Loading...
Rayadurgam: రాయదుర్గం భూముల ధరల్లో సరికొత్త రికార్డు.. ఎకరం రూ.269 కోట్లు
రాయదుర్గం భూముల ధరల్లో సరికొత్త రికార్డు.. ఎకరం రూ.269 కోట్లు

Rayadurgam: రాయదుర్గం భూముల ధరల్లో సరికొత్త రికార్డు.. ఎకరం రూ.269 కోట్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 29, 2026
10:21 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లోని రాయదుర్గం భూముల ధరలు మరోసారి ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించాయి. వారం రోజుల క్రితం నమోదైన గరిష్ఠ ధరను అధిగమిస్తూ తాజాగా ఎకరా భూమి రూ.269 కోట్లకు అమ్ముడైంది. తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (టీజీఐఐసీ) శుక్రవారం నిర్వహించిన భూముల వేలానికి భారీ స్పందన లభించింది. స్థానికంగా ఉన్న సంస్థలతో పాటు జాతీయ స్థాయి రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు పోటాపోటీగా వేలంలో పాల్గొన్నాయి. రాయదుర్గంలోని 5.38 ఎకరాల విస్తీర్ణం కలిగిన ప్లాట్‌ పీ2ను టీజీఐఐసీ వేలం వేసింది. ఇందులో హైదరాబాద్‌కు చెందిన వంశీరాం బిల్డర్స్‌ ఎకరాకు రూ.269 కోట్ల ధరను కోట్‌ చేసి భూమిని దక్కించుకుంది. వేలంలో బ్రేగేడ్‌ సంస్థ కూడా చివరి వరకు పోటీ పడింది.

వివరాలు

వారం రోజుల వ్యవధిలోనే మరో రికార్డు

అయితే చివరకు వంశీరాం బిల్డర్స్‌ అత్యధిక ధరకు భూమిని కైవసం చేసుకుంది.

దీంతో 5.38 ఎకరాల ప్లాట్‌ ద్వారా ప్రభుత్వానికి మొత్తం రూ.1,447.22 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ధర భూమికి నిర్ణయించిన రిజర్వ్‌ ధర కంటే ఏకంగా 52.3 శాతం అధికం కావడం విశేషం.

రాయదుర్గంలో భూముల ధరలు ఎంత వేగంగా పెరుగుతున్నాయో వరుసగా జరిగిన రెండు వేలాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే ప్రాంతంలో గత వారం నిర్వహించిన ప్లాట్‌ పీ1 వేలంలో ఎకరం భూమి రూ.264 కోట్ల ధర పలికింది. 5.25 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఆ ప్లాట్‌ ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.1,386 కోట్ల ఆదాయం వచ్చింది.

వివరాలు

ప్రభుత్వానికి ఏకంగా రూ.8,457.47 కోట్ల ఆదాయం

వేలం విలువలో 25 శాతాన్ని తొలిదశ చెల్లింపుగా సదరు సంస్థ ఇప్పటికే ప్రభుత్వానికి జమ చేసినట్లు అధికారులు తెలిపారు.

రాయదుర్గం భూములు ప్రభుత్వ ఖజానాకు బంగారు గనులుగా మారుతున్నాయి.

2025, 2026 సంవత్సరాల్లో టీజీఐఐసీ రాయదుర్గంలో మొత్తం 41.74 ఎకరాల భూములను వేలం వేసింది.

వీటి ద్వారా ప్రభుత్వానికి ఏకంగా రూ.8,457.47 కోట్ల ఆదాయం సమకూరింది.

ADVERTISEMENT

వివరాలు

ప్రభుత్వానికి భారీ లాభం

ఇక గత గణాంకాలను పరిశీలిస్తే.. 2014 నుంచి 2024 వరకు రాయదుర్గంలో 31.88 ఎకరాల భూములను వేలం వేయగా రూ.730.66 కోట్ల ఆదాయం వచ్చింది.

అంతకుముందు 2007 నుంచి 2013 వరకు 102.49 ఎకరాల భూములను వేలం వేయగా ప్రభుత్వానికి రూ.2,143.69 కోట్ల ఆదాయం సమకూరింది.

రాయదుర్గం ప్రాంతంపై పెట్టుబడిదారుల్లో ఉన్న బలమైన ఆసక్తికి వరుసగా జరిగిన రెండు భూముల వేలాల్లో రికార్డు స్థాయిలో ధరలు పలకడమే నిదర్శనమని టీజీఐఐసీ వైస్‌ ఛైర్మన్‌, ఎండీ కె. శశాంక తెలిపారు.

ADVERTISEMENT