LOADING...
New NH-565 Highway: తెలంగాణ-ఏపీకి కొత్త హైవే.. తిరుపతి ప్రయాణం ఇక సులభం
తెలంగాణ-ఏపీకి కొత్త హైవే.. తిరుపతి ప్రయాణం ఇక సులభం

New NH-565 Highway: తెలంగాణ-ఏపీకి కొత్త హైవే.. తిరుపతి ప్రయాణం ఇక సులభం

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 23, 2026
12:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు రాష్ట్రాల మధ్య రోడ్డు మార్గ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చే మరో కీలక జాతీయ రహదారి అందుబాటులోకి వచ్చింది. తెలంగాణలోని నకిరేకల్ నుంచి ఏపీలోని తిరుపతి సమీపంలోని ఏర్పేడు వరకు నిర్మించిన జాతీయ రహదారి-565 (NH-565) పూర్తిగా రాకపోకలకు సిద్ధమైంది. ఈ రహదారి ద్వారా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (NH-65), మదనపల్లె-నాయుడుపేట జాతీయ రహదారి (NH-71)లు అనుసంధానమయ్యాయి. దీంతో నల్గొండ, ఖమ్మం, వరంగల్ ప్రాంతాల నుంచి తిరుపతికి వెళ్లే భక్తులు, ప్రయాణికులకు ఇది సులభమైన ప్రత్యామ్నాయ మార్గంగా మారింది.

వివరాలు 

ఏ మార్గంలో వెళ్తుంది ఈ NH-565?

దాదాపు 420 కిలోమీటర్ల పొడవు గల ఈ రహదారి ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంది. తెలంగాణలోని నకిరేకల్, నల్గొండ, దేవరకొండ ప్రాంతాలను దాటి పల్నాడు జిల్లా మాచర్ల వద్ద ఈ హైవే ఏపీలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి యర్రగొండపాలెం, మార్కాపురం, పొదిలి, కనిగిరి, రాపూరు, వెంకటగిరి మీదుగా సాగి చివరకు ఏర్పేడు వద్ద ముగుస్తుంది. ఎర్పేడు వద్ద నుంచి ఎడమ వైపు వెళ్తే శ్రీకాళహస్తి, కుడి వైపు తిరిగితే తిరుపతి చేరుకోవచ్చు.

వివరాలు 

కష్టాల నుంచి ఉపశమనం.. వేగవంతమైన ప్రయాణం

ఈ హైవే నిర్మాణం ముఖ్యంగా మార్కాపురం జిల్లా ప్రజలకు పెద్ద ఊరటగా మారింది. గతంలో యర్రగొండపాలెం నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే పుల్లలచెరువు, వెల్దుర్తి అటవీ ప్రాంతం గుండా ప్రయాణం చాలా కష్టంగా ఉండేది. అధ్వానంగా ఉన్న ఘాట్ రోడ్డు కారణంగా కేవలం 20 కిలోమీటర్ల దూరం వెళ్లడానికి దాదాపు 50 నిమిషాలు పట్టేది. ఇప్పుడు కొత్త జాతీయ రహదారి నిర్మాణంతో పరిస్థితి పూర్తిగా మారింది. రూ.393 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ మార్గంలో అదే దూరాన్ని కేవలం 20 నిమిషాల్లో పూర్తి చేయవచ్చు.

Advertisement

వివరాలు 

ఆధునిక సదుపాయాలు.. ప్రత్యేకతలేంటి?

ఘాట్ ప్రాంతం కావడంతో ఈ రహదారిలో మొత్తం 16 వంతెనలు, 8 అండర్‌పాస్‌లు నిర్మించారు. అటవీ అనుమతుల వంటి సమస్యలు ఎదురైనా పనులను వేగంగా పూర్తి చేసి గడువు కంటే ముందే అందుబాటులోకి తీసుకురావడం విశేషం. ఈ మార్గం కడప జిల్లా పోరుమామిళ్ల ప్రాంత ప్రజలకు కూడా హైదరాబాద్ ప్రయాణాన్ని సులభతరం చేస్తోంది. కొండలు, లోయల మధ్య నిర్మించిన ఈ రహదారి ప్రయాణికులకు సౌకర్యంతో పాటు అందమైన ప్రయాణ అనుభూతిని అందిస్తోంది.

Advertisement