NIA: పహల్గామ్ దాడిలో లష్కరే తోయిబా హ్యాండ్లర్ సహా 7 మందిపై ఎన్ఐఏ చార్జిషీట్లు దాఖలు
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం ఉగ్రదాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కీలక ముందడుగు వేసింది. జమ్ముకశ్మీర్‌లోని ప్రత్యేక NIA కోర్టులో అభియోగ పత్రం (ఛార్జిషీట్)ను దాఖలు చేసింది. ఈ దాడికి సంబంధించి లష్కరే తోయిబా (LeT), దాని అనుబంధ సంస్థ 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' (TRF) సహా మొత్తం ఏడుగురిని నిందితులుగా పేర్కొంది. పహల్గాం దాడిని లష్కరే తోయిబా, టీఆర్‌ఎఫ్‌లు సంయుక్తంగా ప్రణాళిక చేసి అమలు చేశాయని ఛార్జిషీట్‌లో స్పష్టం చేసింది. పాకిస్థాన్‌కు చెందిన హ్యాండ్లర్ సాజిద్ జాట్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చింది. ఈ దాడి వెనుక పాకిస్థాన్ కుట్ర, నిందితుల పాత్రలు, వాటికి సంబంధించిన ఆధారాలను వివరిస్తూ 1,597 పేజీల సమగ్ర అభియోగ పత్రాన్ని NIA సిద్ధం చేసింది.
వివరాలు
'ఆపరేషన్ మహాదేవ్'లో ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులు మృతి
పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే నిషేధిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా, దాని అనుబంధ సంస్థ టీఆర్‌ఎఫ్ ఈ దాడికి కుట్రపన్ని అమలు చేశాయని ఎన్‌ఐఏ ఛార్జిషీట్‌లో వివరించింది. పాక్‌కు చెందిన హ్యాండ్లర్ సాజిద్ జాట్ పేరు ఇందులో ఉంది. అలాగే ఫైజల్ జాట్ అలియాస్ సులేమాన్ షా, హబీబ్ తాహిర్ అలియాస్ జిబ్రాన్, హమ్జా అఫ్గానీ అనే ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులు మృతి చెందినట్లు పేర్కొంది. వీరు ఈ ఏడాది జులై 29న నిర్వహించిన 'ఆపరేషన్ మహాదేవ్'లో శ్రీనగర్ సమీపంలోని దచీగామ్ ప్రాంతంలో హతమైనట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది. ఉగ్రవాదులకు ఆశ్రయం,సహకారం అందించిన వారిగా పర్వైజ్ అహ్మద్, బషీర్ అహ్మద్ జోథర్‌లను కూడా నిందితుల జాబితాలో చేర్చింది.
వివరాలు
ఆ ముగ్గురు ముష్కరులు పాకిస్థాన్ పౌరులే..
సుమారు ఎనిమిది నెలల పాటు శాస్త్రీయ పద్ధతుల్లో సమగ్రంగా దర్యాప్తు నిర్వహించిన ఎన్‌ఐఏ, ఈ కేసులో పాకిస్థాన్ ప్రత్యక్ష ప్రమేయం ఉందని నిర్ధారించింది. దాడిలో పాల్గొన్న ముగ్గురు ముష్కరుల వివరాలను పర్వైజ్, బషీర్ అహ్మద్‌లు వెల్లడించినట్లు తెలిపింది. ఆ ముగ్గురు ముష్కరులు పాకిస్థాన్ పౌరులేనని, నిషేధిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబాతో వారికి సంబంధాలు ఉన్నాయని ఛార్జిషీట్‌లో స్పష్టం చేసింది. దాడి అనంతరం దాదాపు ఎనిమిది నెలల పాటు సాగిన దర్యాప్తులో పాక్ పాత్రకు సంబంధించిన పక్కా ఆధారాలు లభించినట్లు ఎన్‌ఐఏ పేర్కొంది.
వివరాలు
అసలేం జరిగిదంటే?
ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూ-కాశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రం బైసరన్ లోయ వద్ద ఉగ్రవాదులు భయానక దాడికి పాల్పడ్డారు. కుటుంబాలతో కలిసి విహారయాత్రకు వచ్చిన పర్యాటకులపై అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఈ దారుణ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. హిందువులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు దర్యాప్తులో తేలింది. మృతుల్లో కొత్తగా వివాహం చేసుకున్న యువకులు కూడా ఉన్నారు. ఈ ఘటనను ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ ఉగ్రదాడికి టీఆర్‌ఎఫ్ బాధ్యత వహించింది. భారత జాతీయ దర్యాప్తు సంస్థ ఈ దాడికి టీఆర్‌ఎఫ్ అధిపతి షేక్ సజ్జాద్ గుల్ ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు గుర్తించింది.
వివరాలు
పాకిస్థాన్‌కు కీలకమైన సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేత
ఈ ఘటనకు ప్రతిస్పందనగా భారత్ 'ఆపరేషన్ సిందూర్'ను ప్రారంభించింది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత త్రివిధ దళాలు దాడులు నిర్వహించాయి. ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేశాయి. అదేవిధంగా పాకిస్థాన్‌కు కీలకమైన సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. భారత్‌లో ఉన్న పాకిస్థాన్ పౌరులను స్వదేశానికి పంపే ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఈ చర్యలతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు పాకిస్థాన్ వెనక్కి తగ్గింది. ఇరు దేశాల డీఎంఓల మధ్య జరిగిన చర్చలు కాల్పుల విరమణ ఒప్పందానికి దారి తీశాయి. మొదట దాడికి బాధ్యత వహించిన టీఆర్‌ఎఫ్, భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో అనంతరం వెనక్కి తగ్గింది.