Tarique Rahman: నేడు బంగ్లాదేశ్ ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణస్వీకారం..
ఈ వార్తాకథనం ఏంటి
ఈరోజు బంగ్లాదేశ్ కొత్త ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీనికి ముందుగా మంగళవారం ఉదయం 11:30 గంటలకు పార్లమెంట్ భవనంలో బీఎన్‌పీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో తారిక్ రెహమాన్‌ను పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. అనంతరం ఆయనను ప్రధానిగా అధికారికంగా ప్రమాణస్వీకారం చేస్తారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం తారిక్ రెహమాన్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సంప్రదాయానికి భిన్నంగా,ఈసారి ప్రమాణస్వీకార కార్యక్రమం బంగాభబన్‌లో కాకుండా పార్లమెంట్ కాంప్లెక్స్‌లోని సౌత్ ప్లాజాలో నిర్వహించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం జాతీయ సంసద్ సౌత్ ప్లాజాలో అధ్యక్షుడు మహ్మద్ షాబుద్దీన్ తారిక్ రెహమాన్‌తో ప్రమాణం చేయించనున్నట్లు ప్రభుత్వ ఆధీనంలోని బీఎస్‌ఎస్ వార్తా సంస్థ సోమవారం వెల్లడించింది.
వివరాలు
హాజరుకానున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా
అంతకుముందు, ప్రధాన ఎన్నికల కమిషనర్ AMM నాసిర్ ఉద్దీన్ కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులందరితో ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఆ తరువాత పార్లమెంటరీ పార్టీ నాయకుడిని అధికారికంగా ఎంపిక చేస్తారు. తారిక్ రెహమాన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారత్ నుంచి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలోని బృందం హాజరుకానుంది. ఆయనతో పాటు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ కూడా ఈ బృందంలో ఉండనున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు, టర్కీ అండర్ సెక్రటరీ బెరిస్ ఎకిన్సి, శ్రీలంక ఆరోగ్య మరియు మాస్ మీడియా మంత్రి డాక్టర్ నలిందా జయతిస్సా కూడా హాజరు కానున్నారు.
వివరాలు
యూనస్ నుంచి బాధ్యతలు తీసుకోనున్న తారిక్
తారిక్ రెహమాన్ విషయానికి వస్తే, ఆయన దివంగత బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలిదా జియా కుమారుడు. సుమారు 17 సంవత్సరాల పాటు లండన్‌లో ప్రవాస జీవితం గడిపిన ఆయన, ఇటీవల రెండు నెలల క్రితమే భార్య, కుమార్తెతో కలిసి స్వదేశానికి తిరిగివచ్చారు. ఇప్పటివరకు ఆయన ఏ ప్రభుత్వ పదవీ చేపట్టలేదు. కుటుంబానికి ఉన్న రాజకీయ నేపథ్యం తప్ప ప్రత్యక్ష రాజకీయ అనుభవం లేకపోయినా, తాజాగా జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ నుంచి తారిక్ రెహమాన్ అధికారికంగా ప్రభుత్వ బాధ్యతలను స్వీకరించనున్నారు.