Loading...
Assam Floods: పడవ లేదు.. రెస్క్యూ బృందం లేదు.. అరటి దుంగలతో 97 ఏళ్ల వృద్ధురాలిని కాపాడిన కుటుంబం
అరటి దుంగలతో 97 ఏళ్ల వృద్ధురాలిని కాపాడిన కుటుంబం

Assam Floods: పడవ లేదు.. రెస్క్యూ బృందం లేదు.. అరటి దుంగలతో 97 ఏళ్ల వృద్ధురాలిని కాపాడిన కుటుంబం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 12, 2026
05:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

పడవ లేదు.. రెస్క్యూ బృందం అందుబాటులో లేదు. అర్ధరాత్రి వరద నీరు ఇంటిని చుట్టుముట్టింది. నడవడం కూడా కష్టంగా ఉన్న 97 ఏళ్ల వృద్ధురాలిని ఎలా కాపాడాలో కుటుంబ సభ్యులకు అర్థం కాలేదు. చివరకు అరటి దుంగలతో తాత్కాలిక తెప్ప తయారు చేసి, ప్రాణాలకు తెగించి ఆమెను వరద నీటిలోంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. సివసాగర్ జిల్లాలోని చారింగ్ గ్రామానికి చెందిన లోకడా దువారాను ఆమె కుమారుడు,కోడలు బోర్నాలి బరువా కలిసి రక్షించారు. ఇంట్లోకి వరద నీరు వేగంగా చేరుతుండటంతో బయటకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ సమయంలో పడవ గానీ,రెస్క్యూ బృందం గానీ అందుబాటులో లేవు. దీంతో కుటుంబ సభ్యులు అరటి దుంగలను ఉపయోగించి తెప్ప తయారు చేశారు.

వివరాలు 

మూడు అడుగుల వరదలో ప్రయాణం..

ఆ తెప్పపై వృద్ధురాలిని కూర్చోబెట్టి ముగ్గురూ వరదలో ప్రయాణం మొదలుపెట్టారు.

గ్రామంలో వరద ప్రవాహం చాలా వేగంగా ఉండటంతో ప్రతి అడుగు ప్రమాదకరంగా మారింది.

''అందరూ తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు''అని బోర్నాలి బరువా బీబీసీకి తెలిపినట్లు సమాచారం.

ఇంటినుంచి బయలుదేరిన సుమారు గంట తర్వాత జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సహాయ శిబిరానికి వారు చేరుకున్నారు.

కొన్ని ప్రాంతాల్లో వరద నీరు మూడు నుంచి నాలుగు అడుగుల లోతు ఉంది.

దీంతో ఒకరి చేతులు మరొకరు పట్టుకుని, కర్రల సాయంతో బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగారు.

వరదల నుంచి వృద్ధురాలిని కాపాడగలిగినా.. వారి ఇల్లు మాత్రం నీట మునిగింది.

వివరాలు 

వరదల దెబ్బకు బోర్నాలి పశుపోషణ వ్యాపారం కుదేలు

చివరకు ఇంట్లోకి సుమారు ఐదు అడుగుల మేర వరద నీరు చేరింది. దీంతో కుటుంబానికి చెందిన విలువైన వస్తువుల్లో చాలా వరకు ధ్వంసమయ్యాయి.

40 ఏళ్ల బోర్నాలి బరువా తన జీవితంలో ఇంతటి వరదను ఎప్పుడూ చూడలేదని చెప్పారు.

పుట్టినప్పటి నుంచి చారింగ్‌లోనే నివసిస్తున్న ఆమె.. గ్రామంలో ఇంత భారీగా వరద నీరు చేరడం ఇదే తొలిసారి అని తెలిపారు.

ఈ వరదలు ఆమె ఎన్నో ఏళ్లుగా కష్టపడి అభివృద్ధి చేసుకున్న పశుపోషణ,కోళ్ల పెంపకం వ్యాపారాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీశాయి.

2016లో జర్నలిజం రంగాన్ని వీడి పశుపోషణపై దృష్టి పెట్టిన బోర్నాలి బరువా పెద్ద స్థాయిలో పశువుల పెంపకాన్ని చేపట్టారు. 2019లో ఆమెకు అసోం 'బెస్ట్ లైవ్‌స్టాక్ ఫార్మర్' అవార్డు కూడా లభించింది.

ADVERTISEMENT

వివరాలు 

వరద బీభత్సం.. పశుసంపదతో పాటు ఇంటి సామగ్రి సర్వనాశనం

వరదలకు ముందు ఆమె ఫారంలో సుమారు 300 మేకలు, 500 బాతులు, 1,000 కోళ్లు ఉండేవి.

చేపల పెంపకం కూడా చేసేవారు. అయితే వరదల కారణంగా వీటిలో ఎక్కువ భాగం కొట్టుకుపోయాయి.

సుమారు 60 మేకలు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాయి. వందలాది బాతులు, కోళ్లు, చేపలతో పాటు పశువుల మేత తయారు చేసే యంత్రాలను కూడా కోల్పోయారు.

వరద నీరు కుటుంబంలోని ఫర్నిచర్, వాహనాలు, ల్యాప్‌టాప్‌లు, పుస్తకాలను కూడా దెబ్బతీసింది. ఇంట్లోని సామగ్రి చాలావరకు పనికిరాకుండా పోయింది.

ADVERTISEMENT

వివరాలు 

.. 10 రోజుల పాటు సహాయ శిబిరంలో కుటుంబం

జులై 17న ఝాంజీ నది నీటిమట్టం పెరగడంతో వరద ముప్పు ఉందని కుటుంబానికి తొలిసారి తెలిసింది.

రెండు రోజుల్లోనే దిఖౌ, మిటాంగ్ నదులు కూడా పొంగిపొర్లాయి. బ్రహ్మపుత్ర నదికి అనుబంధంగా ఉన్న నదుల వ్యవస్థలో నీటిమట్టాలు పెరగడంతో చుట్టుపక్కల ప్రాంతాలకు వరద నీరు విస్తరించింది.

ఇంట్లోకి అప్పటికే సుమారు నాలుగు అడుగుల నీరు చేరడంతో కుటుంబం ఇల్లు వదిలి బయటకు వచ్చింది.

అనంతరం 10 రోజుల పాటు సహాయ శిబిరంలోనే గడిపారు. ఐదు రోజుల పాటు విద్యుత్, మొబైల్ కనెక్టివిటీ లేకపోవడంతో ఫోన్ కూడా ఛార్జ్ చేసుకోలేకపోయానని బోర్నాలి బీబీసీకి తెలిపారు.

వివరాలు 

ఎగువ అసోంలో భారీ వర్షాలు.. వరదలతో మరింత తీవ్ర పరిస్థితులు

ప్రభుత్వం తరఫున బియ్యం,పప్పులు, వంట నూనె వంటి నిత్యావసర సరుకులను అందించారు.

శిబిరంలో ఉన్న ఇతరులు కూడా వరదల్లో ప్రాణాలతో బయటపడిన పశువులను సంరక్షించడంలో ఆ కుటుంబానికి సహాయం చేశారు.

కొందరు స్వచ్ఛంద కార్యకర్తలు అనారోగ్యంతో ఉన్న జంతువులకు ఆహారం అందించడంతో పాటు చికిత్స చేయడంలోనూ సహాయం చేశారు.

ఎగువ అసోంతో పాటు పొరుగున ఉన్న నాగాలాండ్‌లో కురుస్తున్న భారీ వర్షాలు పరిస్థితిని మరింత తీవ్రం చేశాయి.

సివసాగర్,చరైడియో,జోర్హాట్ సహా పలు ప్రాంతాల్లో భారీ వరదలు,మట్టి పేరుకుపోవడం వంటి సమస్యలు ఏర్పడ్డాయి.

బ్రహ్మపుత్ర నది వరద సమస్య అసోంకే పరిమితం కాదు. పొరుగున ఉన్న కొండ ప్రాంత రాష్ట్రాల నుంచి కూడా పలు ఉపనదులు ప్రవహించి బ్రహ్మపుత్రలో కలుస్తాయి.

వివరాలు 

అసోంలో వరద బీభత్సం.. 1.12 లక్షల మందిపై ప్రభావం

అందువల్ల వరద నియంత్రణ చర్యలను అసోం రాష్ట్ర పరిధిలోనే పరిమితం చేయడం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు.

అసోంలో వరద పరిస్థితి ఇప్పటికీ తీవ్రంగానే ఉంది. అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రకారం నాలుగు జిల్లాల్లో 1.12 లక్షల మందికి పైగా వరదల ప్రభావానికి గురయ్యారు.

వరదల కారణంగా మృతుల సంఖ్య 101గా కొనసాగుతోంది. తాజా బులెటిన్ ప్రకారం కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు.

ప్రస్తుతం గోలాఘాట్ జిల్లాలో పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉంది.

అక్కడ 65 వేల మందికి పైగా ప్రభావితమయ్యారు. సివసాగర్‌లో దాదాపు 20 వేల మంది, నాగావ్‌లో 16 వేల మందికి పైగా వరదల బారినపడ్డారు.

వివరాలు 

అసోం వరదల బీభత్సం.. వందల గ్రామాలు నీటమునక,వేల ఎకరాల్లో పంట నష్టం

కనీసం 441 గ్రామాలు ఇంకా నీటమునిగే ఉన్నాయి. 10,879.03 హెక్టార్ల పంట భూములు దెబ్బతిన్నాయి.

వరదల కారణంగా కట్టలు, రహదారులు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాలు కూడా దెబ్బతిన్నాయి.

ఐదు జిల్లాల్లో అధికారులు 92 సహాయ శిబిరాలు, పంపిణీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు.

వీటి ద్వారా 30,205 మంది బాధితులకు సహాయం అందిస్తున్నారు. గత 24 గంటల్లో 420 క్వింటాళ్లకు పైగా బియ్యం, దాదాపు 75 క్వింటాళ్ల పప్పు, 22 క్వింటాళ్లకు పైగా ఉప్పు, 2,000 లీటర్లకు పైగా ఆవ నూనెను పంపిణీ చేశారు.

వరదల ప్రభావం మనుషులకే కాకుండా పశువులు, కోళ్లపైనా పడింది.

సుమారు 31,650 పెంపుడు జంతువులు, కోళ్లు వరదల బారినపడ్డాయి. దీంతో గ్రామీణ కుటుంబాలపై ఆర్థిక భారం మరింత పెరిగింది.

వివరాలు 

ఉపశమనం లేని వానలు.. కొనసాగిస్తున్న వరద ఉద్ధృతి

వాతావరణ పరిస్థితులు కూడా ఇప్పట్లో ఉపశమనం ఇచ్చేలా కనిపించడం లేదు.

అసోంలోని గువాహటి వాతావరణ కేంద్రం చరైడియో, దిబ్రూగఢ్, జోర్హాట్, సివసాగర్, టిన్సుకియా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

గోలాఘాట్‌లోని నుమాలిగఢ్ వద్ద ధన్సిరి నది ఇంకా 'తీవ్ర వరద పరిస్థితి'లోనే ఉంది.

నుమాలిగఢ్ వద్ద ధన్సిరి, శ్రీభూమి వద్ద కుషియారా నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి.

ప్రస్తుతం బోర్నాలి బరువా కుటుంబం దెబ్బతిన్న ఇంటి సమీపంలోనే ఉంటోంది. తాత్కాలికంగా ఓ పొరుగింట్లో ఆశ్రయం పొందుతోంది.

ఇల్లు మళ్లీ నివసించడానికి అనువుగా మారిన తర్వాత అక్కడికి తిరిగి వెళ్లాలని ఆమె భావిస్తున్నారు.

వివరాలు 

వరదలతో సహజీవనమే మార్గం.. బోర్నాలి భావోద్వేగ వ్యాఖ్యలు

తాను ఇప్పుడు 'క్లైమేట్ రెఫ్యూజీ'గా భావిస్తున్నారా అని బీబీసీ అడిగిన ప్రశ్నకు ఆమె అలా అనుకోవడం లేదని చెప్పారు.

''మా ఆర్థిక, మానసిక బలాన్ని తిరిగి పొందగలిగితే జీవితం మళ్లీ గతంలో మాదిరిగానే ఉంటుంది'' అని బోర్నాలి అన్నారు.

అయితే అరటి దుంగలతో తయారు చేసిన తెప్పపై 97 ఏళ్ల వృద్ధురాలిని రక్షించిన ఘటన వారి కుటుంబానికి భద్రత అంటే ఏమిటో కొత్తగా అర్థమయ్యేలా చేసింది.

''ఇకపై వరదలతో కలిసి జీవించడం నేర్చుకోవాల్సిందే'' అని బోర్నాలి బరువా పేర్కొన్నారు.

ADVERTISEMENT