Bihar politics: నేడు నితీష్ కుమార్ రాజీనామా.. గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన బిహార్ సీఎం
బిహార్ సీఎం నితీష్ కుమార్ బీజేపీ కూటమిలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఆదివారం ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు సీఎం నితీష్ కుమార్.. ఇప్పటికే గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఉదయం 10గంటలకు గవర్నర్‌ను కలిసి.. నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే నితీష్ కుమార్ రాజీనామా చేసినా.. మళ్లీ ఆయనే సీఎంగా కొనసాగనున్నారు. డిప్యూటీ సీఎంగా బీజేపీ నాయకుడు సుశీల్ కుమార్ మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ మద్దతుతో ఆయన కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.
సాయంత్రంలోగా నితీష్ ప్రమాణస్వీకారం
బీజేపీ మద్దతుతో ఆదివారమే నితీశ్ కుమార్ మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని జేడీయూ వర్గాలు తెలిపాయి. ఈరోజు సాయంత్రం రాజ్‌భవన్‌లో ఆయన తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రమాణ స్వీకారోత్సవానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఎల్జేపీఆర్ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్, ఇతర మిత్రపక్షాల అధ్యక్షులు కూడా హాజరుకావచ్చని చర్చ జరుగుతోంది. జేడీయూకు చెందిన 45, బీజేపీకి చెందిన 78, హిందుస్థానీ అవామ్ మోర్చాకు చెందిన 4, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే సహా మొత్తం 128 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలను నితీశ్‌కుమార్ ఈరోజు గవర్నర్‌కు అందజేయనున్నారు.