Pakistan Supreme Court Blast: పాకిస్థాన్ సుప్రీంకోర్టులో ఘోర పేలుడు.. 12 మందికి తీవ్ర గాయాలు!
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ సుప్రీంకోర్టు భవనంలో ఘోర పేలుడు సంభవించింది. ఇస్లామాబాద్‌లోని సుప్రీంకోర్టు బేస్‌మెంట్‌లో ఉన్న క్యాంటీన్‌లో జరిగిన ఈ ప్రమాదంలో కనీసం 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. గ్యాస్ సిలిండర్ పేలుడు వల్ల ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం చెబుతోంది. ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ మరమ్మతు పనుల సమయంలో ఈ పేలుడు సంభవించిందని స్థానిక మీడియా వివరించింది. సామా టీవీ రిపోర్టు ప్రకారం, సుప్రీంకోర్టు భవనంలోని సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌ను మరమ్మతు చేస్తుండగా ఆకస్మికంగా భారీ పేలుడు సంభవించిందని నిఘా వర్గాలు ధృవీకరించాయి.
Details
భయంతో పరుగులు
పేలుడు కారణంగా కోర్టు ప్రాంగణం మొత్తం కంపించిపోయింది. ఒక్కసారిగా మంటలు, పొగలు వ్యాపించడంతో భవనంలో గందరగోళ వాతావరణం నెలకొంది. న్యాయవాదులు, న్యాయమూర్తుల సిబ్బంది, ఇతర ఉద్యోగులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో కోర్టు నంబర్ 6 వద్ద తీవ్ర నష్టం వాటిల్లినట్లు సమాచారం. పేలుడు సంభవించే కొద్ది సేపటి ముందు అక్కడ జస్టిస్ అలీ బాకర్ నజాఫీ, జస్టిస్ షాజాద్ మాలిక్ విచారణలు నిర్వహించినట్లు నివేదికలు చెబుతున్నాయి.
Details
కార్మికులకే ఎక్కువ గాయాలు
పేలుడు జరిగిన సమయంలో ఏసీ ప్లాంట్ వద్ద మరమ్మతు పనులు చేస్తున్న కార్మికులే ఎక్కువగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. వారందరినీ సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, ఒక ఏసీ టెక్నీషియన్ శరీరం 80% వరకు కాలిపోయిందని పోలీసులు వెల్లడించారు. అధికారుల స్పందన ఇస్లామాబాద్ పోలీస్ కమిషనర్ అలీ నాసిర్ రిజ్వీ మాట్లాడుతూ, "క్యాంటీన్‌లో కొంతకాలంగా గ్యాస్ లీకేజీ జరుగుతోందని సమాచారం ఉంది. ఎయిర్ కండిషనింగ్ మరమ్మతు సమయంలో ఆ గ్యాస్ లీక్ కారణంగా ఈ పేలుడు సంభవించినట్లు అనిపిస్తోంది. నిపుణుల బృందం కూడా ఇది గ్యాస్ పేలుడే అని నిర్ధారించిందన్నారు.
Details
దర్యాప్తు కొనసాగుతోంది
ఈ ఘటనపై రవాణా, హోం, సివిల్ సేఫ్టీ శాఖల అధికారులు సంయుక్త దర్యాప్తు ప్రారంభించారు. బేస్‌మెంట్‌లోని ఈ కెఫెటీరియా సుప్రీంకోర్టు ఉద్యోగులకు మాత్రమే కేటాయించబడిందని, ఇతరులకు ప్రవేశం ఉండదని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల అసలు కారణాలను వెలికితీసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం.