Loading...
Chandra Kumar Bose: సుభాష్‌ చంద్రబోస్‌ వారసుడి కొత్త రాజకీయ పార్టీ.. యువతే ప్రధాన బలం
సుభాష్‌ చంద్రబోస్‌ వారసుడి కొత్త రాజకీయ పార్టీ.. యువతే ప్రధాన బలం

Chandra Kumar Bose: సుభాష్‌ చంద్రబోస్‌ వారసుడి కొత్త రాజకీయ పార్టీ.. యువతే ప్రధాన బలం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 12, 2026
11:37 am

ఈ వార్తాకథనం ఏంటి

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ వారసత్వాన్ని రాజకీయ రంగంలో మరోసారి ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన మునిమనవడు చంద్రకుమార్‌ బోస్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. 'ఆజాద్‌ హింద్‌ పార్టీ' పేరుతో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. యువతను ప్రధాన శక్తిగా చేసుకుని, నేతాజీ పాటించిన సమ్మిళిత, లౌకిక భావజాలానికి అనుగుణంగా పార్టీని ముందుకు తీసుకెళ్తామని వెల్లడించారు. ఇటీవల దిల్లీలో చోటుచేసుకున్న జెన్‌-జీ నిరసనలు తన రాజకీయ నిర్ణయానికి ప్రధాన కారణాల్లో ఒకటని చంద్రకుమార్‌ బోస్‌ తెలిపారు. నీట్‌-యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్‌ అంశంపై జంతర్‌ మంతర్‌ వద్ద యువత చేపట్టిన ఆందోళనలను ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వాలు, వ్యవస్థల పనితీరుపై యువతలో అసంతృప్తి క్రమంగా పెరుగుతోందని పేర్కొన్నారు.

వివరాలు 

2016లో భారతీయ జనతా పార్టీలో చేరిన చంద్రకుమార్‌ బోస్

దేశవ్యాప్తంగా రాజకీయాలు, విద్య, వైద్యం, పరిశ్రమలు తదితర అనేక రంగాల్లో అవినీతి పెరిగిపోయిందని చంద్రకుమార్‌ బోస్‌ ఆరోపించారు.

ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై అసంతృప్తితో ఉన్న యువత తమ హక్కుల కోసం పోరాడేందుకు ప్రత్యేక రాజకీయ వేదిక అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ నేపథ్యంలో నేతాజీ స్థాపించిన ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ స్ఫూర్తితో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

చంద్రకుమార్‌ బోస్‌ 2016లో భారతీయ జనతా పార్టీలో చేరారు. అక్కడ ఏడేళ్ల పాటు కొనసాగారు.

నేతాజీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 'ఆజాద్‌ హింద్‌ మోర్చా'ను ఏర్పాటు చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చినప్పటికీ, ఆ ప్రయత్నం కార్యరూపం దాల్చలేదని ఆయన తెలిపారు.

బీజేపీలో చేరడం తన జీవితంలో చేసిన తప్పిదమని గతంలోనే వ్యాఖ్యానించారు.

వివరాలు 

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరిన చంద్రకుమార్‌ బోస్

2026 ఏప్రిల్‌లో జరిగిన పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంద్రకుమార్‌ బోస్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు.

నేతాజీ భావజాలానికి అనుగుణంగా పనిచేసే అవకాశం అక్కడ లభిస్తుందని భావించినట్లు ఆయన చెప్పారు.

అయితే, ఆ పార్టీలో కేవలం నాలుగు నెలలు మాత్రమే కొనసాగి రాజీనామా చేశారు.

ఆగస్టు 3న వ్యక్తిగత కారణాలను పేర్కొంటూ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి తన రాజీనామా లేఖను పంపించారు.

ADVERTISEMENT