LOADING...
Randhir Jaiswal: మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు భారత్ ఘాటు హెచ్చరిక
మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు భారత్ ఘాటు హెచ్చరిక

Randhir Jaiswal: మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు భారత్ ఘాటు హెచ్చరిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 21, 2026
10:53 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలోని ముస్లిం ప్రార్థనా స్థలాలకు ముప్పు పొంచి ఉందంటూ పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు ఆయనకు లేదని స్పష్టం చేసింది. జర్దారీ చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమైనవని, పూర్తిగా అనవసరమైనవని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. వారణాసిలోని కాశీ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న గంజ్ షహీదా మసీదుకు భారత రైల్వే శాఖ జారీ చేసిన నోటీసులను ఉద్దేశించి పాక్ అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై గురువారం స్పందించిన రణధీర్ జైస్వాల్.. జర్దారీ ప్రకటనను భారత్ నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తోందని వెల్లడించారు.

వివరాలు

మీ దేశంలోని పరిస్థితులను చక్కదిద్దుకోండి

భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యానించే అర్హత పాక్ అధ్యక్షుడికి ఏమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే పాకిస్థాన్‌లో మైనారిటీల హక్కుల ఉల్లంఘన, అక్కడ నెలకొన్న మానవ హక్కుల దయనీయ పరిస్థితులపై అంతర్జాతీయ వేదికల నుంచి వస్తున్న విమర్శలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇతర దేశాలకు హితబోధ చేయడానికి ముందు పాకిస్థాన్ తన దేశంలోని పరిస్థితులను చక్కదిద్దుకోవాలని జైస్వాల్ సూచించారు. ద్వేషాన్ని, మతతత్వాన్ని ప్రోత్సహించడం పాకిస్థాన్ జాతీయ విధానంగా మారినట్లు కనిపిస్తోందని ఆయన విమర్శించారు. భారత్ తన అంతర్గత విధానాలకు సంబంధించిన అంశాల్లో, ముఖ్యంగా జమ్మూకశ్మీర్ వంటి సున్నితమైన విషయాల్లో విదేశీ జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని గతంలోనే స్పష్టం చేసిన విషయాన్ని కూడా ఆయన మరోసారి గుర్తుచేశారు.

Advertisement