Karthika pournami: కార్తిక పౌర్ణమి విశిష్టత.. జ్వాలాతోరణం వెనుక పురాణ గాథలు.. త్రిపురాసుర సంహారం నుండి హాలాహల కథ వరకు
ఈ వార్తాకథనం ఏంటి
కార్తిక్యాదిషు సంయోగే కృత్తికాది ద్వయం ద్వయమ్| అన్త్యోపాన్త్యౌ పఞ్చమశ్చ త్రిధా మాసత్రయం స్మృతమ్ || (సూర్య సిద్ధాంతం) పురాణోక్తి ప్రకారం.."కార్తికంతో సమానమైన మాసం లేదు, విష్ణుసమాన దేవుడు లేడు, గంగాసమాన తీర్థం లేదు" అని పేర్కొంటుంది. ఈ కార్తిక మాసం భక్తుల దృష్టిలో అత్యంత పవిత్రమైనదిగా,మహిమాన్వితమైనదిగా భావించబడుతుంది. శివుడు,విష్ణువు ఇద్దరికీ సమానంగా ప్రీతికరమైన ఈ నెల ఆధ్యాత్మిక సాధనకు అతి శ్రేష్ఠమైన కాలంగా చెప్పబడింది. కార్తిక మాసం ఏర్పడేది పూర్ణిమ తిథి కృత్తికా నక్షత్రంతో కలిసినప్పుడు. ఈ సంవత్సరం నవంబర్ 5, 2025 (బుధవారం) రోజున కార్తిక పౌర్ణమి ఏర్పడుతోంది. సూర్య సిద్ధాంత పంచాంగ గణన ప్రకారం, ఆ పూర్ణిమ తిథి సాయంత్రం 6.35 గంటల వరకు ఉంటుంది.
వివరాలు
స్నానం, దీపదానం, దైవదర్శనం చేసిన వారికి..
ఈ రోజు చంద్రుడు భూమికి అత్యంత సమీపంలో ఉంటాడు. చంద్రుడు మనస్సుకు ఆధిపత్య దేవత. చంద్రకాంతులు భూమిపై విరజిల్లే సమయంలో మనస్సు ప్రశాంతమవుతుందనే విశ్వాసం ఉంది. ఏటా జరిగే స్నానాల్లో కార్తిక స్నానం అత్యంత శ్రేష్ఠమైనదిగా శాస్త్రాలు పేర్కొంటాయి. పౌర్ణమి రోజున ఈ స్నానం, దీపదానం, దైవదర్శనం చేసిన వారికి అనేక జన్మాల పుణ్యం కలుగుతుందని వేదోక్తి ఉంది. శ్లోకం: కార్తిక్యాం కృత్తికాయోగే యః కుర్యాత్ స్వామి దర్శనం। సప్తజన్మ భవేద్విప్రో ధనాధ్యో వేదపారగః॥ ఈ రోజున గంగా, గోదావరి, కృష్ణా, తుంగభద్ర వంటి పవిత్ర నదుల్లో స్నానం అత్యంత పుణ్యదాయకం. నదీ స్నానం సాధ్యం కానివారు ఇంట్లోనే గంగాజలం కలిపిన నీటితో స్నానం చేయవచ్చు.
వివరాలు
కార్తిక శుద్ధ ఏకాదశి నాడు మహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొంటాడని పురాణం
సాయంత్రం ఆకాశదీపం వెలిగించడం,తులసి కోట వద్ద దీపాలు ఉంచడం ఆచారంగా ఉంది. 365 రోజులకు ప్రతీకగా 365 వత్తులతో దీపం వెలిగించడం ప్రత్యేక సంప్రదాయం. శాస్త్రవచనం ప్రకారం.."కార్తికేతు కృతా దీక్షా నృణాం జన్మవిమోచనీ".. ఈ మాసంలో దీక్ష స్వీకరించడం జన్మబంధనాల నుండి విముక్తి ఇస్తుంది. కార్తిక పౌర్ణమి రాత్రి వెన్నెల కాంతిలో పరమాన్నం వండుకొని భుజించడం ఆచారంగా ఉంది. ఈ రోజున కార్తికేయ స్వామిని స్మరించుకోవడం శత్రునాశనానికి శుభప్రదం. చంద్రోదయ సమయానికి ఆరు కృత్తికలను అగ్నిరూపంలో ఆరాధిస్తారు. కార్తిక శుద్ధ ఏకాదశి నాడు మహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొంటాడని పురాణం చెబుతుంది. ఈ మాసం,దేవతలకు కూడా విశిష్టమైనది.మనుషులకు దీపావళి ఆశ్వయుజ అమావాస్య రోజున ఉన్నట్లు, దేవతలకు కార్తిక పౌర్ణమి "దేవ దీపావళి"గా పేరుగాంచింది.
వివరాలు
జ్వాలాతోరణం.. త్రిపురాసుర సంహారం జ్ఞాపకోత్సవం
కాశీ నగరంలో గంగా తీరాలపై వేలాది దీపాలతో ఈ రోజు అత్యంత వైభవంగా "దేవ దీపావళి" జరుపుతారు. ఆ దీపకాంతుల్లో గంగా తీర సాక్షాత్ స్వర్గంలా మెరిసిపోతుంది. దేవతలే భూమిపైకి వచ్చి దీపారాధన చేస్తారని విశ్వాసం. అరుణాచలంలో ఈ రోజు ప్రసిద్ధ కృత్తిక దీపం వెలిగిస్తారు. దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠంలో ఈ రోజున లక్ష దీపోత్సవం అత్యంత ఘనంగా జరుగుతుంది. జగద్గురువులు కార్తిక శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ప్రతిరోజూ తుంగా హారతి ఇస్తారు.
వివరాలు
కార్తిక పౌర్ణమి సాయంత్రం.. జ్వాలాతోరణం
కార్తిక పౌర్ణమి సాయంత్రం జరుగు మరో విశిష్ట ఉత్సవం జ్వాలాతోరణం. ఈ పండుగను కేవలం చూడటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది. ఆలయ ప్రాంగణంలో రెండు కర్రలను నిలబెట్టి వాటి మధ్య అడ్డంగా మరో కర్రను కట్టి, దానిపై ఎండుగడ్డిని చుట్టి నిప్పుతో వెలిగిస్తారు. ఆ మండుతున్న జ్వాలలతో ఏర్పడిన తోరణం క్రింద శివపార్వతులను పల్లకిలో తీసుకువెళ్తారు. అనంతరం భక్తులు కూడా ఆ తోరణం కిందగా దాటుతూ తమ పాపాలు, దోషాలు తొలగాలని ప్రార్థిస్తారు.
వివరాలు
ఈ ఉత్సవానికి రెండు ప్రధాన పురాణ గాథలు ఉన్నాయి:
1. త్రిపురాసుర సంహారం: త్రిపురాసుర అనే ముగ్గురు రాక్షసులను పరమశివుడు సంహరించిన రోజు కార్తిక పౌర్ణమి. అందువల్ల దీనిని త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు. సంహారానంతరం పార్వతీదేవి తన భర్త శివుడికి దృష్టిదోషం తగలకూడదని భావించి, ఆ దోష నివారణార్థం జ్వాలాతోరణాన్ని ఏర్పాటు చేసిందని పురాణం చెబుతుంది. విజయం సూచకంగా తులసి కోట వద్ద 365వత్తుల దీపం వెలిగించే ఆచారం అప్పటి నుంచి మొదలైంది. 2. హాలాహల విషాన్ని శివుడు తాగిన ఘట్టం: క్షీరసముద్ర మథనం సమయంలో పుట్టిన హాలాహల విషాన్ని పరమశివుడు స్వీకరించి తన కంఠంలో నిలిపాడు. అప్పటి నుంచి ఆయన నీలకంఠుడు అయ్యాడు. ఆ ఘట్టం తర్వాత పార్వతీదేవి కుటుంబ సమేతంగా శివుడు మూడుసార్లు జ్వాలాతోరణం దాటినట్లు చెబుతారు.
వివరాలు
దీపదానం.. ఆధ్యాత్మిక వెలుగుని ప్రసారించే పూజ
ఆ తోరణంలో కాలిపోయిన గడ్డిని పశువుల ఆహారంలో లేదా ధాన్యం నిల్వలో ఉంచడం పశు, ధాన్య సంపదను పెంచుతుందనే విశ్వాసం ఉంది. 3. నరకద్వార విముక్తి: ఈ తోరణం కింద నుంచి దాటితే నరకద్వారం ప్రవేశం తొలగిపోతుందని, పాపాలు హరించబడతాయని పురాణాలు చెబుతున్నాయి. ఆరోగ్యం, ఆయురారోగ్యం, అపమృత్యు నివారణ కూడా కలుగుతుందని విశ్వాసం. కార్తిక పౌర్ణమి రోజున ఉపవాసం ఉండి, ఆలయంలో లేదా ఇంట్లో దీపం వెలిగించడం అత్యంత పుణ్యప్రదం. కనీసం ఒక దీపమైనా వెలిగించి ఈ శ్లోకాన్ని పఠించాలి: శ్లోకం: కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే యే నివసంతి జీవాః। దృష్ట్వా ప్రదీపం న హి జన్మభాగినః భవంతి త్వం శ్వపచాహి విప్రాః॥
వివరాలు
ప్రకాశమే జీవితం,అజ్ఞానమే చీకటి.
దీపకాంతి వల్ల కీటకాలు, పక్షులు, జలచరాలు, వృక్షాలు వంటి సమస్త జీవరాశులు తమ ఆ రూపాలలోనే మోక్షం పొందాలని మనసారా ప్రార్థించాలి. మానవునికి ఉన్న జ్ఞానమార్గం ఇతర జీవరాశులకు లేనందున, వాటి కోసం దీపదానం ద్వారా మోక్షం కోరడం మన ధర్మం. కార్తిక పౌర్ణమి అందించే సారాంశం ఒక్కటే — "ప్రకాశమే జీవితం, అజ్ఞానమే చీకటి." దీపం వెలిగించడం అంటే కేవలం పూజ కాదు; అది మనలోని అహంకారం, ద్వేషం, అసూయ అనే అంధకారాన్ని తొలగించి, ప్రేమ, జ్ఞానం, సద్గుణాల కాంతిని ప్రపంచమంతా వ్యాప్తి చేయమని చెప్పే ఆధ్యాత్మిక సందేశం.