులు సిద్ధం చేశారు. ఇప్పటివరకు 43.71 లక్షల మందికి నోటీసుల పంపిణీ పూర్తయింది.
వివరాలు
వయసు తేడాల్లోనూ లోపాలు
నోటీసులు అందుకున్న వారిలో సుమారు 36 లక్షల మంది తప్పులు లేదా లోపాలతో వివరాలను మ్యాచింగ్ చేసుకున్నవారే ఉన్నారు.
ఎన్యూమరేషన్ పత్రాల్లో ఓటర్లు నమోదు చేసిన వివరాలను పరిశీలించగా పలు రకాల లోపాలు బయటపడ్డాయి.
తల్లిదండ్రులు, పిల్లల మధ్య వయసు వ్యత్యాసం 15 ఏళ్ల కంటే తక్కువగా ఉండటం లేదా 50 ఏళ్లకు మించి ఉండటం వంటి వివరాలు నమోదయ్యాయి.
అలాగే ఓటరుకు, తాత లేదా నానమ్మకు మధ్య వయసు తేడా 40 ఏళ్ల కంటే తక్కువగా ఉన్న సందర్భాలూ గుర్తించారు.
వివరాలు
పేర్లలోనూ తేడాలు
ప్రస్తుత ఓటర్ల జాబితాలో ఉన్న తండ్రి పేరు, 2002 నాటి జాబితాలో నమోదైన తండ్రి పేరు మధ్య వ్యత్యాసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఒకే తల్లిదండ్రులకు జన్మించిన పిల్లల మధ్య వయసు తేడా 9 నెలల కంటే తక్కువగా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి.
అదేవిధంగా ప్రస్తుత జాబితాలోని ఓటరు పేరు, 2002 నాటి జాబితాలో ఉన్న పేరు మధ్య తేడాలు ఉండటం, ఎన్యూమరేషన్ పత్రాల్లో సమర్పించిన తల్లిదండ్రుల వివరాల్లో తప్పులు ఉండటం వంటి లోపాలూ గుర్తించారు.
ఇలాంటి వివరాలు ఉన్న ఓటర్లకు ప్రస్తుతం నోటీసులు జారీ చేసి, సంబంధిత పత్రాలతో విచారణకు హాజరు కావాలని అధికారులు కోరుతున్నారు.