Loading...
Revanth Reddy: తెలంగాణ నీటి హక్కులపై రాజీ లేదు.. పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: రేవంత్‌ రెడ్డి
తెలంగాణ నీటి హక్కులపై రాజీ లేదు.. పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: రేవంత్‌ రెడ్డి

Revanth Reddy: తెలంగాణ నీటి హక్కులపై రాజీ లేదు.. పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: రేవంత్‌ రెడ్డి

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 15, 2026
12:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ నీటి హక్కుల విషయంలో ఎలాంటి రాజీ పడమని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి రైతుల కళ్లలో ఆనందం చూడటమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మాట్లాడారు. విద్య, వైద్య రంగాలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇప్పటికే ఉస్మానియా కొత్త ఆసుపత్రి భవన నిర్మాణం కొనసాగుతోందని తెలిపారు. అలాగే ఎనిమిది కొత్త మెడికల్‌ కాలేజీలకు భవనాలు నిర్మిస్తున్నామని వెల్లడించారు.

వివరాలు

విద్యలో తెలంగాణ మెరుగైన స్థానం

విద్యా సూచీలో తెలంగాణ 21వ స్థానం నుంచి 14వ స్థానానికి చేరుకుందని సీఎం తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణం చేపట్టామని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా 100కు పైగా తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లను నిర్మించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందిస్తున్నామని తెలిపారు.

అక్రమాలకు తావులేకుండా తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ)ను ప్రక్షాళన చేశామని పేర్కొన్నారు.

వివరాలు

క్రీడలకు ప్రోత్సాహం

మట్టిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు సీఎం కప్‌ పోటీలు నిర్వహించామని రేవంత్‌రెడ్డి తెలిపారు. త్వరలో జరగనున్న ఖేల్‌ ఇండియా పోటీలకు హైదరాబాద్‌ ఆతిథ్యం ఇవ్వనుందని చెప్పారు.

రూ.1.95 లక్షల కోట్ల పెట్టుబడులు

టీఎస్‌ ఐపాస్‌ ద్వారా రాష్ట్రానికి రూ.1.95 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని సీఎం వెల్లడించారు. వీటి ద్వారా మరో 78 వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.

ప్రముఖ సంస్థలు హైదరాబాద్‌లో గ్లోబల్‌ కెపాబిలిటీ సెంటర్లు (జీసీసీ) ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు. ఇప్పటికే నగరంలో 355కు పైగా జీసీసీలు పనిచేస్తున్నాయని వెల్లడించారు.

అమెజాన్‌ సంస్థ తెలంగాణలో 7 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తోందని తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు

కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యం

రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని రేవంత్‌రెడ్డి అన్నారు.

ఇందులో భాగంగా మహిళలను ఆర్టీసీ అద్దె బస్సులకు యజమానులుగా చేశామని తెలిపారు.

15 లక్షలకు పైగా కొత్త రేషన్‌ కార్డులు

రాష్ట్రంలో 15 లక్షలకు పైగా కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేశామని సీఎం వెల్లడించారు. రెండో విడత కొత్త రేషన్‌ కార్డుల పంపిణీని స్వాతంత్ర్య దినోత్సవం రోజునే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

వృద్ధ తల్లిదండ్రుల సంక్షేమం కోసం చట్టం చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి, రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.

ADVERTISEMENT