NIA: జమ్ముకశ్మీర్‌లో ఎన్‌ఐఏ సోదాలు.. మత విద్యాసంస్థలు, మాజీ నేత ఇంట్లో తనిఖీలు
ఈ వార్తాకథనం ఏంటి
జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ సోమవారం జమ్ముకశ్మీర్‌లో పలుచోట్ల సోదాలు నిర్వహించింది. శ్రీనగర్, షోపియాన్ జిల్లాల్లో మూడు ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. షోపియాన్‌లో ఉన్న దారుల్ ఉలూమ్ సిరాజుల్ ఉలూమ్ విద్యాసంస్థలో కూడా ఎన్‌ఐఏ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ సంస్థను గత నెల చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద అక్రమ సంస్థగా ప్రకటించారు. అక్కడ సాధారణ విద్యతో పాటు మతపరమైన బోధనలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
వివరాలు
జమియత్ ఉల్ బనాత్ పాఠశాలలో తనిఖీలు
ఇక మరో ఎన్‌ఐఏ బృందం జమాతే ఇస్లామీ మాజీ అధినేత షహజాదా ఔరంగజేబు నివాసంలో సోదాలు చేసింది. వేర్పాటువాద భావజాలాన్ని ప్రోత్సహిస్తున్న జమాతే ఇస్లామీ సంస్థను మళ్లీ బలోపేతం చేసే ప్రయత్నాలపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగానే ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. అలాగే శ్రీనగర్‌లోని లాల్‌బజార్ ప్రాంతంలో ఉన్న జమియత్ ఉల్ బనాత్ పాఠశాలలో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ పాఠశాలలో బాలికలకు మతపరమైన బోధనలు అందిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.