LLR Test From Home: ఇంటి నుంచే ఎల్‌ఎల్‌ఆర్ పరీక్ష.. కొత్త విధానం అమల్లోకి తెచ్చిన రవాణాశాఖ
ఈ వార్తాకథనం ఏంటి
కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ కీలక మార్పు తీసుకొచ్చింది. ఇకపై లెర్నర్స్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ (ఎల్‌ఎల్‌ఆర్) కోసం స్లాట్ బుక్ చేసుకుని రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లి పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో పరీక్ష రాసి ఎల్‌ఎల్‌ఆర్ పొందే సదుపాయాన్ని అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కొత్త విధానం ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 26 రాష్ట్రాల్లో ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో ఎల్‌ఎల్‌ఆర్ పరీక్ష రాసే విధానం అమలవుతోంది. ఆధార్ ఈ-కేవైసీ పూర్తిచేసుకున్న వారు ఆన్‌లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైతే ఎల్‌ఎల్‌ఆర్ జారీ చేస్తున్నారు. అయితే ఈ విధానంలో అసలు అభ్యర్థికి బదులుగా మరొకరు పరీక్ష రాసే అవకాశం ఉందన్న ఆందోళనలు ఉన్నాయి.
వివరాలు
ఎల్‌ఎల్‌ఆర్ పొందాలంటే ఇలా..
అందుకే మన రాష్ట్రంలో మాత్రం పరీక్ష ప్రక్రియను మరింత పకడ్బందీగా రూపొందించారు.
కెమెరా పర్యవేక్షణలో, నిర్దిష్ట నిబంధనలు పాటిస్తూ పరీక్ష రాయాల్సి ఉంటుంది. దీంతో ఒకరి తరఫున మరొకరు పరీక్ష రాయడం సాధ్యం కాదు.
ముందుగా సారథి పోర్టల్‌లోని ఎల్‌ఎల్‌ఆర్ ఆన్‌లైన్ స్లాట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
అనంతరం రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుని ఆధార్ వివరాలను నమోదు చేయాలి.
ఆధార్ నంబర్‌ను లింక్ చేసి ఆన్‌లైన్‌లో నిర్ణీత ఫీజు చెల్లించిన తర్వాత అప్లికేషన్ జనరేట్ అవుతుంది.
కెమెరా సౌకర్యం ఉన్న డెస్క్‌టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో ఇంటి నుంచే అప్లికేషన్‌ను ఓపెన్ చేయాలి.
మొబైల్ నంబర్‌కు వచ్చిన పిన్‌ను నమోదు చేసిన తర్వాత ఆన్‌లైన్ పరీక్ష ప్రారంభమవుతుంది.
వివరాలు
అక్రమాలకు తావులేకుండా పర్యవేక్షణ
పరీక్షలో మొత్తం 20 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో కనీసం 12 ప్రశ్నలకు అంటే 60 శాతం ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇస్తే ఉత్తీర్ణులైనట్లే.
పరీక్ష పూర్తయిన వెంటనే ఎల్‌ఎల్‌ఆర్ జారీ అవుతుంది.
ఇంటి నుంచే పరీక్ష రాసే అవకాశం కల్పించిన నేపథ్యంలో అక్రమాలకు అవకాశం లేకుండా రవాణాశాఖ పలు భద్రతా చర్యలు చేపట్టింది.
సేఫ్ ఎగ్జామ్ బ్రౌజర్‌తో పాటు ఎగ్జామ్ ప్రోక్టరింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు.
ఏఐ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ కెమెరాతో పరీక్ష రాస్తున్న అభ్యర్థిని నిరంతరం గమనిస్తారు.
పరీక్ష సమయంలో అభ్యర్థి తలను పక్కకు తిప్పినా, చుట్టుపక్కల నుంచి ఇతరుల మాటలు వినిపించినా పరీక్షలో విఫలమైనట్లు పరిగణించే అవకాశం ఉంటుంది.
వివరాలు
వీరు ఎల్‌ఎల్‌ఆర్ కోసం రవాణాశాఖ కార్యాలయానికి వెళ్ళాలి..
అలాగే ఒక డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ ఐపీ అడ్రస్ నుంచి రోజుకు గరిష్ఠంగా ఇద్దరు మాత్రమే పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది.
అభ్యర్థి ముఖాన్ని ఆధార్ అథంటికేషన్‌తో సరిపోల్చేందుకు ఐదుసార్ల వరకు అవకాశం కల్పిస్తారు.
ఐదు ప్రయత్నాల్లోనూ ముఖం సరిపోలకపోతే సంబంధిత అభ్యర్థి తప్పనిసరిగా రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది.
ఆధార్ లేనివారు, ఈ-కేవైసీ పూర్తిచేసుకోనివారు ఎల్‌ఎల్‌ఆర్ కోసం రవాణాశాఖ కార్యాలయాన్నే ఆశ్రయించాలి.
కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ అందుబాటులో లేని వారికి కూడా అధికారులు ప్రత్యామ్నాయ సదుపాయం కల్పించారు.
సమీపంలోని స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి అక్కడ దరఖాస్తు చేసుకోవడంతో పాటు అక్కడే ఆన్‌లైన్ పరీక్ష రాసే అవకాశం ఉంటుంది.
వివరాలు
మాక్ టెస్ట్‌లతో ముందస్తు ప్రాక్టీస్
ఎల్‌ఎల్‌ఆర్ ఆన్‌లైన్ పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి? వాటికి ఏ సమాధానాలను ఎంపిక చేయాలి? అనే విషయాలపై అవగాహన కోసం అభ్యర్థులు మాక్ టెస్ట్‌లు రాసుకోవచ్చు. సారథి పోర్టల్‌లోనే ఈ ప్రాక్టీస్ పరీక్షలను ఎన్నిసార్లయినా రాసుకునే అవకాశం ఉంది.
రోజుకు 6 వేల నుంచి 8 వేల ఎల్‌ఎల్‌ఆర్‌లు
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రోజుకు సగటున 6 వేల నుంచి 8 వేల వరకు ఎల్‌ఎల్‌ఆర్‌లు జారీ అవుతున్నాయి.
ఇప్పటివరకు అభ్యర్థులు రాష్ట్రంలోని 84 రవాణాశాఖ కార్యాలయాలకు వెళ్లి అక్కడ పరీక్షలు రాయాల్సి వచ్చేది.
కొత్త విధానం అందుబాటులోకి రావడంతో ఇకపై ప్రతి ఒక్కరూ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు.
వివరాలు
ఆర్‌టీఓలో డ్రైవింగ్ పరీక్ష తప్పనిసరి
ఆన్‌లైన్‌లో ఎల్‌ఎల్‌ఆర్ పొందినంత మాత్రాన డ్రైవింగ్ లైసెన్స్ పూర్తిగా మంజూరైనట్లు కాదు.
ఎల్‌ఎల్‌ఆర్ పొందిన నెల తర్వాత నుంచి ఆరు నెలల్లోపు అభ్యర్థి సంబంధిత ఆర్‌టీఓ కార్యాలయంలో ట్రాక్‌పై నిర్వహించే డ్రైవింగ్ పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది.