Loading...
Cology Biosciences: చిన్నారుల అరుదైన జన్యు వ్యాధికి దేశీయ ఔషధం.. కొలోజీ బయోసైన్సెస్‌ ఘనత
చిన్నారుల అరుదైన జన్యు వ్యాధికి దేశీయ ఔషధం.. కొలోజీ బయోసైన్సెస్‌ ఘనత

Cology Biosciences: చిన్నారుల అరుదైన జన్యు వ్యాధికి దేశీయ ఔషధం.. కొలోజీ బయోసైన్సెస్‌ ఘనత

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 28, 2026
09:11 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లోని కొలోజీ బయోసైన్సెస్‌ అంకుర సంస్థ ఆధ్వర్యంలో ప్రాణాంతక ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆశ కలిగించే ఔషధాలను అభివృద్ధి చేశారు. ఈ మందులు రోగుల జీవితకాలాన్ని గణనీయంగా పెంచే అవకాశాలున్నాయని సంస్థ వెల్లడించింది. హెచ్‌సీయూలోని యాస్పైర్‌ బయోనెస్ట్‌ ఆచార్యుల సహకారంతో రెండు వ్యాధులకు సంబంధించిన పరిశోధనలను మూడేళ్ల క్రితం ప్రారంభించారు. ప్రయోగాల్లో వచ్చిన ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో.. మరో రెండేళ్లలో ఔషధాలను మార్కెట్‌లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

వివరాలు 

ఇడియోపథిక్‌ పల్మనరీ ఫైబ్రోసిస్

ధూమపానం ఎక్కువగా చేసే వారిలో ఇడియోపథిక్‌ పల్మనరీ ఫైబ్రోసిస్‌ (ఐపీఎఫ్‌) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

ఈ వ్యాధి సోకిన వారికి ముఖ్యంగా రాత్రివేళల్లో తీవ్రమైన దగ్గు వేధిస్తుంది.వ్యాధి ముదిరితే రెండు, మూడేళ్లలోనే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడొచ్చు.

ప్రపంచవ్యాప్తంగా ప్రతి లక్ష మందిలో సుమారు 5.8మంది ఐపీఎఫ్‌తో బాధపడుతున్నట్లు మెటా సంస్థ గతేడాది అంచనా వేసింది.

ఐపీఎఫ్‌కు ప్రత్యేకంగా పూర్తిస్థాయి పరిష్కారం అందించే మందులపై ప్రస్తుతం కూడా పరిశోధనలు కొనసాగుతున్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో ఊపిరితిత్తుల సమస్యకు ఉపయోగించే మందులనే రోగులకు అందిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కొలోజీ బయోసైన్సెస్‌ శాస్త్రవేత్తలు కొత్త విధానంలో ఔషధాన్ని రూపొందించారు.

ఇది ఫిల్మ్‌ రూపంలో ఉంటుంది.నోటిలో ఉంచిన తర్వాత కేవలం నిమిషంలోనే కరిగిపోయేలా దీనిని అభివృద్ధి చేశారు.

వివరాలు 

ఖర్చు కూడా తగ్గే అవకాశం

ఐపీఎఫ్‌ చికిత్స కోసం భారత్‌లో ఒక్కో రోగి ప్రస్తుతం ఏడాదికి సుమారు రూ.53,460 వరకు ఖర్చు చేస్తున్నారు.

కొలోజీ బయోసైన్సెస్‌ రూపొందించిన కొత్త ఔషధం అందుబాటులోకి వస్తే ఏడాదికి సుమారు రూ.32,400తోనే చికిత్స అందించే అవకాశం ఉందని సంస్థ తెలిపింది.

దీంతో ప్రస్తుత చికిత్సతో పోలిస్తే రోగులపై ఆర్థిక భారం కూడా తగ్గే అవకాశం ఉంది.

ADVERTISEMENT

వివరాలు 

చిన్నారుల్లో అరుదైన జన్యు వ్యాధి

సిస్టిక్‌ ఫైబ్రోసిస్‌ మరో అరుదైన జన్యు సంబంధిత వ్యాధి. ముఖ్యంగా ఐదేళ్లలోపు చిన్నారులను ఈ రుగ్మత తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.

ఈ వ్యాధి కారణంగా శరీరంలో చిక్కగా, జిగటగా ఉండే శ్లేష్మం అధికంగా ఉత్పత్తి అవుతుంది.

అది శ్వాస నాళాలను మూసివేయడంతో పాటు ఊపిరితిత్తుల పనితీరును దెబ్బతీస్తుంది.

దేశంలో ప్రతి ఏడాది సుమారు 1,560 మంది చిన్నారులు సిస్టిక్‌ ఫైబ్రోసిస్‌తో జన్మిస్తున్నట్లు అంచనా. వీరిలో దాదాపు 95 శాతం మంది ప్రాణాలు కోల్పోతున్నారని సమాచారం.

వ్యాధి బారినపడిన చిన్నారులను కాపాడేందుకు ప్రస్తుతం ఏడాదికి సుమారు రూ.1.20 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది.

ఈ వ్యాధికి అవసరమైన ఔషధాలను ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఒకే ఒక్క కంపెనీ తయారు చేస్తోంది.

ADVERTISEMENT

వివరాలు 

భారత్‌లోనే ఔషధ తయారీ లక్ష్యంగా..

విదేశీ కంపెనీపై ఆధారపడకుండా సిస్టిక్‌ ఫైబ్రోసిస్‌ చికిత్సకు అవసరమైన ఔషధాన్ని దేశంలోనే తయారు చేయాలన్న లక్ష్యంతో కొలోజీ బయోసైన్సెస్‌ పరిశోధనలు చేపట్టింది.

ఇందులో భాగంగా తాజాగా మందును అభివృద్ధి చేసినట్లు సంస్థ వెల్లడించింది. ప్రయోగ ఫలితాలు సానుకూలంగా రావడంతో దీనిని తదుపరి దశల్లోకి తీసుకెళ్లే ప్రక్రియ కొనసాగుతోంది.

వివరాలు 

రెండేళ్లలో అందుబాటులోకి: కేఎం శ్రీదేవి, సీఈవో, కొలోజీ బయోసైన్సెస్

ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్స తీసుకుంటున్నప్పటికీ ఐపీఎఫ్‌ బాధితులు రెండు, మూడేళ్లలోనే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని కొలోజీ బయోసైన్సెస్‌ సీఈవో కేఎం శ్రీదేవి తెలిపారు.

తాము రూపొందించిన ఔషధాన్ని ఉపయోగిస్తే రోగులు ఏడెనిమిదేళ్ల వరకు జీవించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

అదేవిధంగా సిస్టిక్‌ ఫైబ్రోసిస్‌తో బాధపడుతున్న చిన్నారులు ప్రస్తుత చికిత్సతో సుమారు పదేళ్ల వరకు జీవించే అవకాశం ఉందని ఆమె తెలిపారు.

తమ సంస్థ రూపొందించిన కొత్త మందుతో వారి జీవితకాలం 50 నుంచి 60 ఏళ్ల వరకు పెరిగే అవకాశముందని వివరించారు.

ఈ రెండు ఔషధాలను మరో రెండేళ్లలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని కేఎం శ్రీదేవి వెల్లడించారు.

ADVERTISEMENT