MBBS Seats: ఎంబీబీఎస్ సీట్ల వివరాలు విడుదల.. అనుమతికి మించి ప్రవేశాలిస్తే చర్యలు: ఎన్‌ఎంసీ
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి అందుబాటులో ఉన్న అండర్‌గ్రాడ్యుయేట్ (ఎంబీబీఎస్) సీట్లకు సంబంధించిన వివరాలను జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) గురువారం వెల్లడించింది. ఈనెల 1వ తేదీ నాటికి అమల్లో ఉన్న సీట్ల వివరాలను ఆధారంగా చేసుకుని తాజా జాబితాను ప్రకటించింది. మెడికల్ అసెస్‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డు (ఎంఏఆర్‌బీ), ఎన్‌ఎంసీ తొలి అప్పీల్ కమిటీ, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన రెండో అప్పీల్ కమిటీ ఆమోదించిన సీట్ల మ్యాట్రిక్‌ను ఈ జాబితాలో పొందుపరిచారు. ఈ మేరకు ఎన్‌ఎంసీ నోటీసు జారీ చేసింది.
వివరాలు
ఆమోదించిన సీట్లకే ప్రవేశాలు
2026-27 విద్యా సంవత్సరానికి అధికారికంగా అనుమతి లభించిన ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను మించి అదనపు ప్రవేశాలు చేపట్టకూడదని ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది.
కళాశాలకు మంజూరైన కోటాలో ఒక్క సీటు అదనంగా విద్యార్థికి కేటాయించినా, దాన్ని ఎన్‌ఎంసీ చట్ట నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తామని హెచ్చరించింది.
అనుమతించిన పరిమితిని దాటి ప్రవేశాలు నిర్వహించే వైద్య కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషన్ పేర్కొంది.
అలాగే దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ నిర్వహించే మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ), ఆయా రాష్ట్రాల కౌన్సెలింగ్ విభాగాలు కూడా కేవలం ఎన్‌ఎంసీ ఆమోదించిన సీట్ల ఆధారంగానే ప్రక్రియను చేపట్టాలని సూచించింది.
వివరాలు
తెలంగాణలో 525 ఎంబీబీఎస్ సీట్లు పెంపు
ఇక తెలంగాణకు సంబంధించి ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.
2026-27 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో మొత్తం 525 సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చినట్లు ఎన్‌ఎంసీ వెల్లడించింది.
రాష్ట్రంలోని 19 ప్రభుత్వ, 21 ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కలిపి ప్రస్తుతం మొత్తం ఎంబీబీఎస్ సీట్లు 7,615కి చేరినట్లు తెలిపింది.
ఇందులో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 275 సీట్లు, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 250 సీట్లు కొత్తగా పెరిగాయి.
దీంతో తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కలిపి ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య గతంతో పోలిస్తే మరో 525 సీట్ల మేర పెరిగినట్లైంది.