Loading...
Vijayawada: విజయవాడ వద్ద కృష్ణా నదిపై మరో రైల్వే వంతెన.. రూ.5,858 కోట్లతో పనులు
విజయవాడ వద్ద కృష్ణా నదిపై మరో రైల్వే వంతెన.. రూ.5,858 కోట్లతో పనులు

Vijayawada: విజయవాడ వద్ద కృష్ణా నదిపై మరో రైల్వే వంతెన.. రూ.5,858 కోట్లతో పనులు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 06, 2026
08:56 am

ఈ వార్తాకథనం ఏంటి

విజయవాడ వద్ద కృష్ణా నదిపై మరో కొత్త రైల్వే వంతెన నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. విజయవాడ జంక్షన్‌-కృష్ణా కెనాల్‌ జంక్షన్‌ స్టేషన్ల మధ్య, విజయవాడ-సీతానగరం ప్రాంతంలో ఈ వంతెన నిర్మించనున్నారు. బల్లార్ష-ఖాజీపేట-విజయవాడ-గూడూరు మధ్య నాలుగో రైల్వే లైన్‌ ప్రాజెక్టులో భాగంగా ఈ నిర్మాణం చేపట్టనున్నారు. విజయవాడ నుంచి గూడూరు వరకు 293 కిలోమీటర్ల మేర నాలుగో లైన్‌ నిర్మాణానికి రూ.5,858 కోట్లతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపొందించి రైల్వే బోర్డుకు పంపించారు.

వివరాలు 

నిరీక్షణ సమస్య తగ్గి.. వేగంగా రైళ్ల రాకపోకలు

ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణా నదిపై 1.30 కిలోమీటర్ల పొడవైన మరో రైల్వే వంతెన నిర్మించాలని ప్రతిపాదించారు.

ప్రస్తుతం విజయవాడ-సీతానగరం మధ్య కృష్ణా నదిపై రెండు రైల్వే వంతెనలు ఉన్నాయి.

వీటిలో ఒకదానిపై రెండు రైల్వే లైన్లు,మరో వంతెనపై ఒక లైన్‌ ఉంది.

ఇప్పుడు వీటికి సమీపంలోనే మూడో వంతెన నిర్మించనున్నారు.ఈ వంతెన అందుబాటులోకి వస్తే తెనాలి,గుంటూరు వైపు నుంచి వచ్చే రైళ్లు కృష్ణా కెనాల్‌ స్టేషన్‌ వద్ద ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు.

అలాగే విజయవాడ మీదుగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి తమిళనాడు వైపు వెళ్లే గూడ్స్‌ రైళ్ల రాకపోకలు కూడా సులభతరం కానున్నాయి.

ప్రస్తుతం ఎదురవుతున్న నిరీక్షణ సమస్య తగ్గి రైళ్లు వేగంగా రాకపోకలు సాగించేందుకు అవకాశం ఏర్పడుతుంది.

వివరాలు 

కృష్ణా నదిపై మరో రెండు వంతెనల నిర్మాణం

కృష్ణా నదిపై ఇప్పటికే మరో రెండు కొత్త రైల్వే వంతెనల నిర్మాణానికి రైల్వే శాఖ చర్యలు చేపట్టింది.

ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు మధ్య కొత్త రైల్వే లైన్‌ నిర్మించనున్నారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా మండల కేంద్రమైన అమరావతికి సమీపంలో కృష్ణా నదిపై మరో రైల్వే వంతెన నిర్మించనున్నారు.

ఈ వంతెన నిర్మాణానికి ఇప్పటికే టెండర్లు కూడా పిలిచారు.

ADVERTISEMENT

వివరాలు 

విజయవాడకు బైపాస్‌ రైల్వే లైన్

విజయవాడ రైల్వే స్టేషన్‌పై రైళ్ల రద్దీని తగ్గించేందుకు బైపాస్‌ లైన్‌ నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

గుడివాడ-విజయవాడ రైల్వే మార్గంలోని ఇందుపల్లి నుంచి విజయవాడ-తెనాలి మార్గంలోని దుగ్గిరాల వరకు 36.8 కిలోమీటర్ల మేర కొత్తగా డబుల్‌ లైన్‌ నిర్మించనున్నారు.

విశాఖపట్నం వైపు నుంచి చెన్నై దిశగా వెళ్లే గూడ్స్‌ రైళ్లు విజయవాడ రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించకుండానే ఈ బైపాస్‌ మార్గం ద్వారా వెళ్లేందుకు వీలుంటుంది.

దీనివల్ల విజయవాడ స్టేషన్‌పై రద్దీ తగ్గడంతోపాటు సరుకు రవాణా రైళ్ల ప్రయాణ సమయం కూడా ఆదా కానుంది.

ADVERTISEMENT

వివరాలు 

విజయవాడకు బైపాస్‌ రైల్వే లైన్

ఈ బైపాస్‌ రైల్వే లైన్‌లో భాగంగా చోడవరం సమీపంలో కృష్ణా నదిపై మరో కొత్త వంతెన నిర్మించాలని ప్రతిపాదించారు.

బైపాస్‌ లైన్‌ నిర్మాణం, కృష్ణా నదిపై వంతెన ఏర్పాటు కలిపి మొత్తం రూ.3,197 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్‌ రూపొందించి రైల్వే బోర్డుకు పంపించారు.

త్వరలోనే ఈ ప్రాజెక్టుకు అనుమతులు లభించే అవకాశం ఉంది.

ADVERTISEMENT