Loading...
Telangana Ramappa Temple: రామప్ప ఆలయం సమీపంలో బొగ్గు తవ్వకాలు.. ఎన్జీటీ కీలక ఆదేశాలు
రామప్ప ఆలయం సమీపంలో బొగ్గు తవ్వకాలు.. ఎన్జీటీ కీలక ఆదేశాలు

Telangana Ramappa Temple: రామప్ప ఆలయం సమీపంలో బొగ్గు తవ్వకాలు.. ఎన్జీటీ కీలక ఆదేశాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 09, 2026
04:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

ములుగు జిల్లాలోని ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప దేవాలయం సమీపంలో బొగ్గు తవ్వకాలకు సంబంధించిన ప్రతిపాదనపై జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) స్పందించింది. ఈ ప్రాజెక్టు వల్ల చారిత్రక ఆలయంతో పాటు రామప్ప చెరువు పర్యావరణానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందంటూ మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించింది. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు కేసు నమోదు చేసి, సంబంధిత ప్రభుత్వ శాఖలకు నోటీసులు జారీ చేసింది. దీంతో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) ప్రతిపాదించిన బొగ్గు గని ప్రాజెక్టుపై మరోసారి చర్చ మొదలైంది.

వివరాలు 

ఈ నెల 4న ఈ అంశంపై విచారణ పార్రంభం 

ఎన్జీటీ చైర్‌పర్సన్ జస్టిస్ ప్రకాశ్ శ్రీవాస్తవ, నిపుణ సభ్యుడు డాక్టర్ అఫ్రోజ్ అహ్మద్‌తో కూడిన ధర్మాసనం ఈ నెల 4న ఈ అంశంపై విచారణ ప్రారంభించింది.

అక్టోబర్ 5న ప్రచురితమైన వార్తా కథనాన్ని ఆధారంగా చేసుకుని ఒరిజినల్ అప్లికేషన్ నంబర్ 594/2026 కింద కేసు నమోదు చేసింది.

ఈ వ్యవహారంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, ములుగు జిల్లా కలెక్టర్, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ చెన్నై ప్రాంతీయ కార్యాలయం, కేంద్ర భూగర్భ జలాల ప్రాధికార సంస్థలను ప్రతివాదులుగా చేర్చింది.

ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ నిబంధనల అమలు, చట్టపరమైన అనుమతుల వివరాలను అఫిడవిట్ల రూపంలో సమర్పించాలని ఆదేశించింది.

వివరాలు 

రామప్ప చెరువుకు కేవలం 300 మీటర్ల దూరంలోనే తవ్వకాలు

తదుపరి విచారణకు కనీసం వారం రోజుల ముందే సంబంధిత అధికారులు తమ సమాధానాలను దాఖలు చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది.

న్యాయవాది ద్వారా కాకుండా నేరుగా సమాధానాలు సమర్పించే ప్రతివాదులు విచారణ సమయంలో వర్చువల్‌గా హాజరై ట్రైబ్యునల్‌కు సహకరించాలని సూచించింది.

సింగరేణి ప్రతిపాదించిన బొగ్గు గని ప్రాజెక్టులో భాగంగా రామప్ప చెరువుకు కేవలం 300 మీటర్ల దూరంలోనే తవ్వకాలు జరిగే అవకాశం ఉందని వార్తా కథనాలు వెల్లడించాయి.

ఈ అంశం పర్యావరణవేత్తలు, వారసత్వ కట్టడాల పరిరక్షణ కోసం పనిచేస్తున్నవారిలో ఆందోళన కలిగిస్తోంది.

ADVERTISEMENT

వివరాలు 

భూగర్భ నిర్మాణాలపై ఆందోళన

భారత భూగర్భ సర్వే సంస్థ (జీఎస్‌ఐ) ప్రస్తావించిన అంశాలు కూడా ఈ ఆందోళనలకు కారణమవుతున్నాయి.

రామప్ప చెరువులో నీటి మట్టంలో మార్పులు, అక్కడి భౌగోళిక నిర్మాణాలు, భూమిలోని పగుళ్లు, రేఖీయ నిర్మాణాలు భూగర్భ జలాల ప్రవాహంపై ప్రభావం చూపే అవకాశం ఉందని కథనాల్లో పేర్కొన్నారు.

ఈ భౌగోళిక పరిస్థితులు సమీపంలో ప్రతిపాదించిన బొగ్గు గని ప్రాంతంపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఇప్పుడు పరిశీలించాల్సిన అంశంగా మారింది.

కాకతీయుల శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలిచిన రామప్ప దేవాలయానికి సుమారు 800 ఏళ్ల చరిత్ర ఉంది.

యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన ఈ ఆలయం ప్రత్యేకమైన ఇసుక ఆధారిత పునాది నిర్మాణంతో ప్రసిద్ధి చెందింది.

ADVERTISEMENT

వివరాలు 

భూగర్భ నిర్మాణాలపై ఆందోళన

అయితే ఆలయ నిర్మాణంలో ఇప్పటికే కొంత అరుగుదల, దెబ్బతినే లక్షణాలు కనిపిస్తున్నట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి.

ఈ పరిస్థితుల్లో ఆలయానికి సమీపంలో భారీ స్థాయిలో బొగ్గు తవ్వకాలు చేపడితే పునాదులు, నిర్మాణ స్థిరత్వం, చెరువులోని నీటి వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

పర్యావరణవేత్తలు ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ, సింగరేణి సంస్థ బొగ్గు గని ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు గత నెలలో వెలువడిన వార్తా కథనాలు వెల్లడించాయి.

ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు, పర్యావరణ పరిరక్షణ చర్యలపై స్పష్టత రావాల్సి ఉంది.

వివరాలు 

డిసెంబర్ 21కి తదుపరి విచారణ

ఈ కేసు ఎన్జీటీ దక్షిణ ప్రాంతీయ బెంచ్ పరిధిలోకి వస్తుందని భావించిన ప్రధాన ధర్మాసనం, అసలు రికార్డులతో సహా కేసును చెన్నైలోని సదరన్ జోనల్ బెంచ్‌కు బదిలీ చేసింది.

తదుపరి విచారణను డిసెంబర్ 21కి వాయిదా వేసింది. పర్యావరణ పరిరక్షణ చట్టం-1986 ఉల్లంఘన జరిగి ఉండవచ్చనే అంశంతో పాటు, పర్యావరణ నిబంధనల అమలుపైనా తీవ్రమైన ప్రశ్నలు ఉన్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది.

సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను ఆధారంగా చేసుకుని ఈ సుమోటో విచారణను ప్రారంభించింది.

వివరాలు 

డిసెంబర్ 21కి తదుపరి విచారణ

తదుపరి విచారణలో సంబంధిత ప్రభుత్వ శాఖలు సమర్పించే అఫిడవిట్లు కీలకం కానున్నాయి.

బొగ్గు తవ్వకాల ప్రతిపాదనకు సంబంధించి అవసరమైన అనుమతులు, పర్యావరణ నిబంధనల అమలు, భూగర్భ జలాలపై ప్రభావం వంటి అంశాలపై అధికారులు ఎలాంటి వివరాలు వెల్లడిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

రామప్ప దేవాలయం, చెరువు పర్యావరణానికి ఎలాంటి నష్టం కలగకుండా ప్రాజెక్టు విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

ADVERTISEMENT