Trump-Iran: జెనీవాలో అమెరికా-ఇరాన్ కీలక చర్చలు: అణు ఒప్పందంపై ఉత్కంఠ
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ దేశాల మధ్య మంగళవారం మరోసారి కీలకమైన చర్చలు జరగనున్నాయి. అణు ఒప్పందంపై పునరుద్ధరణకు సంబంధించిన అంశాలపై ఇరు దేశాలు మరోసారి చర్చల బల్లపైకి రానున్నాయి. స్విట్జర్లాండ్‌లోని జెనీవా వేదికగా ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ జెనీవాకు చేరుకున్నారు. ఆయనతో పాటు ఉన్నత స్థాయి అధికారుల బృందం కూడా అక్కడికి వెళ్లింది. అదే సమయంలో అమెరికా ప్రతినిధి బృందం కూడా చర్చలకు సిద్ధమైంది. ఈ సమావేశాల్లో పరోక్షంగా అధ్యక్షుడు ట్రంప్ పాల్గొంటున్నట్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ చర్చల ఫలితాలపై అంతర్జాతీయంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
వివరాలు
ఒకవేళ ఈ చర్చలు కూడా విఫలమైతే..
ఇదిలా ఉండగా, చర్చలకు ముందే అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇరాన్‌తో ఒప్పందానికి చేరుకోవడం అంత సులభం కాదని ఆయన స్పష్టం చేశారు. అణు అంశాలతో పాటు ఇరాన్ క్షిపణి కార్యక్రమంపైనా చర్చ జరగాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే తొలి దశ చర్చలు ఒమన్‌లో జరిగినప్పటికీ, వాటి ద్వారా గణనీయమైన పురోగతి సాధించలేకపోయారు. ఈసారి అయినా సానుకూల ఫలితం దక్కుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఈ చర్చలు కూడా విఫలమైతే, రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
వివరాలు
అణు అంశాలకే చర్చలను పరిమితం చేయాలి: ఇరాన్
ఇదే సమయంలో సోమవారం జెనీవాలో ఇరాన్ విదేశాంగ మంత్రి ఐక్యరాజ్య సమితి అణు పర్యవేక్షణ సంస్థ అధిపతితో భేటీ అయ్యారు. చర్చలకు ముందు ఈ సమావేశం జరిగినప్పటికీ, అణు ఒప్పందంపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకున్నట్లు ఇరుపక్షాల నుంచీ ఎలాంటి సంకేతాలు వెలువడలేదు. అణు అంశాలకే చర్చలను పరిమితం చేయాలని ఇరాన్ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. క్షిపణి కార్యక్రమం సహా ఇతర విషయాలపై చర్చించబోమని ఇరాన్ స్పష్టంగా చెబుతున్నట్టు సమాచారం.
వివరాలు
అరేబియా సముద్రంలో అమెరికా యుద్ధ నౌకలు
అలాగే జీరో యురేనియం సుసంపన్నం వంటి అంశాలపై కూడా చర్చలకు తావులేదని ఇరాన్ స్పష్టం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో జెనీవాలో జరిగే తాజా చర్చలు ఫలిస్తాయా లేదా అన్నది అనిశ్చితంగా మారింది. ఇదిలా ఉండగా, ఇప్పటికే అమెరికా యుద్ధ నౌకలను అరేబియా సముద్రంలో మోహరించింది. ఒకవేళ చర్చలు విఫలమైతే, ఇరాన్‌లో ఉద్రిక్తతలు, అశాంతి పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.