ముందస్తు ఎన్నికలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు
కేంద్రం ప్రభుత్వం జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై కమిటీ వేయడం, త్వరలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్న నేపథ్యంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందస్తు సార్వత్రిక ఎన్నికలకు వెళ్లేందుకే కేంద్రం ఈ చర్యలు తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోది. ఈ వార్తలపై కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ స్పందించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన కేంద్రానికి లేదని నొక్కిచెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ తన పదవీ కాలం చివరి రోజు వరకు భారత పౌరులకు సేవ చేయాలని కోరుకుంటున్నారని అన్నారు. అలాగే అసెంబ్లీ ఎన్నికలను ఆలస్యం చేసే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదని చెప్పారు.
అధీర్ రంజన్ చౌదరి కమిటీలో భాగం కావాలి: అనురాగ్
ఒక దేశం, ఒకే ఎన్నికల నిర్వహణపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్రం ఒక కమిటీని వేసినట్లు అనురాగ్ ఠాకూర్ చెప్పారు. కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి కమిటీలో భాగం కావాలని ప్రభుత్వం కోరుకుంటుందని మంత్రి చెప్పారు. సెప్టెంబర్ 18న ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అయితే ప్రత్యేక సమావేశాల ఎజెండాను మాత్రం వెల్లడించలేదని కేంద్ర మంత్రి సూచించారు. ప్రత్యేక సెషన్ అజెండాను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తగిన సమయంలో వెల్లడిస్తారని ఠాకూర్ చెప్పారు. జమిలి ఎన్నికలపై రాజకీయ దుమారం రేగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మంత్రి ఈ ప్రకటన చేశారు.