Loading...
Amaravati: అమరావతిలో తొలి క్వాంటమ్-ఏఐ యూనివర్సిటీ క్యాంపస్‌.. రూ.731 కోట్లతో నీలిట్
అమరావతిలో తొలి క్వాంటమ్-ఏఐ యూనివర్సిటీ క్యాంపస్‌.. రూ.731 కోట్లతో నీలిట్

Amaravati: అమరావతిలో తొలి క్వాంటమ్-ఏఐ యూనివర్సిటీ క్యాంపస్‌.. రూ.731 కోట్లతో నీలిట్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 06, 2026
08:22 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మరో ప్రతిష్ఠాత్మక కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థ రానుంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నీలిట్‌) రూ.731.7 కోట్ల వ్యయంతో దేశంలోనే తొలి అత్యాధునిక క్వాంటమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యూనివర్సిటీ క్యాంపస్‌ను అమరావతిలో ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు కోసం నిడమర్రు ప్రాంతంలో 10 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం 30 ఏళ్ల లీజుకు కేటాయించింది. అవసరమైతే మరో 30 ఏళ్లపాటు లీజును పొడిగించుకునే అవకాశం కూడా కల్పించింది. తొలుత నీలిట్‌ 19 ఎకరాల భూమిని కోరగా, మంత్రివర్గ ఉపసంఘం 10 ఎకరాల కేటాయింపునకు ఆమోదం తెలిపింది.

వివరాలు 

ఈ సంస్థకు 'డీమ్డ్ టు బి యూనివర్సిటీ' హోదా

నీలిట్‌ స్వయంప్రతిపత్తి కలిగిన శాస్త్ర,సాంకేతిక విద్యా సంస్థ. దేశవ్యాప్తంగా ఐటీ,ఎలక్ట్రానిక్స్ రంగాల్లో నాణ్యమైన విద్య, నైపుణ్య శిక్షణ,పరీక్షల నిర్వహణ, సర్టిఫికేషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందింది.

కేంద్ర విద్యాశాఖ ఈ సంస్థకు 'డీమ్డ్ టు బి యూనివర్సిటీ' హోదా కూడా కల్పించింది.

అమరావతిలో నీలిట్‌ యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమైన ప్రాజెక్టుగా భావిస్తున్నారు.

రాజధానిని దేశంలో క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్‌గా అభివృద్ధి చేయాలన్న లక్ష్య సాధనలో ఇది కీలక అడుగుగా నిలవనుంది.

ఈ ప్రాజెక్టుకు సంబంధించి 2026 ఫిబ్రవరి 20న ఢిల్లీలో నిర్వహించిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నీలిట్‌ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది.

వివరాలు 

అత్యాధునిక రంగాల్లో ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాములు అందుబాటులోకి..

అమరావతిలో నిర్మించనున్న ఈ క్యాంపస్‌లో సుమారు 5.1 లక్షల చదరపు అడుగుల నిర్మిత విస్తీర్ణంతో అత్యాధునిక భవనాలను అభివృద్ధి చేయనున్నారు.

క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్ రంగాల్లో శిక్షణ, పరిశోధనలకు ఇది జాతీయ స్థాయి 'సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్'గా రూపుదిద్దుకోనుంది.

ఈ క్యాంపస్‌లో యూజీ, పీజీ, పీహెచ్‌డీ, డిప్లొమా కోర్సులతో పాటు క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్ అండ్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్, సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్, చిప్ డిజైన్, వీఎల్‌ఎస్‌ఐ, ఏటీఎంపీ, ఎంబెడెడ్ సిస్టమ్స్, హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ వంటి అత్యాధునిక రంగాల్లో ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాములను అందుబాటులోకి తీసుకురానుంది.

ADVERTISEMENT

వివరాలు 

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో తాత్కాలికంగా నీలిట్‌ కార్యకలాపాలు

అంతేకాకుండా అత్యాధునిక పరిశోధనశాలలను ఏర్పాటు చేసి, డీప్‌టెక్ రంగంలో పనిచేస్తున్న అంకుర సంస్థలు (స్టార్టప్‌లు)తో పాటు ఇతర పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక, పరిశోధనా సహకారాన్ని అందించనుంది.

శాశ్వత క్యాంపస్ నిర్మాణం పూర్తయ్యే వరకు ఈ ఏడాది సెప్టెంబరు నుంచే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో తాత్కాలికంగా నీలిట్‌ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ADVERTISEMENT