Loading...
BRICS New Delhi Declaration: న్యూఢిల్లీ డిక్లరేషన్‌.. యుద్ధం, వాణిజ్య సుంకాలపై బ్రిక్స్‌ దేశాల గట్టి హెచ్చరిక
న్యూఢిల్లీ డిక్లరేషన్‌.. యుద్ధం, వాణిజ్య సుంకాలపై బ్రిక్స్‌ దేశాల గట్టి హెచ్చరిక

BRICS New Delhi Declaration: న్యూఢిల్లీ డిక్లరేషన్‌.. యుద్ధం, వాణిజ్య సుంకాలపై బ్రిక్స్‌ దేశాల గట్టి హెచ్చరిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 12, 2026
06:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

న్యూఢిల్లీ వేదికగా జరిగిన బ్రిక్స్‌ సదస్సులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్రిక్స్‌ దేశాల నేతలు శనివారం 'న్యూఢిల్లీ డిక్లరేషన్‌'ను ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఏకాభిప్రాయ పత్రాన్ని సదస్సులో ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో నిర్మాణాత్మక మార్పులతో పాటు బహుపాక్షిక సంస్థల్లో సంస్కరణలు తీసుకురావాలని డిక్లరేషన్‌ పిలుపునిచ్చింది. అలాగే ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించింది. ప్రపంచ వ్యవస్థలో పాత సంస్థలతో కొత్త సవాళ్లను ఎదుర్కోవడం సాధ్యం కాదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రాతినిధ్యం, స్పందన సామర్థ్యం, నిబంధనల రూపకల్పనలో సంస్కరణలు అవసరమని అన్నారు. భవిష్యత్‌ సాంకేతికతలు, వాటికి సంబంధించిన నిబంధనల రూపకల్పనలో గ్లోబల్‌ సౌత్‌కు సమాన భాగస్వామ్యం ఉండాలని బ్రిక్స్‌ దేశాలు స్పష్టం చేశాయని తెలిపారు.

వివరాలు

యూఎన్‌ భద్రతా మండలిలో సంస్కరణలు

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని సంస్కరించాలని న్యూఢిల్లీ డిక్లరేషన్‌ ప్రత్యేకంగా పిలుపునిచ్చింది.

ఆఫ్రికా, ఆసియా, లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ ప్రాంతాలకు చెందిన అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలని పేర్కొంది.

సెక్యూరిటీ కౌన్సిల్‌లో శాశ్వత సభ్యులుగా ఉన్న చైనా, రష్యా తరఫున సదస్సుకు హాజరైన నేతలు.. ఐక్యరాజ్యసమితిలో, ముఖ్యంగా భద్రతా మండలిలో బ్రెజిల్‌, భారత్‌లు మరింత కీలక పాత్ర పోషించాలన్న ఆకాంక్షలకు తమ మద్దతును మరోసారి తెలిపారు.

వివరాలు

డాలర్‌కు బదులుగా స్థానిక కరెన్సీలు

బ్రిక్స్‌ దేశాల మధ్య వాణిజ్యాన్ని మరింతగా స్థానిక కరెన్సీల్లో నిర్వహించాలని డిక్లరేషన్‌ పేర్కొంది.

ప్రస్తుతం అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రధానంగా ఉపయోగిస్తున్న అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

మధ్యప్రాచ్య పరిస్థితులపైనా స్పందన

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సైనిక దాడులు, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 'ఏకపక్ష యుద్ధ చర్యలను' బ్రిక్స్‌ దేశాలు తీవ్రంగా ఖండించాయి.

సముద్ర మార్గాల్లో వాణిజ్య నౌకాయానం సురక్షితంగా కొనసాగాలని, నావికుల భద్రతకు భరోసా కల్పించాలని పిలుపునిచ్చాయి.

ADVERTISEMENT

వివరాలు

డబ్ల్యూటీవో సంస్కరణలకు మద్దతు

ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)లో సంస్కరణలకు బ్రిక్స్‌ మద్దతు ప్రకటించింది. బహిరంగ, పారదర్శక, సమాన, నిబంధనల ఆధారిత ప్రపంచ వాణిజ్య వ్యవస్థ కొనసాగాల్సిన అవసరాన్ని డిక్లరేషన్‌ నొక్కిచెప్పింది.

ప్రపంచ బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థ చాలాకాలంగా కీలక మలుపులో ఉందని బ్రిక్స్‌ దేశాలు పేర్కొన్నాయి.

డబ్ల్యూటీవో నిబంధనలకు విరుద్ధంగా పెరుగుతున్న వాణిజ్య పరిమితులు, అధిక సుంకాలు, సుంకేతర చర్యలు, పర్యావరణ లక్ష్యాల పేరుతో అమలు చేస్తున్న రక్షణాత్మక విధానాలు ప్రపంచ వాణిజ్యాన్ని మరింత దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి.

ADVERTISEMENT

వివరాలు

వాణిజ్య కార్యకలాపాల్లో అనిశ్చితి పెరిగే అవకాశం

ఇలాంటి చర్యల వల్ల ప్రపంచ సరఫరా గొలుసులకు అంతరాయం ఏర్పడి, అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాల్లో అనిశ్చితి పెరిగే అవకాశం ఉందని తెలిపాయి.

దీంతో ఇప్పటికే ఉన్న ఆర్థిక అసమానతలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని, ప్రపంచ ఆర్థిక అభివృద్ధి అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడొచ్చని పేర్కొన్నాయి.

డబ్ల్యూటీవో నిబంధనలకు విరుద్ధంగా, వాణిజ్యాన్ని వక్రీకరించే ఏకపక్ష సుంక, సుంకేతర చర్యల పెరుగుదలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి.

వాణిజ్య అంతరాయాలకు, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అవసరాలకు డబ్ల్యూటీవో మరింత సమర్థంగా స్పందించేలా కలిసి పనిచేస్తామని వెల్లడించాయి.

వివరాలు

పహల్గామ్‌ ఉగ్రదాడిని ఖండించిన బ్రిక్స్

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో 2025 ఏప్రిల్‌ 22న జరిగిన ఉగ్రదాడిని బ్రిక్స్‌ దేశాలు తీవ్రంగా ఖండించాయి.

ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ప్రేరణ ఏదైనా, ఎక్కడ జరిగినా, ఎవరు చేసినా ఉగ్రవాద చర్యలు నేరపూరితమైనవేనని, వాటిని సమర్థించడానికి వీల్లేదని బ్రిక్స్‌ స్పష్టం చేసింది.

ఉగ్రవాదాన్ని అన్ని రూపాలు, వ్యక్తీకరణల్లో ఎదుర్కోవడానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటించింది.

సరిహద్దులు దాటి ఉగ్రవాదుల కదలికలు, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, ఉగ్రవాదులకు సురక్షిత స్థావరాలు కల్పించడం వంటి అంశాలను కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

ఉగ్రవాదాన్ని ఏ మతం, జాతీయత, నాగరికత లేదా జాతి సమూహంతోనూ ముడిపెట్టకూడదని స్పష్టం చేసింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం న్యాయస్థానం ముందు నిలబెట్టాలని బ్రిక్స్‌ దేశాలు పిలుపునిచ్చాయి.

వివరాలు

రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న బ్రిక్స్

బ్రిక్స్‌ ఏర్పాటై రెండు దశాబ్దాలు పూర్తయిన నేపథ్యంలో ఈ సదస్సు జరిగింది.

ప్రారంభంలో పరిమిత సంఖ్యలో సభ్య దేశాలతో ఏర్పడిన ఈ కూటమి.. అనంతరం మరిన్ని దేశాలకు విస్తరించింది.

శనివారం జరిగిన సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ సహా బ్రిక్స్‌ దేశాల నేతలు హాజరయ్యారు. సదస్సు ముగింపు సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. న్యూఢిల్లీ డిక్లరేషన్‌ బ్రిక్స్‌ దేశాల ఉమ్మడి సంకల్పానికి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తోందన్నారు.

డిక్లరేషన్‌లో తీసుకున్న నిర్ణయాలను కేవలం తీర్మానాలకే పరిమితం చేయకుండా, వాటిని ఆచరణలోకి తీసుకురావాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు.

ADVERTISEMENT