Page Loader
Interim Budget 2024: ఈ 'మినీ బడ్జెట్‌'లో దేశం ఏం ఆశిస్తోందో తెలుసుకుందాం 

Interim Budget 2024: ఈ 'మినీ బడ్జెట్‌'లో దేశం ఏం ఆశిస్తోందో తెలుసుకుందాం 

వ్రాసిన వారు Stalin
Feb 01, 2024
10:01 am

ఈ వార్తాకథనం ఏంటి

మరికొన్ని వారాల్లోనే లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం( ఫిబ్రవరి 1)మధ్యంతర బడ్జెట్ 2024ను సమర్పించనున్నారు. ఎన్నికల వేళ ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో.. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈక్రమంలో 'మినీ బడ్జెట్'‌లో దేశంలోని రైతులు, పారిశ్రామికవేత్తలు, వేతన జీవులతో పాటు ఇతర వర్గాలు ఏం ఆశిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. రైతులకు మద్దతు: గతేడాది కొన్ని పంటల ఎగుమతిపై నిషేధం, అలాగే పేలవమైన వర్షపాతంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలో రైతులకు ఆర్థిక మద్దతు పెరగాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. దీంతో ఈ బడ్జెట్‌లో ఇందులో వ్యవసాయ రంగ పథకాలకు మెరుగైన కేటాయింపులు, ఎరువులు, వంట గ్యాస్ వంటి నిత్యావసరాలపై రాయితీలను రైతాంగం ఆశిస్తోంది.

బడ్జెట్

ఆదాయపు పన్ను ఉపశమనం ఉంటుందా?

ఆదాయపు పన్ను ఉపశమనం: ఈ బడ్జెట్‌లో వ్యక్తిగత పన్నుల్లో పెద్ద మార్పులకు అవకాశాలు తక్కువగానే ఉన్నప్పటికీ.. అధిక ద్రవ్యోల్బణం ప్రభావం కారణంగా పన్ను చెల్లింపుదారులకు కొంత ఉపశమనం కలిగించేందుకు పాత, కొత్త ఆదాయపు పన్ను విధానాల్లో కొన్ని అదనపు ప్రయోజనాలను అందిస్తే బాగుంటుందని వేతన జీవులు ఆశిస్తున్నారు. ఆర్థిక నిర్వహణ: దేశ అవసరాలకు ఖర్చు చేయడం ఎంత అవసరమో.. ఆర్థిక క్రమశిక్షణను కొనసాగించడం కూడా అంతే ముఖ్యం. ఈ క్రమంలో 2026నాటికి ద్రవ్య లోటును జీడీపీలో 4.5శాతానికి తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఖర్చు, రాబడి మధ్య సమతుల్యతను పాటించడం వల్ల ఇది సాధ్యమవుతుందని కేంద్రం భావిస్తోంది. అందువల్ల సమతుల్యతను పాటించే అంశంపై ఈ బడ్జెట్‌లో ప్రకటన ఉండే అవకాశం ఉంది.

బడ్జెట్

నిరుద్యోగులకు భరోసా ఉంటుందా?

ఉద్యోగ కల్పన: దేశంలో నిరుద్యోగ సమస్య కీలకమైనందున.. బడ్జెట్‌లో ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టాలని యువత భావిస్తున్నారు. ఈ మినీ బడ్జెట్‌లో గణనీయమైన ఉపాధి అవకాశాలను సృష్టించే రంగాల్లో పెట్టుబడులు ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ఊతం: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై గతంలో ఉన్న ప్రాధాన్యతకు అనుగుణంగా.. ఆర్థిక వృద్ధికి కీలకమైన రోడ్లు, రైల్వేలు, డిజిటల్ కార్యక్రమాలపై ప్రభుత్వం తన వ్యయాన్ని మరింత పెంచనుంది. గృహాల నిర్మాణం: ఈ బడ్జెట్‌లో తక్కువ ఖర్చుతో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసే అంశంపై కీలక నిర్ణయం ఉండే అవకాశం ఉంది. దేశంలోని ప్రజల గృహ అవసరాలను పరిష్కరించడానికి తక్కువ ఖర్చుతో నిర్మించే అవకాశంపై దృష్టి సారించవచ్చు. ఈ నిర్ణయం నిర్మాణ పరిశ్రమను కూడా ఉత్తేజపరుస్తుంది.

బడ్జెట్

గ్రీన్ ఎనర్జీకి పెద్దపీట

ప్రభుత్వ ఆస్తుల విక్రయాలు కొనసాగింపు: పన్ను చెల్లింపుదారులపై అధిక భారం పడకుండా ఆర్థిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు.. వ్యూహాత్మక ఆస్తుల విక్రయాలను కొనసాగించాలన్న దృఢ సంకల్పంతో కేంద్ర ఉంది. ఈ బడ్జెట్‌లో దీనికి అనుకూలంగా నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. మహిళా సాధికారత: మహిళా సాధికారత కోసం ప్రత్యేక చర్యలను ఈ బడ్జెట్‌లో తీసుకునే అవకాశం ఉంది. వంట గ్యాస్, రుణాల సబ్సిడీలపై మహిళలు ఆశలు పెట్టుకున్నారు. గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులు: సుస్థిర ఇంధనం వైపు భారతదేశాన్ని నడిపి.. అగ్రగామిగా నిలిపేందుకు గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ వాహనాల కార్యక్రమాలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించవచ్చు.